నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 22:11వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు వానికి రాజు స్నేహితుడగును'' ప్రకారము మనము దేవుని యొక్క వాక్యముతో నింపబడి ఉండాలి. అప్పుడు మాత్రమే మన నోరు దయగల మాటలను మాట్లాడగలుగుతుంది. బైబిల్ నుండి మత్తయి 12:34వ వచనమును దీనిని తెలియజేయుచున్నది. ఆ వచనములో చూచినట్లయితే, "సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా'' ప్రకారం ఒక వ్యక్తి పొంగిపొర్లునంతగా పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉన్నప్పుడు, అతని నోరు కూడా దయగల మాటలతో పొంగిపొర్లుతుంది. అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి ప్రవచన వాక్కులను మాట్లాడగలుగుతాడు. ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత కదిలించబడిన వ్యక్తిగ ఉంటాడు. అంతగా అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉంటాడు. అదేవిధముగా, యేసయ్య ఈ లోకములో జీవించినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మపూర్ణుడై జీవించాడు. బైబిల్ నుండి యోహాను 3:34వ వచనమును చూచినట్లయితే, "ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును'' ప్రకారం తండ్రియైన దేవుడు యేసుక్రీస్తునకు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించా డు. ఇంకను లూకా 4:22వ వచనమును చూచినట్లయితే, " అప్పుడందరును ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా? అని చెప్పుకొనుచుండెను'' ప్రకారం అందుకనే యేసు ప్రభువు దయగల మాటలను మాట్లాడాడు.
నా ప్రియులారా, అయితే, లోకానుసారమైన ఒక వ్యక్తి మాటలు ఏ విధంగా ఉంటాయి? బైబిల్ నుండి కీర్తనలు 55:21వ వచనములో చూచినట్లయితే, "వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే'' ప్రకారం అనేకసార్లు మనము కూడా ఆలాంటి మాటల చేత మోసపోతూ ఉంటాము. అటువంటి వారితో పాటు మనము కూడా లోకములోనికి వెళ్లిపోతు ఉంటాము. అయితే, మనము ఎంతో జాగ్రత్త వహించి, పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండాలి. ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ చేత ఆయన పరిపాలనలో ఉండాలి. బైబిల్ నుండి రోమీయులకు 8:5,6వ వచనములలో చూచినట్లయితే, "శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు; ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు; శరీరానుసారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైయున్నది''ప్రకారము ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచినప్పుడు, అది మనకు జీవమును సమాధానమును కలిగిస్తుంది. కనుకనే, నా ప్రియులారా, ఈ లోకస్థుల మాటలచేత మోసపోకండి. ఇంకను కీర్తనలు 51:10వ వచనమును చూచినట్లయితే, "దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము '' ప్రకారం దావీదు దేవుని సన్నిధిలో మొఱ్ఱపెట్టినట్లుగానే, మీరు కూడా దేవునికి మొఱ్ఱపెట్టండి. "ప్రభువా, శుద్ధ హృదయము మాకు కలుగజేయుము, మా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము '' అని ఆయనకు మొఱ్ఱపెట్టండి. ప్రియులారా, దయగల మాటలు మాట్లాడడానికి మనకు శుద్ధ హృదయము ఎంతో ప్రాముఖ్యమై యున్నది. దేవుని సత్యముతో నింపబడిన హృదయమే, శుద్ధ హృదయమై యున్నది. దేవుని సత్యము హృదయమును పరిశుద్ధపరుస్తుంది. ఇంకను పరిశుద్ధ జీవితమును జీవించడానికి మనకు సహాయపడుతుంది. ఆలాగుననే, మత్తయి 12:33వ వచనమును చూచినట్లయితే,"చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదే అని యెంచుడి; లేదా, చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదే అని యెంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును'' ప్రకారం మన జీవితము కూడా మనము ఎలాగున ఉన్నామని తెలియబడుతుంది.
