నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము మిమ్మును పలకరించడము నాకు చాలా సంతోషముగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 30:15వ వచనమును మనము నేడు ధ్యానించుకుందాము. ఆ వచనము, "...మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును'' అని చెప్పబడిన ప్రకారం అనేకసార్లు మన జీవితములో కష్టాలను ఎదుర్కొన్నప్పుడు, కష్టతరమైన పరిస్థితులు మనకు ఉన్నప్పుడు, మనము కదల్చలేని పెద్ద కొండ మనకు ఎదురుగా ఉన్నప్పుడు, ఆ కొండను కదిలించడానికి ఎంతో శ్రమపడినప్పటికిని మరియు ఆ సమస్యను అధిగమించడానికి, ఆ కష్టతరమైన పరిస్థితిని అధిగమించడానికి, మనకు తెలిసిన వారందరితో మాట్లాడతాము, మొఱ్ఱపెడతాము, ఇంకను ఏడుస్తాము. మరియు అక్కడ, ఇక్కడ సహాయము కొరకు వెదకుతాము. అందువలన మనము అనేకసార్లు సమాధానమును కూడా కోల్పోతాము. బైబిల్ గ్రంథములో అటువంటి ఒక పరిస్థితులలో ఉన్న యెహోషువతో ప్రభువు మాట్లాడడము మనము చూడగలము. ఇశ్రాయేలీయుల ప్రజలు వాగ్దానపు దేశము వైపు నడుస్తుండగా, యెరికో పట్టణమును వారు దాటవలసి వచ్చినది. యెరికో గోడలు మనము ప్రవేశించలేనంత ఎత్తుగా ఉంటాయి. కానీ, అటువంటి సమయములో వారు ఏమి చేయగలరు? వారెంతో శబ్ధము చేయుచూ, వారి సైన్యమంతటిని తీసుకొనివచ్చి, ఆ యెరికో గోడలను కూల్చడానికి ప్రయ్నతించవచ్చును.

కానీ, నా ప్రియులారా, ప్రభువు వారిని మౌనముగా ఉండి, ఆరు రోజులు ఆ యెరికో గోడలు చుట్టు తిరిగి రమ్మని ఆజ్ఞాపించాడు. అది వారికి ఎంతో విచిత్రముగా ఉండవచ్చును. ఒకవేళ వారు, మమ్మును మౌనముగా, నిశ్శబ్దముగా ఊరకుండమని ప్రభువు ఎందుకు చెబుతున్నాడు? ఈ పట్టణమును జయించబోవుచున్నాము అని తెలిసి ఎందుకు ఊరకుండాలి? అని తలంచి ఉండవచ్చును. కానీ, ప్రభువు యెహోషువాకు ఏమైతే ఆజ్ఞాపించాడో అదే విధముగా అతడు తన సైన్యమంతటికి కూడా, ' మీరు ఊరకుండవలెను నిశ్శబద్ధముగా ఆరు రోజులు పట్టణము చుట్టు తిరిగి, ఏడవ రోజు ప్రభువు ఆజ్ఞాపించిన సమయమున కేకలు వేయాలనియు అప్పటికి వరకు ఏ శబద్ధము చేయకూడదని చెప్పాడు.' మోషే నాయకత్వము క్రింద ఉన్నందున, ఇశ్రాయేలీయుల ప్రజలు ఏ విధముగా స్పందిస్తారో యెహోషువాకు తెలిసియుండవచ్చును. ఒకవేళ, ఇశ్రాయేలీయులు వారి యొక్క స్వంత బలమును ఉపయోగించి ఎంత అరిచిన లేక వారి యొక్క స్వంత జ్ఞానము ఉపయోగించి వారు ఏమి చేసినను, వారు ఆ పట్టణమును జయించకలేకపోయి ఉండేవారు. కానీ, ప్రభువు యెహోషువ ఆజ్ఞాపించిన రీతిగానే, నిశ్శబ్దముగా వారు ఆరు రోజులు ఆ పట్టణము చుట్టు సంచరించగా, ఏడవ రోజు యెరికో గోడలు చుట్టు వారు తిరుగుచూ, గట్టిగా కేకలు వేయుచూ, దేవుని స్తుతించినప్పుడు, ఆ గోడలు కూలిపోయినవి. అవును, ప్రియులారా, ప్రభువు యొద్ద నుండి వారు బలమును పొందుకున్నారు. ఆయన యందు వారు నమ్మిక యుంచారు కాబట్టి, ఏడవ రోజు ఆ యెరికో గోడలు కూలిపోయాయి. హల్లెలూయా!

