నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 145:20వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "యెహోవా తన్ను ప్రేమించు వారినందరిని కాపాడును అయితే భక్తిహీనులనందరిని ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును'' అని చెప్పబడిన ఈ వచనము, ఇది మీ కొరకైన దేవుని వాగ్దాన వచనము. ప్రభువు మనలను కాపాడువాడై యున్నాడు. అందుకే కీర్తనలు 121వ వచనములో మనము చూచినట్లయితే, "యెహోవాయే మిమ్మును కాపాడువాడు'' అని వ్రాయబడియున్నది. ఆయన ప్రతి విధమైన హాని నుంచి కాపాడువాడై యున్నాడు. మీరు వెలుపలికి వెళ్లునప్పుడు మరియు లోపలికి వచ్చినప్పుడు ఆయన మిమ్మును కాపాడువాడై యున్నాడు. ఆయన మీ ఆత్మను భద్రముగా కాపాడువాడై యున్నాడు. బైబిల్ నుండి సంఖ్యాకాండము 6:24వ వచనములో చూచినట్లయితే, "యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక'' ప్రకారం ఇట్టి ఆశీర్వాదమును మోషే ఇశ్రాయేలీయుల ప్రజల మీదికి పలుకవలెనని దేవుడు కోరుకొనియున్నాడు. చాలా సంవత్సరాల క్రితము ఐగుప్తులోని ఫారోలైన వారు చాలా శక్తివంతులైన వారు. అటువంటిశక్తివంతులైనవారు మరణించి యున్నప్పుడు, వారి యొక్క పార్థీవ దేహములను మమ్మీలుగా సంసిద్ధము చేయువారికి, వారి యొక్క రెండు చేతులు వారి ఛాతీ మీద ఉంచుచున్నట్లుగా సంసిద్ధము చేయవలసినదిగా ఆజ్ఞాపించేవారు. వారి ఆత్మలను అపవాది నకరమునకు తీసుకొని వెళ్లకుండ ఉండు నిమిత్తమై, వారు తమ ఆత్మలను భద్రపరచుకోవడానికి అన్నట్లుగా ఆలాగున చేయుదురు. మృతులైన వ్యక్తుల యొక్క దేహము మీద తన చేతులు, వారి ఛాతికి అడ్డుగా పెట్టినందు వలన అపవాది నరకమును తీసుకొని వెళ్లకుండా ఆపు చేయగలమా? మన ఆత్మ దేవునికి సమర్పించబడవలసి యున్నది. మనము సజీవముగా ఉండి ఉండగానే, మన ఆత్మలను దేవునికి అప్పగించవలెను. అప్పుడే మన ఆత్మ నరకమునకు వెళ్లకుండా, దేవుడు పరలోకములో ప్రవేశించునట్లుగా అనుమతిస్తాడు.

