నా ప్రియ సహోదరీ, సహోదరులారా, దేవుని మాటలను ధ్యానించడము ఎంతో ఆనందం. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 15:16 వ వచనమును మన కొరకు ఇవ్వబడినది. ఆ వచనము, "నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని...గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి'' ప్రకారం దేవుని మాటలు మనకు సంతోషాన్ని కలుగజేస్తుంది. దేవుని వాక్యమును భుజించడము అనగా అర్థము ఏమైయున్నది? ప్రభువు వాక్యము ఎప్పుడు మాట్లాడినా? మనము ఆయన మాటలను ఆలకించాలి. అది ప్రభువు వాక్యమును భుజించునట్లుగా ఉంటున్నది. దేవుని వాక్యము లోతులలోనికి మనము వెళ్లాలి. దేవుని వాక్యము మన హృదయములోనికి వచ్చినప్పుడు, అది ఇతరులకు ఆశీర్వాదకరముగా మారుతుంది. బైబిల్‌లో మత్తయి 4:4వ వచనమును మనము చూచినట్లయితే, "అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను'' ప్రకారం దేవుని వాక్యము మనకు జీవము అనుగ్రహిస్తుంది.
నా ప్రియులారా, దేవుని వాక్యమును మనము చులకనగా తీసుకొనకూడదు. దేవుని వాక్యము బైబిల్ గ్రంథములో ఎక్కడనుండైనను చదవవచ్చును అని అనుకొనకూడదు. ప్రతిరోజు అధ్యాయము వెంబడి అధ్యాయమును మనము దేవుని వాక్యమును చదవాలి. ప్రతిరోజు దేవుడు మన కొరకు ఒక మాటను కలిగియుంటాడు. జాగ్రత్తగా మనము దేవుని వాక్యమును చదవాలి. ఎందుకంటే, అది మనకు జీవమునిస్తుంది. బైబిల్‌లో యోహాను 6:63వ వచనమును చూచినట్లయితే, "ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై యున్నవి'' ప్రకారం మనలోనికి వెళ్లు దేవుని వాక్యము మన ఎముకలకు బలమునిస్తుంది. మన శరీరమునకు స్వస్థతనిస్తుంది. మన హృదయానికి సంతోషాన్ని కలుగజేస్తుంది. మన శరీరమంతా దేవుని వాక్యమును బట్టి సంతోషిస్తుంది. దేవుని మాటను మనము కనుగొనినప్పుడు, ఒక గొప్ప నిధిని కనుగొన్నట్టుగా ఉంటుంది. మన హృదయమందు దేవుని వాక్యమున్నట్లయితే, ఎంతో సంతోషాన్ని చేకూరుస్తుంది. మన పెదవులపై ఉన్న దేవుని వాక్యము ఇతరులకు ఒక సందేశముగా మార్చబడుతుంది. దేవుని వాక్యము మన చేతులలో ఉన్నట్లయితే, అది మన విశ్వాసమునకు ఒక ఆయుధముగా ఉంటుంది. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 119:103వ వచనములో చూచినట్లయితే, "నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి'' ప్రకారం దేవుని వాక్యము తేనెకంటె తీపిగా ఉంటుంది అని కీర్తనకారుడు అంటున్నాడు. దేవుని వాక్యము మన నోటి యందు ఉన్నప్పుడు, దేవుని వాక్యమును మనము ఎంతో ఆనందిస్తాము. అందుకే, ' అది ఎంతో మధురము' అని క్రీర్తనకారుడు వ్రాసియున్నాడు.
నా ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానించే సమయము నాకు ఎంతో మధురమైన సమయము అని కీర్తనాకారుడు ఒకచోట తెలియజేసియున్నాడు. దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించువారు వర్థిల్లుతారు. వారు ఏమి చేసినను, అది అభివృద్ధి నొందుతుంది. దేవుని వాక్యమునందు అంత గొప్ప ఆశీర్వాదములు ఉన్నాయి. బైబిల్ నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయములో ధన్యతల కొండపైన యేసు ప్రభువు, జనసమూహముతో మాట్లాడుతూ బోధించుచున్నప్పుడు, సమీప ప్రదేశముల నుండి వచ్చినటువంటి ప్రజలు మూడు రోజులు ప్రభువైన యేసుక్రీస్తు బోధనలు మరియు ఆయన చెప్పిన మాటలను వినుచుండిరి. అక్కడకు వచ్చినవారు ఒక్కరోజు కొరకు మాత్రమే ఆహారమును తీసుకొని వచ్చి యుండవచ్చును. కానీ, మిగితా రెండు రోజులు వారు ఆహారము ఏదియు తినలేదు. ఎందుకనగా, దేవుని వాక్యము వారిలో ఆకలిని కలిగించలేదు. దేవుని వాక్యము వారికి ఎంతో మధురముగా అనిపించి ఉండవచ్చును. యేసయ్యా, మాటలు వారు రాత్రింబగళ్లు వింటూ ఉండిపోవచ్చును. ఆయన వాక్యము వారి శరీరానికి ఎంతో బలాన్ని చేకూర్చి ఉండవచ్చును. అయితే, మూడవ రోజు చివరన యేసయ్య ఈ విధంగా