నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి దానియేలు 12:3వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "...నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు'' ప్రకారం నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుడం అంటే, మనము చాలాసార్లు, వారికి బోధించడము లేదా దేవుని వాక్యము చెప్పడము అని అనుకుంటాము. ఇంకను నీతిని గురించి వారు తెలుసుకోవాలంటే, నేరుగా వారి యొద్దకు వెళ్లి వారికి తెలియజేయాలి అని అనుకుంటాము. కానీ, నా ప్రియ స్నేహితులారా, వారు అర్థము చేసుకోవడం ఎంతో సులభమైన మార్గమేదనగా, వేరే వారు నీతిమార్గముననుసరించి నడవడం చూడడమే. మాటలకంటె చేతులే బిగ్గరగా మాట్లాడతాయి అనే సామెతను మనము విని ఉంటాము. ఎవరైన ఒకరు జీవించే విధానమును చూచి, ఇతరులు అర్థము చేసుకుంటారు. దేవుని బిడ్డగా, మీరు యథార్థతగా జీవించే విధానము, ఇతరులను గురించి పట్టించుకునే విధానము, మీరు దేవుని ఆజ్ఞలను పాటించే విధానము, ఇతరులకు నీతిమార్గములో నడవడము అంటే ఏమిటో ఒక మార్గదర్శకంగా ఉంటుంది. కష్ట సమయములో కూడా సత్యమును గురించి, నిశ్చలంగా నిలబడడము. ప్రజలు మీ ద్వారా నీతిని చూస్తారు. ఆ విధంగా మీరు దేవుని వాక్యము వైపు మీరు నడిపించగలుగుతారు.

అదేవిధముగా చేసినట్లుగానే, ఒక మిషనరీ ఉన్నారు. ఆమె పేరు ఎమీ కార్మైకేల్, భారతదేశంలో 55 సంవత్సరాలకు పైగా గడిపిన ఐరిష్ మిషనరీ. బానిసత్వము క్రింద ఉన్నటువంటి యౌవన అమ్మాయిలను కాపాడడమే ఆమె యొక్క ధ్యేయమై యున్నది. వారి గౌరవములను తొలగించబడునటువంటి పనులు చేయబడుతున్న అమ్మాయిలను కాపాడడము. అటువంటి యౌవన అమ్మాయిలను కాపాడడమే ఎమీ కార్మైకేల్ లక్ష్యమైయున్నది. పరిస్థితులు ఎంతో హానికరంగా ఉన్నప్పటికిని, తను ఒకవేళ దొరికిపోయి ఉంటే, అక్కడ ఉన్న స్థానిక అధికారులు ఆమెను ఎంతగానో కష్టపెట్టి ఉండేవారు. అయినప్పటికిని, తను భక్తిగా నిలుబడెను. ఇంకను ఆ యౌవనస్థురాలను పెంచి పోషించినది. వారికి ఒక క్షేమకరమైన స్థలమును ఇచ్చినది. యేసయ్యను గురించి వారికి తెలియజెప్పినది. వారికి చదువు నేర్పిస్తూ పెంచినది. దేవుని ప్రేమతో వారిని పోషించినది. దేవుని దృష్టిలో వారెంతో అమూల్యమైనవారు అని చెబుతూ, వారికి శక్తిని చేకూర్చినది. అనేకమంది అమ్మాయిలు ఇదే ధైర్యముతోను మరియు విశ్వాసముతో పెరిగారు. ఈ రోజు కూడా దోనా ఊర్ సహవాసము అను పేరుతో ఆ గృహము నడిపించబడుతుంది. వందలాది మంది పిల్లలను రక్షించడము వారు కొనసాగించుచున్నారు. వారికి ఒక క్షేమకరమైన ఒక స్థలమును కల్పించుచున్నారు. ఇంకను యేసయ్య ప్రేమతో వారిని బలపరుస్తూ వచ్చారు.

అవును, నా ప్రియమైన స్నేహితులారా, మీ జీవితము, మీ చేతులు, మీ కార్యాలు అనేకమందిని యేసునొద్దకు తీసుకొనివస్తాయి. నిరంతరము మీరు నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. ఈ రోజు కూడా ఎమీ కార్మైకేల్‌గారి యొక్క లక్ష్యము ఏ విధంగా కొనసాగుతుందని మనము చూశాము కదా! అదేవిధముగా, ప్రభువు మిమ్మును నిరంతరము ప్రకాశింపజేస్తాడు. మీరు అనేకమందిని నీతిమార్గములో నడిపిస్తుండగా వారందరు కూడా మీతో కూడా కలిసి ప్రకాశిస్తారు. యేసయ్యా, ప్రేమను అందరికి పంచుతూ, మీతో ప్రకాశిస్తారు. ఇది ఎంత అద్భుతమై విషయము కదా! ఈ రోజు మన జీవితాలను ఆ లక్ష్యము కొరకు సమర్పింకుందామా? 'ప్రభువా, మేము అనేకులను నీతిమార్గము వైపు త్రిప్పాలనుకుంటున్నాము అయ్యా, మేము నక్షత్రముల వలె ప్రకాశించాలి. నీ మహిమార్థమై మా చుట్టు అనేకమైన నక్షత్రములు ప్రకాశించాలని కోరుకుంటున్నాము' అని ఈ సమర్పణను ఇప్పుడు చేసినట్లయితే, నిశ్చయముగా, దేవుడు వెలుగుచుండు నక్షత్రములవలె మిమ్మును ప్రకాశింపజేస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ లోకంలో వెలుగుగా ఉండటానికి మమ్మును పిలిచినందుకు నీకు వందనాలు. దేవా, అనేకులను నీతిమంతుల వైపు నడిపించేవారు ఎప్పటికి నక్షత్రాల వలె ప్రకాశిస్తారని నీవు ఇచ్చిన వాగ్దానానికై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఇప్పుడు కూడా, ప్రభువా, దయచేసి నీ ప్రేమ, సత్యం మరియు నీతిని ప్రతిబింబించే జీవితాన్ని గడపడానికి మాకు సహాయం చేయుము. దేవా, మాటల కంటే మా చర్యలు బిగ్గరగా మాట్లాడునట్లుగా చేయుము. ప్రభువా, కష్ట సమయాల్లో కూడా సత్యంలో స్థిరంగా నిలబడటానికి మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితం నీ పవిత్రతకు సాక్ష్యంగా ఉండుటనట్లుగా చేయుము. యేసయ్యా, ఇతరులను జాగ్రత్తగా చూసుకోవడానికి, నిజాయితీగా ప్రేమించడానికి మరియు యథార్థంగా నడవడానికి మమ్మును ఉపయోగించుకొనుము మరియు ఇతరులు మాలో నిన్ను చూచునట్లుగాను మరియు మా జీవితంలో వారు నీ మాట వైపు ఆకర్షించబడునట్లుగాను, కృపను దయచేయుము. తండ్రీ, మేము ఈ రోజు ఈ దైవీకమైన పరిచర్యకు మమ్మును అంకితం చేసుకొనుచున్నాము. దేవా, మా జీవితం ప్రకాశించే నక్షత్రంలా ఉండునట్లుగా కృపను అనుగ్రహించుము. ప్రభువా, మేము అనేకులను నీ వైపుకు నడిపించునట్లుగా మాకు సహాయము చేయుమని మా ప్రభువైన యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.