నా ప్రియమైన స్నేహితులారా, నేడు మనము ప్రభువు యొద్ద నుండి శ్రేష్టమైనదానిని ఎదురు చూద్దాము. దేవుడు అద్భుతాల మార్గములోనికి మనలను తీసుకొని వెళ్లాలని మన పట్ల కోరుచున్నాడు. ఆ రీతిగా ఆయన మిమ్మును కూడా ఆదరించి, మీతో మాట్లాడి మరియు తనను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 60:22 వ వచనమును మన ధ్యానము నిమిత్తము తీసుకొనబడినది. ఆ వచనము, "వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును'' ప్రకారం దేవుడు ఎన్నికలేని వారిని ఆయన బలమైన జనముగా మారుస్తాడు. అవును, ఈ రోజు మీరు, ' నేను అత్యంత అల్పునిగా ఉన్నానని అనుకుంటున్నారా?' అయితే, దిగులుపడకండి, దేవుడు మిమ్మును బలమైన జనముగా మారుస్తాడు. ఒకవేళ, ఈ రోజు, మీరు ఉన్న చోట మీరు అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నట్లుగా భావించుచున్నారా? బహుశా! మిమ్మును ప్రజలకు చూపించుకోలేనంతగా అవమానముతో ఉండియున్నారా? తద్వారా, ఎంతగానో భయపడుచున్నారా? ఎందుకనగా, మీరు సహించియున్న అవమానమును బట్టి, మీరు మీ మానసిక స్థైర్యమునంతటిని కోల్పోయి ఉండవచ్చును. ఒకవేళ, ప్రజలు ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తూ, బాధించుచున్నారేమో? తద్వారా, మీరు దాగియుండవచ్చును లేక ప్రజలు మిమ్మును తక్కువగా అంచనా వేయుచున్నారేమో, మీకు చూపించడానికి ఏమి లేదు అన్నట్లుగాను, ఈ రోజు మీరు చిన్నవానిగా, తక్కువ స్థాయిలో ఉన్నారేమో? ఈ రోజు మీరు అల్పులుగా ఉన్నారని చింతించుచున్నారా? కానీ, ఆయన అట్టి వారిని ఏర్పరచుకొను దేవుడుగా ఉన్నాడు. నేడు ఒంటరిగా ఉన్న మిమ్మును వేయి మందిగా చేయుటకు ఆయన మిమ్మును ఎన్నుకొని యున్నాడు. ఎన్నికలేని మిమ్మును బలమైన జనముగా చేయుచున్నాడు.

నా ప్రియులారా, ఆయన చేయగల అద్భుతమైన శక్తిని మీ ద్వారా కూడా కనుపరచు నిమిత్తము ఆయన మిమ్మును ఏర్పరచుకొనియున్నాడు. ఆయన ఇప్పటికే వేయి రెట్లుగా ఎవరినైనను ఆశీర్వదించినట్లయితే, లోకము దానిని గురించి ఎక్కువగా పట్టించుకోదు. కానీ, మనము చిన్నవారిగాను, అల్పులుగా ఉండటము కూడా ఎంతో మంచిదే. తద్వారా, మన జీవితాలలో అల్పునికి దేవుడు ఏమి చేయగలడో మనము ప్రజలకు చూపించగలము. యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించినప్పుడు, యేసు కొండ యెక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చుండెను. కొండ మీద యేసు కన్నులెత్తి ఆయన బోధను వినడానికి వచ్చిన బహు జనులు తన యొద్దకు వచ్చెను. మరియు ఒక చిన్న పిల్లవాడు కూడా వచ్చాడు. ఆయన వారందరిని చూచి, వీరు భుజించుటకు ఇక్కడ ఏమైన ఆహారము ఉన్నదా? అని వారిని అడిగినప్పుడు, యేసు ఆ చిన్న పిల్లవాడు తన యొద్ద ఉన్న కొన్ని రొట్టెలను, కొన్ని చేపలను యేసు యొద్దకు తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఆ రోజున ఏమి సంభవించినదనగా, యేసు ఆ పిల్లవానిని అంగీకరించాడు. ఆ పిల్లవాని యొద్ద కలిగియున్న దానినంతటిని తీసుకొని, దానిని ఆశీర్వదించి, ఆ ఆహారము ద్వారా అద్భుతకార్యమును జరిగించాడు. చూడండి, ఆ పిల్లవాడు తీసుకొని వచ్చిన కొన్ని రొట్టెలు, చేపలు వానికి మాత్రమే ఆహారముగా కాకుండా, వేలకొలది మందికి ఆహారముగా పంచిపెట్టబడినది. కారణము, యేసు ఆ ఆహారమును వృద్ధిపొందింపజేశాడు. ఆ రోజు ఆ చిన్నపిల్లవానిని యేసు ప్రజలకు భోజనము పెట్టు నిమిత్తము వాడుకున్నందున అక్కడ ఉన్న వారందరు కూడా వానిని అభినందించియుండవచ్చును కదా!

