నాకు అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. కాబట్టి, ఈరోజు వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 30:21వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో, "మీరు కుడి తట్టయి నను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును '' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరి యెదుట ఒక మాదిరికరమైన జీవితమును జీవించియున్నాడు. బైబిల్‌లో మార్కు 1:35వ వచనములో చూచినట్లయితే, "ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్య ప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయు చుండెను.'' అవును, యేసు ప్రభువు పెందలకడనే లేచి, అరణ్యమునకు వెళ్లి, తండ్రిని ప్రార్థన చేయుచూ, ఆయనను వెదకినప్పుడు, తండ్రి, ఇలాగున ఆయనతో, ' ఇదే త్రోవ దీని యందు నడువుము' అని మాట్లాడెను. హల్లెలూయా! ప్రశస్తమైన స్నేహితులారా, నేడు మీరు కూడా ఆలాగుననే చేయండి. నేటి నుండి మీరు కూడా పెందలకడనే లేచి, ప్రభువు సన్నిధిలో మోకరించి, ప్రభువు వైపు చూడండి, 'ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను, నీ సన్నిధికి వచ్చియున్నాను, నేను ఏమి చేయాలో నాకు నేర్పించమని'' ఆయనను అడగండి. అప్పుడు, ' ఇదే త్రోవ, దీనిలో నడవండి' అని ప్రభువు మీకు సెలవిస్తాడు. ఇది ఎంత మహిమోన్వితమైన జీవితము కదా నా స్నేహితులారా!
నా ప్రియులారా, నేడు బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 30:20వ వచనమును మనము చూచినట్లయితే, మన పితురులు కూడా అదేవిధముగా చేసియున్నారు. ఆ వచనము, "నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమై యున్నాడు. కాబట్టి, నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి'' ప్రకారం మనము కూడా ఆయనను వెదకుచూ, మన పితురులు చేసినట్లుగా చేసి, ఆయన ఇచ్చు జీవమును పొందుకుందాము. మరియు బైబిల్‌లో, కీర్తనలు 27:1 వచనమును చూచినట్లయితే, "యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?''ప్రకారం దావీదు భక్తుడు ప్రభువును అదేవిధముగా వెదకియున్నాడు. దావీదు, 'యెహోవా నా బలమై యున్నాడు' అని దృఢంగా చెప్పాడు. ఇంకను యెషయా 64:4వ వచనములో చూచినట్లయితే, " తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు'' ప్రకారం నేడు మీరు కూడా ప్రభువు సన్నిధిలో కనిపెట్టినప్పుడు, నిశ్చయముగా, దేవుడు మీ కార్యములను సఫలము చేస్తాడు. నా ప్రియ స్నేహితులారా, ప్రభువు సన్నిధిలో మీరు కనిపెట్టుకొను అలవాటు మీకు ఉన్నదా? ఉదయమున ఏ సమయమునకు మీరు లేస్తున్నారు? మీరు 10 గంటలకు లేస్తున్నారా? నా ప్రియులారా, ఈ రోజు మీరు ఒకసారి మీ జీవితమును పరీక్షించుకోండి. మీ హృదయమంతటితో ప్రభువును అనుదినము వెదకండి. నిశ్చయముగా, దేవుడు మీకు సరియైన మార్గమును చూపుతాడు.
నా ప్రియులారా, నేడు మీరు కూడా యేసువలె పెందలకడనే ఉదయకాల సమయముననే వెదకండి. హల్లెలూయా! మీ జీవితము ప్రభువు సన్నిధానముతో నింపబడుతుంది. మీరు ఎక్కడికి వెళ్లాలో, ఏమి చేయాలో అన్ని విషయాలను ప్రభువే మీకు సమీపముగా ఉండి, మీకు సమస్తమును నేర్పించి మిమ్మును నడిపిస్తాడు. ఇంకను మీ జీవితాన్ని దీవెనకరముగా మారుస్తాడు. ఆలాగుననే, దీవెనకరముగా మనలను నడిపించుటకు మన జీవితాలను ఇప్పుడే సమర్పిద్దామా? నేడే మీ జీవితాలను ఆయనకు సమర్పించి, ఉదయముననే ఆయనను వెదకినట్లయితే, నిశ్చయముగా, నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల పరలోకమందున్న మా తండ్రీ, నీ అద్భుతమైన సన్నిధానమునకై నీకు వందనాలు. దేవా, ప్రేమతో మాట్లాడే మరియు నడిపించే దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు. ప్రభువా, నీవు మాతో మాట్లాడుము. ప్రభువా, ఉదయాన్నే నిన్ను వెదకే అలవాటును ఇచ్చి, ఉదయాన్నే మమ్మును లేపుము మరియు మా హృదయమంతటితో నిన్ను వెదకుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, నీ యొక్క అభిషేకమును మరియు అత్యధికమైన ఆశీర్వాదములను పొందుకొనుటకు మాకు అటువంటి కృపను దయచేయుము. యేసయ్యా, నీవు ఈ భూమిపై జీవించినప్పుడు తెల్లవారుజామున నీవు నడిచినట్లుగానే, ప్రతి ఉదయం మమ్మును కూడా నడిపించుము. యేసయ్యా, ఇదే త్రోవ, దీనిలో నడువుము అని చెప్పే నీ యొక్క స్వరాన్ని వినడానికి దయచేసి మా చెవులను తెరువుము. ప్రభువా, మరేదైనా ముందు నిన్ను వెదకడానికి, నీ సన్నిధిలో వేచి ఉండటానికి మరియు నీవు మా కొరకు ఏర్పాటు చేసిన మార్గంలో నడవడానికి మాకు నేర్పించుము. ప్రభువా, మా స్వంత కోరికల ద్వారా మేము ఎప్పుడూ దారితప్పకుండా ఉండునట్లుగా చేయుము. యేసయ్యా, నిన్ను సంపూర్ణంగా విశ్వసించునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, దయచేసి మా హృదయాన్ని నీ జ్ఞానంతో మరియు మా అడుగులను నీ శాంతిసమాధానముతో నింపుమని మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.