నా ప్రియులారా, బైబిల్ నుండి కీర్తనలు 46:10వ వచనములో ఉన్న రీతిగానే, "ఊరకుండుడి, నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును భూమి మీద నేను మహోన్నతుడనగుదును'' అని దేవుడు మీ జీవితము పట్ల కూడా ఇలాగున అంటున్నాడు, 'ఊరకుండుడి నేనే దేవుడని తెలిసికొనుడి, మీ జీవితములో కూడా నేనే సమస్తమును చేస్తాను' అని సెలవిచ్చుచున్నాడు. కాబట్టి, ఆయన ఆజ్ఞలను వినండి, మీ కష్ట సమయములలో ఆయన యొక్క సమాధానమును పొందుకోవడానికి ప్రయత్నించండి. ఊరకుండుడి, ఆయన యందు నమ్మిక ఉంచుము, అదే మీకు బలముగా ఉంటుంది. మా జీవితములో మరియు మా కుటుంబములో కూడా అనేకమైన కష్టమైన పరిస్థితులను మేము ఎదుర్కొంటున్నప్పుడు, మనుష్యులముగా మాకు వచ్చేటటువంటి మొదటి ప్రేరేపణ లేక ఆలోచన ఏదనగా, వెళ్లి మనుష్యుల దగ్గర సహాయము పొందుకొని, ఏలాగైన మాకున్న కష్ట సమయములో న్యాయము తీర్చుకోవాలని మాకు అన్పిస్తుంది. కానీ, ఎల్లప్పుడు ఊరకుండుమని ప్రభువు మాకు నేర్పించాడు. ఇంకను ఆయననే నమ్మాలి అని మాకు నేర్పించాడు. ఆ పరిస్థితుల నుండి మమ్మును ఎలా బయటకు తీసుకొని రావాలని ఆయనకు తెలుసు. అది ఎందుకు ఆయన అనుమతించాడు అని ఆయనకు తెలుసు. కనుకనే, చివరిలో ఆయన సమాధానమే మాకు బలముగా ఉంటుంది. ఆయన నామము మా ద్వారా ఘనపరచబడుతుంది. మా జీవితములో కూడా మేము కష్టమైన సమయమును ఎదుర్కొన్న ప్రతిసారి కూడా, ప్రభువే తన సమాధానమును మాకు ఇచ్చియున్నాడు. ఇంకను ఆయన యందే నమ్మిక ఉంచునట్లుగా చేస్తాడు. ఏ మనుష్యులు కాదు, ఏ బంధువులు కూడా కాదు, ఏ దగ్గర స్నేహితులు కాదు, కేవలము దేవుడు మాత్రమే మాకు సహాయమును మరియు సమాధానమును ఇస్తాడు. మరల, మరల ఆయన మాకు విజయమును అనుగ్రహించుచూ ఉన్నాడు. అదేవిధముగా, నా ప్రియులారా, నేడు మీ జీవితములో కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు ఊరకుండండి, ప్రభువును నమ్మండి, మీ జీవితమును పరిపాలించుచున్న దేవుడు ఆయనే అని తెలుసుకొనండి. కనుకనే, చివరిలో ఆయన సమాధానము మీకు ఈ రోజు బలముగా ఉంటుంది. ఆయన నామము మీ ద్వారా ఘనపరచబడుతుంది. ఇప్పుడే ఈ ఆశీర్వాదమును పొందుకుందామా, మీ పరిస్థితులన్నిటిలో మీరు ఊరకుండినట్లయితే, ప్రభువు మీకు విజయమును అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవిస్తాడు.

ప్రార్థన:
స్తుతులకు పాత్రుడవైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ క్షణంలోని నిశ్శబ్దంలో, మేము నమ్మకంతో నిండిన హృదయంతో నీ సన్నిధికి వచ్చుచున్నాము. దేవా, నీవు మాకు ఊరకుండమని చెప్పి, మాకు సహనమును నేర్పించినందుకై నీకు వందనాలు. యేసయ్యా, నీ సన్నిధిలో విశ్రాంతి తీసుకోవడానికి మరియు మా స్వంత ప్రయత్నాలలో కాకుండా నిశ్శబ్దంలో మరియు నీపై విశ్వాసంలో మా బలాన్ని కనుగొనడానికి మాకు నేర్పించుము. దేవా, మా జీవితం క్లిష్టమైనదిగా అనిపించినప్పుడు మరియు మా చుట్టూ ఉన్న గోడలు అధిగమించలేనంత ఎత్తుగా అనిపించినప్పుడు, నీ మార్గాలు ఎల్లప్పుడూ ఉన్నతమైనవని గుర్తుంచుకోవడానికి దయచేసి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా స్వంత జ్ఞానము మరియు మా స్వంత బలము మీద ఆధారపడకుండా, నీవే మాకు బలము, ఆధారమని నిన్ను పూర్తిగా నమ్మడానికి మాకు సహాయము చేయుము. తండ్రి, నీవు మమ్మును వేచి ఉండమని అడిగినప్పుడు మౌనంగా ఉండటానికి ధైర్యాన్ని, నీ శాంతి మా హృదయంలో రాజ్యమేలునట్లుగాను మరియు ప్రతి శోధన ద్వారా మమ్మును నడిపించుము. దేవా, మా ప్రతి పరిస్థితిని నీ హస్తాలకు సమర్పించుకొనుచున్నాము. ప్రభువా, మా పరిస్థితులన్నిటిని అధిగమించుటకు నీవు మాకు సహాయము చేస్తావని మేము నమ్ముచున్నాము. దేవా, నీవు మా పక్షమున పనిచేస్తున్నావని మేము యెరిగియున్నాము. దేవా, మాకు విజయమును ఇచ్చి, నీ నామమును మహిమపరచునట్లుగా చేయుము. ప్రభువా, మా పరిస్థితుల నుండి మమ్మును విడిపించి, విజయమును మాకు అనుగ్రహించి, స్తుతిగానములు మేము చేయునట్లుగాను, నీ నామమును మహిమపరచునట్లుగాను మాకు కృపను దయచేయుము. దేవా, ఇప్పుడు కూడా నీ యొక్క సమాధానముతో మమ్మును నింపి, మా ఆత్మను, శరీరమును, మనస్సును బలపరచుము. దేవా, ఈ దినమంతయు మమ్మును నీ కృపతో దీవించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.