నా ప్రియులారా, యేసు సెలవిచ్చుచున్నాడు, 'మీ హృదయమును నాకిమ్ము, నేను మీలోనికి ప్రవేశించెదను. అందులో నేను నివాసము చేసి, ప్రతి ఆశీర్వాదమును ఆనందించులాగున చేయుదును' అని తెలియజేయుచున్నాడు. బైబిల్ నుండి ప్రకటన 3:20వ వచనములో చూచినట్లయితే, "ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడ అతడును భోజనము చేయుదుము'' అని సెలవిచ్చిన ప్రకారముగానే, మీ హృదయమును ప్రభువునకు సమర్పించినట్లయితే, ఆయన మీ ఆత్మను భద్రపరచి, పరలోకములో ప్రవేశింపజేస్తాడు. కనుకనే, మీరు ఆలాగున చేసినప్పుడు, లోకము కొరకు మరియు ధనము కొరకైన ప్రేమను కాకుండా, ఎల్లవేళల దేవుని కొరకైన ప్రేమను కలిగియుండునట్లుగా చేసి, ఆయన మిమ్మును ఆశీర్వదిస్తాడు. అప్పుడు, మీ ఆత్మ దేవుని యందు ఎంతో భద్రముగా ఉంటుంది. మీరు ఆయనను ప్రేమించినప్పుడు మీ పట్ల సమస్త కార్యములు మేలుకై సమకూడి జరుగుచున్నవి. మీ ఆత్మ సంపూర్ణముగా దేవుని కొరకైన ప్రేమతో నిండియున్నప్పుడు, రోమీయులకు 8:28 ప్రకారం దేవుడు మనకు సమస్తమును మేలు కొరకై సమకూర్చి జరిగించబోవుచున్నాడు. నా ప్రియులారా, ఈ రోజున మీ హృదయమును యేసునకు సమర్పించండి. ఆయన మీ ఆత్మను ఆశీర్వాదకరముగా కాపాడుతాడు. ఆయనను ప్రేమించడానికి తగిన ప్రేమను మీకు అనుగ్రహిస్తాడు. ఆయనను ప్రేమించుట అనగా, ప్రతి ఆశీర్వాదము కొరకు ఆయనయందు మీరు నిరీక్షణ ఉంచుటయే. ఆయన సమస్తమును మీకు మేలు కొరకు సమకూడి జరిగించునట్లుగా చేస్తాడు.

ఇక్కడ దీపక్ కుమార్ అను సహోదరి యొక్క సాక్ష్యము కలదు. 2007వ సంవత్సరములో కపిలాతో వారికి వివాహము జరిగినది. వారికి ఒక కుమార్తె కలదు. 2016 వ సంవత్సరము వరకు అన్నియు వారికి సమాధానముకరముగానే ఉన్నాయి. ఆ తర్వాత, దురాత్మ శక్తులు అతని జీవితముపైన ఆధిపత్యమును సంతరించుకున్నాయి. అతడు 50 మందికి పైగా వారి యొద్ద ఋణములను తీసుకొని ఆ విధంగా ఋణాలలో మునిగిపోయాడు. అనేకమైన కోర్టు వివాదములు అతనికి విరుద్ధముగా ఉండెను. కాబట్టి, అతడు రెండు ఫర్యాయములు ఆత్మహత్య ప్రయత్నములను కూడా చేశాడు. అప్పు ఇచ్చినవారు నిరాంతరాయముగా అతనిని డబ్బులు అడగడము ద్వారా అతడు కనీసము తన దుకాణమునకు కూడా వెళ్లలేకపోయాడు. అతడు ఒత్తిడి పిరికితనము అత్యంత దయనీయమైన స్థితిలో జీవించుచుండెను. ఒక రోజున తన భార్యకు అతడు ఫోన్ చేసి, సమస్తమును కూడా ఆమె దగ్గర చెప్పి, అతడు అన్నిటిని ఒప్పుకున్నాడు. అతని భార్య నేను నీతో కూడా నిలబడతాను అని చెప్పి అతనిని ధైర్యపరచినది. ఒకరోజు ఆమె అతని యొక్క సహోదరిని పిలువడము జరిగినది. అతని యొక్క సహోదరి మరియు ఆమె యొక్క భర్తగారు, వీరిద్దరు కూడా, యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో భాగస్థులుగా ఉన్నారు. వారిద్దరు కూడా అతనిని ప్రార్థన గోపురమును తీసుకొని వెళ్లారు. అక్కడ అతడు దేవుని ప్రేమను కనుగొన్నాడు. దేవుడు అతని జీవితములో క్రియ చేయడము ప్రారంభించాడు. అదే