బైబిల్ గ్రంథములో చూచినట్లయితే, దానియేలు ఒకరోజుకు మూడుసార్లు ప్రార్థన చేయుచుండువాడు. అందును బట్టి, ప్రభువు అతనికి రానున్న దినముల యొక్క ప్రవచనమును అనుగ్రహించాడు. దానియేలు ఎంతో జ్ఞానవంతుడుగా ఉండేవాడు. దానియేలు ఎంతో విశేషమైనటువంటి జ్ఞానము కలిగియున్న వ్యక్తియైయున్నాడని రాజైన దర్యావేషు అతనిని గుర్తించాడు. అతని రాజ్యము మీద ఒక అధికారిగా నియమించడానికి దానియేలును ఆ రాజు ఎంచుకున్నాడు. కానీ, దానియేలుతో కూడా పని చేయుచున్న ఇతర మంత్రులకు అది ఎంత మాత్రము కూడా నచ్చలేదు. కనుకనే, దానియేలును సింహాల గుహలోనికి పడవేయునట్లుగా, వారు ఒక ఆజ్ఞను తీసుకొని వచ్చారు. దానియేలు సింహాల గుహలో పడవేయబడినప్పుడు, రాజైన దర్యావేషుకు అది నచ్చలేదు. కనుకనే, అతడు నిజంగా దానియేలుకు స్నేహితుడుగా మారాడు. దానియేలు ఆ సింహాల గుహలో పడవేయబడడము రాజుకు అస్సలు నచ్చలేదు. కాబట్టి, ఆ రాత్రంతయు కూడా రాజు అస్సలు నిద్రపోలేకపోయాడు. ఉదయాన్నే, రాజైన దర్యావేషు ఆ సింహముల గుహ యొద్దకు వెళ్లి, గట్టిగా, ఈ విధంగా అరిచాడు, 'దానియేలూ, నీవు సేవించుచున్న జీవముగల దేవుడు సింహముల గుహలో నుండి నిన్ను కాపాడియున్నాడా? అని అడిగాడు. అవును, నా ప్రియులారా, అంతగా దానియేలును రాజు ప్రేమించాడు. ఆలాగుననే, దేవుడు మన హృదయమునందు ఉన్నప్పుడు, మనము దేవుని యొక్క దయగల మాటలను మాత్రమే మాట్లాడుతాము. స్నేహితులారా, మీరు దేవుని దయగల మాటలను మాట్లాడినప్పుడు రాజు కూడా మీకు స్నేహితుడుగా మారిపోతాడు. ఆ విధంగా ప్రభువు మిమ్మును చేయును గాక. ప్రభువు మీకు శుద్ధహృదయమును దయచేయును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ ఆత్మచేత మమ్మును నింపి, రూపాంతరపరచి, మమ్మును శుద్ధి చేయగల నీ జీవముగల వాక్యానికి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, మాలో పరిశుద్ధమైన హృదయాన్ని సృష్టించి, మాలో సరైన ఆత్మను పునరుద్ధరించమని కోరుచున్నాము. దేవా, స్థిరమైన ఆత్మను మేము కలిగియుండునట్లుగాను, మా నోటి యందు సరియైన మాటలు ఎల్లప్పుడూ నీకు దయగా మరియు ఆనందంగా ఉండునట్లుగా మా హృదయం నీ సత్యంతో పొంగిపోర్లునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, దానియేలు వలె ప్రవచనములు పలుకునట్లుగా కృపను చూపించుము. దేవా, మేము గొప్ప తలాంతులను కలిగియుండునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, అద్భుతమైన ఆత్మ మాలో ఉండునట్లుగా మమ్మును నింపి, దానియేలును అద్భుతమైన గుణాలతో నింపినట్లుగా ముమ్మును కూడా ఆ రీతిగా నింపుము. దేవా, దానియేలుకు బయలుపరచినట్లుగానే, నీ మర్మములను మాకు మరియు మా పిల్లలను కూడా నింపుము. ప్రభువా, నీ మాటలు మా నోటిలో నుండి ప్రవహించునట్లుగా చేయుము. దేవా, మేము నీ మహిమార్థమైన గొప్పగా వాడబడునట్లుగా కృపను చూపించుము. యేసయ్యా, లోకపు మృదువైన మాటల ద్వారా మోసపోకుండా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నిరంతరం నడిపించబడటానికి మాకు సహాయం చేయుము. దేవా, నీవు యేసును పరిశుద్ధాత్మతో అపరిమితంగా నింపినట్లుగా, మరియు నీవు దానియేలుకు అనుగ్రహం మరియు జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా, మేము నీ సత్యంలో మరియు పవిత్రతలో నడవగలిగేలా దయచేసి మమ్మును నీ పరిశుద్ధాత్మతో నింపుము. దేవా, మా మాటలు మంచి ఫలాలను ఇచ్చునట్లుగాను మరియు రాజులను కూడా మాకు స్నేహితులగునట్లుగా మా హృదయములను శుద్ధపరచుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.