అన్నాడు, 'ఈ ప్రజలపైన నేను ఎంతో కనికరపడుచున్నాను. వారు మూడు రోజులు ఏమి తినకుండా, నా యొద్దనే ఉన్నారు. వట్టి చేతులతో నేను వారిని ఇంటికి తిరిగి పంపించలేను. ఆ విధంగా వారిని ఆకలితో పంపించలేను. వారు మధ్య దారిలో ఒకవేళ పడిపోతారేమో?' అని చెప్పి, ఆయన కనికరముతో చలించిపోయి, యేసు వారికి రొట్టె మరియు చేపలను ఆహారంగా పంచి పెట్టాడు, ఆయన మనలను ఆధ్యాత్మికంగా పోషించడమే కాకుండా మన శారీరక అవసరాలను కూడా తీరుస్తాడని ఇక్కడ మాదిరి చూపించబడియున్నది. బైబిల్ నుండి యోహాను 6:35వ వచనములో చూచినట్లయితే, "అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే; నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు,'' ప్రకారము యేసయ్యా, జీవాహారమై యున్నాడు. ఆయన యొద్దకు వచ్చువారు, ఆకలిగొనడు, దప్పిగొనడు. దేవుని వాక్యము మన హృదయానికి సంతోషాన్ని చేకూరుస్తుంది. దేవుని వాక్యము మనకు బలమును ఇస్తుంది. ప్రతి సంవత్సరము కూడా ప్రభువు మా భర్తగారైన డాక్టర్. పాల్ దినకనర్‌గారికి ఒక వాగ్దానమును అనుగ్రహిస్తాడు. ఆ సంవత్సరమంతయు ఆ వాగ్దానము మనలను పోషించి, బలపరుస్తుంది. ప్రతిరోజు బైబిల్ గ్రంథము నుండి ప్రభువు ఎంతో కృపతో ఒక వాగ్దానమును మనకు ఇచ్చుచున్నాడు. ప్రతిరోజు టి.వి. కార్యక్రమముల ద్వారా ఆ వాగ్దాన వచనములను మనము ధ్యానించి, ఆనందిస్తాము. కనుకనే, బైబిల్ నుండి 2 పేతురు 1:19వ వచనమును చూచినట్లయితే, " మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది'' ప్రకారం దేవుని వాక్యము ద్వారా తన్నుతాను ప్రత్యక్షపరచుకుంటాడని చెప్పబడియున్నది. మనము ప్రపంచమునకు యేసయ్యను చూపెడతాము. ఆ విధంగా మనము దేవుని వాక్యమును కనుగొని, భుజించగలము. దేవుని వాక్యము మిమ్మును బలపరచును గాక, పోషించును గాక. మిమ్మును నూతనపరచును గాక. ప్రతిరోజు దేవుని వాక్యము మీకు నూతన ప్రత్యక్షతను ఇచ్చును గాక. మీ ద్వారా ప్రతిరోజు యేసు ప్రత్యక్షపరచబడును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, ఇప్పుడు కూడా నీ వాక్యము మా హృదయములోనికి వచ్చునట్లుగా చేయుము. యేసయ్యా, నీవే ఆ వాక్యమై యున్నావు. ప్రభువా, నీ వాక్యము ద్వారా మేము జీవించునట్లుగా చేయుము. దేవా, ఆ వాక్యము ఒక గొప్ప నిధివలెను మరియు మా హృదయములకు ఆనందమును కలుగజేయునట్లుగాను మరియు మా చేతిలో ఒక ఆయుధము వలె ఉండునట్లుగా చేయుము. దేవా, నీవాక్యమును మేము నిర్లక్ష్యము చేసినట్లయితే, మమ్మును క్షమించి, అనుదినము మా జీవితములో నీ వాక్యమును అందజేయుము. దేవా, ప్రతిరోజు నీ వాక్యమును చదవాలనే వాంఛను మాకు కలుగజేయుము. యేసయ్యా, నీ వాక్యమును జాగ్రత్తగా విని, దానిని ధాన్యించునట్లుగా చేయుము. తండ్రి, నీ దైవీకమైన వాక్యం ద్వారా మమ్మును స్వస్థపరచునట్లుగాను మరియు ప్రతి అడుగులో మమ్మును నడిపించునట్లుగా చేయుము. ప్రభువా, నీ వాక్యము మా జిహ్వాకు ఎంతో మధురమైనదిగాను, జీవమునిచ్చేదిగాను మరియు ఎంతో శక్తివంతమైనదిగా ఉండునట్లుగాను, యిర్మీయావలె నీ మాటలు మా దగ్గరకు వచ్చిన తోడనే, వాటిని ఆనందంతో భుజించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ మాట మా హృదయానికి ఆనందంగా మరియు మా శరీరానికి బలంగా మారునట్లుగా చేయుము. ప్రభువా, రొట్టె వలన మాత్రమే కాకుండా, నీ నుండి వచ్చే ప్రతి మాట కొరకు మేము ఆకలితో ఉండడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ వాక్యమును అనుదినము జాగ్రత్తగా వెదకునట్లుగా సహాయము చేయుము. దేవా, ఈ లోక శోధనలన్నిటి నుండి మమ్మును తప్పించి, నీ వాక్యము ద్వారా మా ఆత్మను ఉత్తేజపరచి మరియు మమ్మును బలపరచి, నీ వాక్యము ద్వారా మా జీవితములో విజయాన్ని చేకూర్చునట్లుగా చేయుమని మా ప్రభువైన యేసుక్రీస్తు జీవముగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.