నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఆదికాండము 15:1వ వచనమును మనము ధ్యానించుకుందాము. ఆ వచనము, "ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.'' ఆలాగుననే, బైబిల్‌లో మరొక వచనమును మనము చూద్దాము, 2 సమూయేలు 22:3వ వచనమును మనము చదివినట్లయితే, దావీదు కూడా అదేవిధముగా చెబుతున్నాడు, "నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయ స్థానము. ఆయనే నాకు రక్షకుడు బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే'' అని దావీదు చెప్పినట్లుగానే, ప్రియులారా, ఈ అనుభవమును మీరు కూడా కలిగియున్నారా? ఒకవేళ ఈ అనుభవమును మీరు కలిగి ఉన్నట్లయితే, మీరు అబ్రాహాము వలె మరియు దావీదు వలె దీవించబడిన వారిగా ఉంటారు. అంతమాత్రమే కాదు, మీరు ధన్యులు అవుతారు.

నా ప్రియులారా, ఈ ఆశీర్వాదమును మనము ఎలా పొందుకోవాలి? బైబిల్‌లో 2 సమూయేలు 22:31 మరియు కీర్తనలు 18:30వ వచనములను మనము చదివినట్లయితే, "దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము ఆయన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము'' ప్రకారం ఆయన శరణుజొచ్చు వారికందరికి ప్రభువు కేడెముగా ఉన్నాడు. స్నేహితులారా, కనుకనే, మీ పూర్తి నమ్మకాన్ని ప్రభువు మీద ఉంచండి. ఆయనను గట్టిగా హత్తుకొనండి మరియు ఆయనతో ఈలాగున చెప్పండి, 'నీవే నాకు సమస్తము, ఇంకను దేని యందు నేను నమ్మకముంచలేదు. ప్రభువా, నీవే నాకు కేడెము అని చెప్పండి.' మీరు ఆయన యందు నమ్మకము ఉంచినప్పుడు, ఆయన మీకు కేడెముగా ఉంటాడు. ఇంకను సామెతలు 2:7వ వచనమును మనము చూచినట్లయితే, "ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు'' ప్రకారము స్నేహితులారా, మీ జీవితమును ఒకసారి పరీక్షించుకొనండి. మీరు యథార్థమైన జీవితమును జీవించుచున్నారా? ప్రభువు మిమ్మును నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. ఆయన యెదుట నీతిగల జీవితమును జీవించినప్పుడు, ప్రభువు మీతో ఉండి బహుమానమునిచ్చి, మీ సమస్యలన్నిటిలో నుండి ఆయన మీకు సహాయము చేస్తాడు. అందుకే బైబిల్‌లో సామెతలు 30:5వ వచనమును చూచినట్లయితే, "దేవుని మాటలన్ని యు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము'' ప్రకారం ఆయనను ఆశ్రయించు మీకు ప్రభువు కేడెముగా ఉంటాడు. కనుకనే, "మీరు నమ్మినట్లయితే, నిశ్చయముగా మీరు దేవుని మహిమను చూచెదరు'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కనుకనే, మీరు ధైర్యముగా ఉండండి.

నా ప్రియ స్నేహితులారా, అయితే, దేవుడు మీకు సమస్తమును జరిగిస్తాడు అని మీరు నమ్ముచున్నారా? మీ పూర్తి నమ్మకాన్ని ప్రభువుపైన ఉంచుతున్నారా? ఆలాగున ఆయన యందు మీ నమ్మకాన్ని ఉంచినప్పుడు ఆయన మీకు కూడా కేడెముగా ఉంటాడు. బైబిల్‌లో ఎఫెసీయులకు 6:16వ వచనమును మనము చదివినట్లయితే, " ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు'' ప్రకారం సాతాను అనేకమైన అగ్ని బాణములను మీ జీవితములోనికి తీసుకొని రావచ్చును. కానీ, విశ్వాసమను డాలును మీరు పట్టుకొని ఉన్నట్లయితే, ప్రభువు ఇప్పుడే మిమ్మును విడిపిస్తాడు. ఇప్పుడే, మీ జీవితములో అద్భుతములను చేస్తాడు. ఆయన మీకు కేడెముగా మారుతాడు. మీరు మీ సమస్యలన్నిటి నుండి మీరు విడుదల పొందుకుంటారు. కనుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడే, అటువంటి ఆశీర్వాదమును మీరు పొందుకొనబోవుచున్నారు. కాబట్టి, మీరు దేవుని యందు నమ్మిక ఉంచి, ఆయనను ఆశ్రయించండి, యథార్థవంతులుగాను, యుక్తమార్గములో నడుచుకున్నపుపడు, ఆయన నేటి వాగ్దానము ద్వారా మీకు కేడెముగా ఉండి, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మా అమూల్యమైన ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ అద్భుత సన్నిధానమునకై నీకు వందనాలు. ప్రభువా, నీ ప్రభావమంతటితో దిగివచ్చి, నిన్ను నమ్ముచున్న మాకు నీవు కేడెముగా ఉండుము. యేసయ్యా, నీ ప్రస్తమైన రక్తముతో మమ్మును కప్పి ఉంచుము మరియు నీ మంచితనమును, నీ కృపను పొందుకొనునట్లుగాను, చీకటి అంతయు మా నుండి పారద్రోలుము. దేవా, అబ్రాహాము మరియు దావీదులకు నీవు కేడెముగా ఉన్నట్లుగానే నీవు మాకు కేడెముగాను, ఆశ్రయముగా మరియు గొప్ప బహుమానముగా ఉన్నందుకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, నమ్మకంతో నిండిన హృదయంతో మేము నీ ముందుకు వచ్చుచున్నాము, నీవే మా సర్వస్వం అని అంగీకరించుచున్నాము. ప్రభువా, మేము నీలో మాత్రమే మా పూర్తి నమ్మకాన్ని ఉంచుచుచున్నాము. దేవా, మా ఆపత్కాలములో నీవే మాకు ఆశ్రయం మరియు శత్రువు అగ్ని బాణాల నుండి మమ్మును కాపాడేవాడు. కనుకనే ప్రభువా, నీ యెదుట మేము నిజాయితీగా నడవడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా విశ్వాసం బలంగా ఉండునట్లుగాను మరియు మా హృదయం యథార్థంగా ఉండునట్లుగా మార్చుము. ప్రభువా, ఈ రోజు, మేము నిన్ను నమ్మాలని మరియు విశ్వసించాలని ఎంచుకుంటు న్నాము. దేవా, ఇప్పుడు మరియు ఎల్లప్పుడు నీవు మా కేడెము అని మేము ప్రకటించుచున్నాము. ప్రభువా, మేము యథార్థవంతులుగాను మరియు యుక్తమార్గము తప్పక నడుచుకొనువారినిగాను మమ్మును మార్చుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.