సంవత్సరములో ఏప్రిల్ మాసములో, దేవుడు భర్తను మరియు భార్యను, పిల్లలను ఐక్యపరచాడు. దేవుడు అతని వ్యాపారమును, సమాధానమును పునరుద్ధరించాడు. అతని యొద్ద నుండి తొలగించబడిన ఆస్తినంతయు కూడా అతని యొద్దకు మరల తిరిగి వచ్చినది. వ్యాపారము మరల కొనసాగించబడినది. ఎవరు కూడా అతనికి విరుద్ధముగా లేరు. దేవుడు అతని ఋణాల నుండి అతనిని విడిపించాడు. అతడు ఇవ్వవలసిన వారందరికిని తిరిగి చెల్లించాడు. ఎంత అద్భుతమైన దేవుడు కదా! నా ప్రియులారా, ఆలాగుననే, ఆయన మీకును సహాయము చేస్తాడు. కనుకనే, ఆయన ఈలాగున సెలవిచ్చుచున్నాడు, 'మీ హృదయమును నాకిమ్ము, నేను దానిని భద్రపరచెదను, నేను మీ ఆత్మను కాపాడుదును, భద్రపరచుదును, నేను మిమ్మును ఆశీర్వాదకరముగా ఉంచెదను. మీరు నన్ను ప్రేమించునట్లుగా, నా యందు నిరీక్షణ ఉంచునట్లుగా నేను చేయుదును'' అని సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, నేడు ఈ యేసు ఆహ్వానమును స్వీకరించండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ యొక్క ఆశీర్వాదములు మాలోనికి ప్రవహించునట్లుగా చేయుము. ప్రభువా, ప్రతి దురాత్మ శక్తులను మా జీవితములో బ్రద్ధలు చేయుము. ప్రభువా, మా జీవితములను నీకు సమర్పించునట్లుగా మాకు తగిన బలమును, శక్తిని అనుగ్రహించుము. ప్రభువా, నీవు మాపట్ల కలిగియున్న ఆశీర్వాదముల కొరకు నీ యందు నిరీక్షణ ఉంచునట్లుగా చేయుము. దేవా, మేము కోల్పోయిన ప్రతి ఆశీర్వాదములను, ఆరోగ్యమును యేసు నామమున మాలోనికి తిరిగి వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, ఈ రోజున మమ్మును ఒక కుటుంబముగా నిర్మాణము చేయుము. దేవా, నీ బలమైన శక్తి మా వ్యాపారములోను, ఉద్యోగములోను కుటుంబములోను దిగివచ్చునట్లుగా చేయుము. ప్రభువా, నీ ప్రేమ ద్వారా ఇతరులను మేము ప్రేమించు కృపను మాకు దయచేయుము. దేవా, మేము ఎవ్వరికి ఋణస్థులముగా ఉండకుండా, మేము అందరికి అప్పు ఇచ్చువారలనుగా మమ్మును మార్చుము. దేవా, ఈ రోజు మా హృదయాన్ని నీకు సమర్పించుకొనుచున్నాము. ప్రభువైన యేసు, దయచేసి మాలోనికి ప్రవేశించి మాలో నివసించుము. దేవా, మా ఆత్మను నీ ప్రేమలో భద్రంగా ఉంచి, కాపాడుము. యేసయ్యా, మేము బయటకు వెళ్ళినప్పుడు మరియు లోపలికి వచ్చినప్పుడు మమ్మును కాపాడి సంరక్షించుము. దేవా, లోకం పట్ల కాదు, నీ పట్ల ప్రేమతో మమ్మును నింపుము. ప్రభువా, సమస్తమును మా మేలు కొరకు కలిసి పనిచేస్తాయన్న నీ వాగ్దానాలను మేము నమ్ముచున్నాము. ప్రభువా, మమ్మును ఆశీర్వదించుము, మమ్మును నడిపించుము మరియు ప్రతిరోజు నిన్ను ఎక్కువగా ప్రేమించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మేము ఆనందంతో నీ ఆహ్వానాన్ని అందుకుంటున్నాము. ప్రభువా, మేము ఎన్నటికిని నిన్ను విడిచి వెళ్లకుండా మమ్మును కాపాడుమని సమస్త ఘనత మహిమ నీకే చెల్లించుచు నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.