అవును, నా ప్రియులారా, ప్రభువు ఆ రీతిగా మన జీవితాలలో క్రియ చేస్తాడు. ఒకవేళ నేడు మీరు అల్పులుగా భావించుచున్నారా? అయితే, దిగులుపడకండి, ప్రభువు మీలో మీ ద్వారా అద్భుత కార్యములు జరిగించి ఉండి యున్నప్పుడు, మీరు వేయి మంది వలె కనబడెదరు. మనము ఈ వాగ్దానమును స్వతంత్రించుకుందామా? ఆలాగున స్వతంత్రించుకోవాలనగా, మీరు ఆయన యొద్దకు వచ్చినట్లయితే, నిశ్చయముగా, ఆయన మిమ్మును నేటి వాగ్దానము ద్వారా మీలో ఒంటరిగా ఉన్నవారిని వేయిమందియగునట్లుగాను, ఎన్నికలేనివారిని బలమైన జనమగునట్లుగాను చేసి, ఆయన తగిన కాలమున మీ కార్యమును త్వరపెట్టి, మిమ్మును హెచ్చింపజేస్తాడు.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నేడు మేము తక్కువవారముగాను, నలిగినవారముగాను, భయపడుచున్నవారముగా నీ సన్నిధికి వస్తున్నాము. కానీ, నీ వాక్యం మలో ఒంటరిగా ఉన్నవారిని వెయ్యి మంది అవుతారని చెప్పినట్లుగానే, ఈ వాగ్దానం మా కోసమే అని మేము నమ్ముచున్నాము. దేవా, మేము ఇప్పుడు దాగి ఉన్నట్లు అనిపించినప్పటికీ, నీవు మమ్మును చూస్తున్నావు. ప్రభువా, నీవు మమ్మును చూస్తున్నందుకై నీకు వందనాలు, లోకము మమ్మును విడిచిపెట్టి యున్నప్పుడు, ఎవ్వరు కూడా మమ్మును ప్రోత్సహించలేనప్పుడు, లేక మమ్మును ఎవరు కూడా గుర్తించలేనప్పుడు, నీవు గొప్ప దేవుడవుగా ఉన్నప్పటికిని, నీవు మమ్మును చూస్తున్నావు, నీ కనికరము కొరకు మరియు నీవు మా మీద చూపించిన అనుగ్రహము కొరకై నీకు వందనాలు. ఇప్పుడు ప్రభువా, నీవిచ్చిన వాగ్దానము ద్వారా మా జీవితాలను ఆశీర్వదించి, మా పట్ల అద్భుత కార్యాలను జరిగించుము. దేవా, మేము కలిగియున్నదానిని విస్తరింపజేయుము. ప్రభువా, మమ్మును వేయి రెట్లుగా దీవించుము. ప్రభువా, ఈ ఆశీర్వాదమును మేము పొందుకొనునట్లుగాను, లోకము యేసు మాతో ఉన్నాడనియు, ఆయన మమ్మును దీవించాడని చూచునట్లుగాను నీ కృపను మాకు దయచేయుము. దేవా, మేము అనర్హులమని అనిపించినప్పటికి, నీవు మమ్మును ఎన్నుకున్నావు. ప్రభువా, మా దగ్గర ఉన్న కొద్దిపాటి, మా తలాంతులను, మా స్వరం, మా హృదయమును తీసుకొని నీ మహిమ కొరకు విస్తరింపజేయుము. దేవా, వేలాది మందికి ఆహారం ఇవ్వడానికి నీవు ఒక చిన్న పిల్లవాని భోజనాన్ని ఉపయోగించుకున్నట్లుగానే, మా జీవితాన్ని అద్భుతాల కొరకు ఒక పాత్రగా ఉపయోగించుకొనుము. ప్రభువా, సిగ్గు లేదా భయంతో వెనక్కి తగ్గకుండా, నీ ప్రేమ మరియు ఉన్నత పిలుపులో ధైర్యంగా ముందుకు నడవడానికి మాకు సహాయం చేయుము. దేవా, నేడు అద్భుతాలకు నిలయముగా, మా అత్యల్ప జీవితాన్ని సమృద్ధిగా మార్చు దినముగా ఉండునట్లుగా చేయుమని యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.