నా ప్రియమైన స్నేహితులారా, ప్రతి దినము దేవుడు మనకు నూతనమైన కృపను అనుగ్రహించుచున్నాడు. ఈ రోజు మనలను తగ్గించుకొని, అటువంటి కృపాకనికరమును పొందుకొనుటకు మనము ఇక్కడ ఉన్నాము. కనుకనే, మీరు, "ప్రభువా, మాతో మాట్లాడుము'' అని చెప్పండి. ఆయన కనికరముగలవానికి సంతోషముగా మీ చెంతకు వస్తాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 25:3,4వ వచనములను తీసుకొనబడినది. ఆ వచనము, ఏమని చెబుతుందనగా, "భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండ ఆశ్రయముగాను వెట్ట తగులకుండ నీడగాను ఉంటివి. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు'' ప్రకారం ఈ రోజున ఆయన మీ పరిస్థితి వైపునకు చూస్తున్నాడు. మీరు ఎంత నిస్సాహాయంగా ఉన్నారని మిమ్మును చూస్తున్నాడు. ఎవ్వరు కూడా మీకు సహకరించడము లేదనియు, ఎవ్వరు మిమ్మును ప్రోత్సహించుటకు రావడము లేదనియు, మీకు ఎవ్వరును సహకారము అందించడము లేదనియ, సహాయము చేయడము లేదని, మీరు అనా«థవలె భావించుచున్నారనియు, ఏ సహకారమును లేక ఉన్నారని మీరు చింతించుచున్నారా? నా స్నేహితులారా, దేవుడు మీకు సహాయము అందించుట కొరకు మీ వైపునకు మాత్రమే చూచుచున్నాడు.

నా ప్రియులారా,ఈ రోజు కీర్తనలు 121వ అధ్యాయము ప్రకారము మనము చెప్పవలసినదేమనగా, "ప్రభువా, నీవే నా సహాయకుడవు, నా సహాయము కొరకు నీ వైపు మాత్రమే చూస్తున్నాను, నీవు భూమ్యాకాశములను సృజించి యున్నవాడవు'' అని చెప్పినప్పుడు, ఆయన మీకు బలమైన దుర్గముగా ఉంటాడు, ఆయన నిస్సహాయుకులకు బలమైన శరణ్యముగా ఉంటాడు. ఆలాగుననే, దొంగిలించబడి, దెబ్బలు కొట్టబడి, గాయపరచబడి, దారిలో పడిపోయి ఉన్న ఒక వ్యక్తిని గురించి యేసు ఈ కథను ఈలాగున చెప్పాడు. అతని వస్త్రములతో సహా అన్నియు తొలగించవేయబడ్డాయి. మరణించు నంతగా దెబ్బలుకొట్టబడి, గాయపరచబడియున్నాడు. ఒక యాజకుడు ఆ మార్గమున వచ్చాడు, ఏ మాత్రము అతని పట్ల శ్రద్ధ చూపలేదు. ఆ తదుపరి లేవీయుడు కూడా ఆ మార్గమున వచ్చాడు. కానీ, అతడును కూడా వానికి సహాయము చేయలేదు. అయితే, సమరయుడు అక్కడకు వచ్చాడు. వెనువెంటనే, అతని వైపునకు చూచాడు. సహాయము చేయుటకు త్వరపడి వచ్చి, అతని గాయములను కట్టి యున్నాడు. అతడు విశ్రాంతి పొందడానికి పూట కూళ్లవాని యింటికి అతనిని తీసుకొని వెళ్లాడు.

అదేవిధముగా, నా ప్రియులారా, మీకును కూడా ఆలాగుననే చేస్తాడు. ఆ రీతిగానే, ఆయన 'నా సహాయాన్ని మీకు పంపిస్తాను' అని సెలవిచ్చుచున్నాడు. స్నేహితులారా, ప్రజలు ఒకవేళ మీ వైపునకు చూడకపోయినప్పటికిని, గొప్ప రోగములో ఉండియు కూడా మీరు ఇతరుల ప్రజలకు సహాయము చేసినప్పటికిని, ఇప్పుడు మీరు ఒంటరివారై పోయారని చింతించుచున్నారేమో? అయితే, మన ప్రభువైన యేసు, "మీ సహాయము కొరకు నా వైపు చూడండి, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడను నేనే, ఎల్లప్పుడు మీకు సహాయము చేయువాడను నేనే'' అని అంటున్నాడు. కొన్నిసార్లు ఆయన మనకు వ్యక్తిగతంగా సహాయము చేయుట కొరకు ఇతరుల యొద్ద నిస్సహాయులనుగా చేస్తాడు. మనము కేవలము ఆయన మీద ఆధారపడు నిమిత్తము, రహస్యమైన రీతిలో సమరయుని వలె ఆయన తన సహాయమును మీ యొద్దకు పంపిస్తాడు. మర్మమైన రీతిలో దేవుని సహాయము ఈ రోజున మీ యొద్దకు వస్తుంది. కనుకనే, విచారించకండి. నేడు మీరు దీనిని స్వీకరించండి మరియు నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మహిమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము విడిచిపెట్టబడినట్లుగాను, ఒంటరిగా ఉన్నట్లుగాను మరియు అణచివేయబడినట్లుగా అనిపించుచున్న వేళలలో, మేము నీ వైపు తిరుగుచున్నాము. ఎందుకంటే, దేవా, నీవే మా కోట మరియు మా ఆశ్రయం, ఇంకను మా శరణ్యమై యున్నావు. కనుకనే, నీవు మా నిస్సహాయతను చూస్తున్నావు. అయితే, ఇతరులు మర్చిపోవచ్చును, కానీ నీవు మమ్మును గుర్తుంచుకుంటావనియు, మంచి సమరయుడిలా, మేము బాధపడుచున్నప్పుడు నీవు మా దగ్గరికి వస్తావనియు, మా గాయాలను కట్టి, మమ్మును సమాధానము గల చోటుకి తోడుకొని తీసుకువెళతావనియు మేము నమ్ముచున్నాము. ప్రభువా, మేము నీపై మాత్రమే ఆధారపడటానికి అనుమతించినందుకు, మానవ సహాయం విఫలమైనప్పుడు, నీ సహాయం వస్తుందని మాకు చూపించినందుకు కృతజ్ఞలు చెల్లించుచున్నాము. దేవా, ఆకాశము మరియు భూమిని సృష్టించిన నీ వైపు మా దృష్టిని నిలుపుచున్నాము. ప్రభువా, మాకు సహాయమందించుటకు మేము నీ దయ మరియు నీ అద్భుతమైన మార్గాలను నమ్ముచున్నాము. ప్రభువా, ఈ రోజు, మేము నీ వాగ్దానం ప్రకారం మేము సహాయాన్ని పొందుకొనునట్లుగాను, మేము నీ ప్రేమ మరియు శాంతిని పొందుకొని, అనుభవించునట్లుగా చేయుము. ప్రియమైన ప్రభువా, యేసయ్యా, నిస్సహాయులకు నీవే బలమైన దుర్గము. కనుకనే, మేము నీ మీద ఆధారపడుటకు మాకు నేర్పించుము. దేవా, మేము కలిగియున్న సమస్తము మీద మేము ఆధారపడకుండా, మేము నీపై ఆధారపడుటకు కృపను దయచేయుము. ప్రభువా, అత్యవసరమైన రీతిలో మాకు సహాయము నీ యొద్ద నుండి వచ్చునట్లుగా కృపనిమ్ము. దేవా, మేము నీ ద్వారా ఆదరించబడునట్లుగా సహాయము చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.