నా ప్రియ స్నేహితులారా, ప్రభువు ద్వారా నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 17:8 వ వచనమును మనకు ఇవ్వబడియున్నది. ఆ వచనము, " వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు'' అని చెప్పబడియున్నట్లుగానే, నేడు మనము ఆ రీతిగానే ఉండబోవుచున్నాము. ప్రభువులో నాటబడిన మరియు బలమైన వారలముగా ఉండబోవుచున్నాము. ఆయన మనకు మూలరాయిగా ఉంటాడు. ఆయన మనకు రాతి బండగా ఉంటాడు. ఆయన మనకు స్థిరమైన పునాదిగా ఉంటాడు. తద్వారా మనము ఎన్నటికిని కూడా పడిపోము. ప్రియులారా, ఈ వచనమును మీరు పరిశీలించినట్లయితే, ఇటువంటి చెట్టుకు ఏమి జరుగుతుందో మనము చూడగలము. ఆ చెట్టు జలముల యొద్ద నాటబడి ఫలభరితంగా ఉంటుంది. తద్వారా, అది ఎంతగానో సారవంతంగా పోషింపబడి, అది ఎంతో బలముగా ఉంటుంది. అది నది ప్రక్కన తాను వేర్లు పారినట్లుగా ఉంటుంది. తద్వారా, వేర్లు కూడా లోతుగా స్థిరముగా ఉంచబడతాయి. దేవుడు మనలను కూడా ఆయనలో వేరు పారినట్లుగా చేస్తాడు. ఆయన యొక్క సరియైన ఉపదేశములో, దేవుని యొక్క మార్గములో మన పునాది సరిగ్గా మరియు స్థిరంగా నిలిచియుంటుంది.
నా ప్రియులారా, అనేకమంది వంకర మార్గములలో నడిపించబడడానికి బోధించబడుచున్నారు. కానీ, మనము దేవుని యెదుట సరియైనది మాత్ర మే చేయుదము. ఈ చెట్టు వేడిమి వచ్చినప్పుడు ఏ మాత్రము కూడా అది భయపడదు. వేడి లేక వెట్టకి అది ఏ మాత్రము భయపడదు. కరువు సమయమునకు అది భయపడదు. కానీ, ఎల్లప్పుడు బలముగా నిలిచి ఉంటుంది. మీరు మీ యెదుట ఉన్న సవాళ్లకు ఏ మాత్రము భయపడరు. మిమ్మును భయపెట్టువారు మీకు ఎదురుగా ఉన్నప్పటికిని, భయపెట్టు పరిస్థితులు మీకు ఎదురుగా ఉండి ఉన్నప్పుడు కూడా, మీరు స్థిరంగా దేవుని శాంతిలో నాటబడిన వారుగా నిలిచి ఉంటారు. ఈ వచనము చెబుతుంది, ఈ చెట్టు ఆకులు ఎల్లప్పుడు తేమను కలిగి పచ్చగా ఉంటాయి. ఆలాగుననే, మీరు కూడా ఎల్లప్పుడు గొప్ప స్వారూప్యమును కలిగి ఉంటారు. మీరు ఎల్లప్పుడు సమాజములో గొప్ప పేరును కలిగియుంటారు. స్థాయి గల స్థిరమైన పేరును, ఎల్లప్పుడు పచ్చగాను తేమను కలిగి ఉంటారు. మీరు ఎప్పుడును కూడా ఎండిపోరు. కనుకనే, మీరు దేనిని బట్టియు చింతనొందకండి. నిశ్చయముగా దేవుడు మిమ్మును ఫలించునట్లుగా చేస్తాడు.
నా ప్రియమైన వారలారా, ఇంకను ఈ వచనములో అది కరువు సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు అని వ్రాయబడియున్నది. మీరు ఎల్లవేళల దైవాశీర్వాదముల చేత పోషించబడెదరు. అది ఎప్పుడు ఫలములు ఫలించుట ఆపు చేయదు. దేవుడు ఎల్లప్పుడు మీ కాలమందు ఫలమిచ్చు చెట్టువలె ఉంచుతాడు. మీరు ఏమి చేయాలో మీకు బయలుపరచి, దానిని చేయడానికి శక్తిని మరియు బలమును అనుగ్రహిస్తాడు. మనము దేవుని నది వెంట నాటబడిన అటువంటి చెట్టు వలె ఉంటాము. మనము ప్రతిరోజు వాక్యమును పఠించియున్నప్పుడు, ప్రతిరోజు ఆయన వాక్యమును, వాగ్దానమును అంగీకరించండి, ఆయన ప్రత్యక్షతను స్వీకరించండి, అది ఆ రోజున దైవాశీర్వాదములతో మనలను స్థిరపరుస్తుంది. మన యొక్క పునాదిని సరిగ్గా ఉంచుతుంది. మనము ఎప్పటికిని కంపింపజేయబడము. ఆయన ఈ ఆశీర్వాదమును మనకు అనుగ్రహించుచున్నందుకై మనము ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించి, ఆలాగున చేసి, దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకుందాము. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, జీవజలముల యొద్ద ఒక వృక్షమువలె, నీ ప్రేమగల సన్నిధిలో మమ్మును లోతుగా నాటినందుకు నీకు వందనాలు. దేవా, కరువు కాలము లేదా భయముచేత కదలకుండా మా వేర్లు నీ సత్యములో బలంగా ఎదుగునట్లుగా చేయుము. ప్రభువా, మా ప్రతి కాలములోను మేము ఫలించగలిగేలా దయచేసి మమ్మును ప్రతిరోజూ నీ పరిశుద్ధాత్మతో నింపుము. దేవా, నిన్ను పూర్తిగా విశ్వసించుటకు, నీతిలో నడుచుటకును మరియు మేము చేయు ప్రతిదానిలో నీ మహిమను ప్రతిబింబించుటకు మాకు నేర్పుము. ప్రభువా, మేము ఎన్నడూ ఎండి పోకుండునట్లు, ఎప్పుడూ చింతించకుండునట్లు, నీ ఉద్దేశ్యములో ఎల్లప్పుడూ స్థిరముగా నిలిచి ఉండునట్లుగా చేయుము. దేవా, ఇప్పుడు మరియు ఎల్లప్పుడు మా స్థిరమైన పునాదిగా ఉన్నందుకు నిన్ను స్తుతించుచున్నాము. దేవా, మమ్మును అటువంటి బలమైన చెట్టుగా చేసినందున నీకు వందనములు సరియైన పునాదిని మేము కలిగియుండునట్లుగాను, ప్రతిరోజు నీ వాక్యములో పునాది కలిగియుండునట్లుగానే, నీ వాక్యమును మాలోనికి అంగీకరించుటకు మాకు సహాయము చేయుము. యేసయ్యా, మేము నీ స్వరమును వినుటకును, ప్రగాఢ వాంఛను మరియు ఆకలిని మాకు దయచేయుము. దేవా, నీ యొక్క పరిశుద్ధ గ్రంథమును పఠించుటకు నీ వాగ్దానము స్వీకరించుటకు మాకు సహాయము చేయుము. దేవా, మేము నీ వాక్యమును అనుసరిస్తుండగా, సమాజములో మాకు మంచి పేరును దయచేసి, ఇంకను ఎల్లవేళల నీలో శాంతిని కలిగియుండునట్లుగాను, మేము విస్తరించి, అభివృద్ధి చెందునట్లుగా ఈ వాగ్దానమును మా జీవితములో నేరువేరునట్లుగా చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.