నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి లేవీయకాండము 26:11వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీ యందు నా మనస్సు అసహ్యపడదు'' ప్రకారం దేవుడు మన మధ్యలో నివసించుట ఎంతటి గొప్ప ఆశీర్వాదము కదా! ప్రభువు ఎప్పుడు మన మధ్యలోనికి వచ్చి నివసిస్తాడు? నాకు అమూల్యమైన స్నేహితులారా, ప్రభువును మన మధ్యలో కలిగి ఉండడము ఎంత గొప్ప విషయము కదా! ప్రభువును ఇష్టపెట్టుటకు అనేక మార్గములు కలవు. అందులో ఒకటి ఈ విధముగా చెప్పబడియున్నది.

బైబిల్ నుండి యోహాను 14:23వ వచనమును మనము చదివినట్లయితే, "యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము'' అని సెలవిచ్చుచున్నాడు. స్నేహితులారా, కేవలము మీరు ప్రభువును ప్రేమించాలి. ఇంకను దేవుని వాక్యమును చదవాలి. అనుదినము మొదటిగా మీరు దానిని చేయాలి. మీరు నిద్ర లేచిన వెంటనే, మీ బైబిల్ గ్రంథమును తీసుకొని శ్రద్ధగా చదువుతూ, ప్రభువు మీతో మాట్లాడవలెనని, ప్రార్థన చేయుచూ, ఆయనను అడగాలి. బైబిల్‌లో కీర్తనలు 32:8 వ వచనములో చూచినట్లయితే, "నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆ విధంగానే, అనుదినము మనము యేసయ్యను కలిగియుండడము ఎంత గొప్ప ధన్యత కదా!

నా ప్రియులారా, దేవుని వాక్యమును చదవడము ద్వారా, మీరు ఆయనను ఘనపరచుట ద్వారా మీరు ఆయనకు ఇష్టులై ఉంటున్నారు. తద్వారా, ఆయన మీ మధ్యలో వచ్చి నివసిస్తాడు. ప్రతిరోజు కూడా మీరు, 'నేను ఏమి చేయగలుగుతాను, నా చుట్టు ఉన్న ప్రజలను నేను ఎలా ఇష్టపెట్టగలుగుతాను?' అనే విషయాలపైన మీరు చింతించనవసరము లేదు. మీరు దేవుని ప్రేమించిన వారైనట్లయితే, ఆయన మీతో ఉండి, అద్భుతముగా మిమ్మును నడిపిస్తాడు. బైబిల్‌లో అపొస్తలుల కార్యములు 10:44 నుండి 46వ వచనముల వరకు మనము చూచినట్లయితే, కొర్నేలీ అను వ్యక్తిని గురించి చదువుతాము. అతడు ఎంతో శ్రద్ధగా దేవుని వెదకి యున్నాడు. అందుకే ప్రభువు తన సేవకుడైన పేతురును కొర్నేలీ యొద్దకు పంపించి, ఏమి చేయాలో అతనికి తెలియపరచి, తన కుటుంబమునంతటిని ఆశీర్వదించాడు. అవును, ప్రియ స్నేహితులారా, మీరు కూడా అదే ఆశీర్వాదమును పొందుకొనగలరు. కనుకనే, నేటి నుండి దేవుని వాక్యమును శ్రద్ధతో చదవండి, దానిని ధ్యానించండి. తద్వారా, ప్రభువును ఇష్టపెట్టండి. మీరు ఏమి చేసినను, ప్రభువు యెదుట ఆయనకు ఇష్టమైన జీవితమును కలిగియుండాలి. అప్పుడు ప్రభువు సన్నిధి ఎల్లప్పుడు మీకు తోడుగా ఉంటుంది. దేవుడు కొర్నేలీ కుటుంబాన్ని దీవించిన రీతిగా, నేడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని అద్భుత రీతిగా నేటి వాగ్దానము ద్వారా నడిపించి, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మహోన్నతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీవు మా మధ్య నివసించే నీ వాగ్దానానికి వందనాలు. ప్రభువా, ఆకాశము, భూమికి సృష్టికర్తయైన దేవా, నీవు మాతో ఉండాలని కోరుకుంటున్నావని తెలుసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. తండ్రీ, నీ అద్భుత సన్నిధానమునకై నీకు వందనాలు. దేవా, నీవు మా హృదయాలను తాకుము, మేము నీ యొద్దకు వచ్చునట్లుగాను, నీకు సమీపముగా ఉండునట్లుగాను, నీ యందు భయభక్తులతో నీ వాక్యమును మేము చదువునట్లుగా, నీ సన్నిధితో మరియు నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకముతో మమ్మును నింపుము. ప్రభువా, నీ యొక్క ఆలోచన ద్వారా మమ్మును అద్భుతమైన మార్గములో నడిపించుము. ప్రభువా, ప్రతిరోజు నిన్ను గాఢంగా ప్రేమించడం మాకు నేర్పించుము. దేవా, ప్రతి ఉదయం మా మొదటి సమయము నీ వాక్యమును చదువుటకును మరియు నీకు ప్రీతిగల కార్యముగా నీ వాక్యం కొరకు మా హృదయం ఆకలిదప్పులతో ఉండునట్లుగా కృపను దయచేయుము. దేవా, మేము నీ వాక్యమును చదివినప్పుడు, లేఖనాల ద్వారా నీవు మాతో మాట్లాడుము మరియు మాకు బోధించుము మరియు నీ ప్రేమగల దృష్టితో మాకు ఆలోచన నిచ్చి, మమ్మును నడిపించుము. ప్రభువా, మాలో ఉన్న ప్రతి భయాన్ని విడిచిపెట్టి, నీ దైవీకమైన సన్నిధిలో విశ్రాంతి తీసుకోవడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీవు కొర్నేలీ యొద్దకు వచ్చి అతని కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగానే, నేడు మా గృహములోనికి మరియు మా జీవితములోనికి వచ్చి, మమ్మును ఆశీర్వదించుము. ప్రభువా, మమ్మును మరియు మా ప్రియులైన వారిని నీ సమాధానముతో ఆశీర్వదించుము. దేవా, నీ వాక్యం మాలో సజీవంగా ఉండునట్లుగాను మరియు మా జీవితం నీవు ఆనందించే నివాస స్థలంగా ఉండునట్లుగా చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.