నా ప్రియ స్నేహితులారా, నేటి దేవుని వాగ్దానం మీకు జీవాన్నిస్తుంది. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 92:10వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని'' ప్రకారం నేడు క్రొత్త తైలము మీ మీదికి వస్తున్నది. మిమ్మును దేవుడు ఎలా ఘనపరుస్తాడో మీరు నమ్మశక్యము కానీ హెచ్చింపు మీ యొద్దకు రాబోవుచున్నది. కనుకనే, శ్రేష్ఠమైన సమయం ఆసన్నమైంది, దేవుడు మిమ్మల్ని ఎలా ఘనపరుస్తాడని చూసి త్వరలోనే మీరు ఆశ్చర్యపోతారు.

ఈ రోజు నా ప్రియ స్నేహితులారా, మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులలో మీరు అనుకోవచ్చును, 'నన్ను ఇక్కడ పరిచర్య చేయమని చెప్పింది దేవుడేనా? మహా అద్భుతంగా ఈ ఉద్యోగమును నాకు అనుగ్రహించినది దేవుడేనా? ఈ వ్యాపార ద్వారములు తెరువజేయుటకు దేవుడే కదా నాకు సహాయము చేశాడు. మరి ఎందుకు నేను ముందుకు వెళ్లలేక బాధపడుచున్నాను? నేను ఎందుకని, అవమానమును మరియు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాను? ఏ మాత్రము నేను ముందుకు వెళ్లలేక అవమానమునకు మరియు నిరుత్సాహమునకు మాత్రమే గురియగుచున్నాను'అని అంటున్నారా?

అయితే, నా ప్రియ స్నేహితులారా, ఈ రోజున దేవుడు మీకు ఒక గొప్ప హెచ్చింపును మరియు అభివృద్ధిని ఇస్తానని మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు, 'గురుపోతు కొమ్మువలె ఆయన మీ కొమ్ము పైకెత్తుచున్నాడు.' గురుపోతు కొమ్ము గొప్ప ప్రభావము కలిగి ఉంటుంది. ప్రజలు అట్టి ప్రభావమును మీ జీవితములో చూచెదరు. ఆయన క్రొత్త తైలమును మీ మీద కుమ్మరించుచుండగా, రోమీయులకు 8:18వ వచనములో మనము చూచినట్లయితే, "మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను''అని చెప్పబడినట్లుగానే, రాబోవు శ్రమకు మీ శ్రమ ఏ మాత్రము యెంచతగినది కాదు. కాబట్టి, దానిని ఎదురుచూడండి!

యోసేపునకు దర్శనము కలిగినప్పుడు, తన జీవితములో అన్నియు కూడా గొప్పగా ఉంటాయని ఊహించుకున్నాడు. ప్రజలందరికంటెను ఘనపరచబడగలిగే దర్శనమును కలిగియుండెను. కానీ, ఒకదాని వెంబడి ఒకటి ఒత్తిడి మరియు దెబ్బలు అతనికి సంభవించినవి. కానీ, నా ప్రియ స్నేహితులారా, ప్రతి మార్గములో దేవుడు అతనిని నడిపించాడు మరియు తప్పించాడు. ఇంకను దేవుడు అతనిని బలపరచాడు, అతనికి నేర్పించాడు మరియు ఉన్నతమైన స్థలములలో ప్రకాశించే సామర్థ్యమును దేవుడు అతనికి అనుగ్రహించాడు. అతడు పొందిన శ్రమలకన్నిటికంటె దేశానికి పరిపాలకునిగా దేవుడు అతనిని హెచ్చించాడు. అటువంటి గొప్ప ఘనతను అతడు ఎదురు చూడలేదు.

నా ప్రియులారా, దేవుడు ఆలాగునే మనలను హెచ్చించి, దీవిస్తాడు. కనుకనే, మనము ఆయనకు వందనాలు చెల్లిద్దాము. కాబట్టి, మీ జీవితములో అటువంటి అభ్యున్నతి కొరకు సంసిద్ధముకండి. దానిని మా జీవితములో మేము అనుభూతి చెందాము. అది దేవుని దర్శనమై ఉండవచ్చును. అది దేవుని వనరు అయ్యి ఉండవచ్చును. కానీ, వీటి మధ్యలో మీ శ్రమ వృధాగా పోదు. దేవుడు మిమ్మును క్రిందపడిపోనివ్వడు. కనుకనే, ఈ రోజు నాతో కలిసి, ఇటువంటి క్రొత్త తైలమును స్వీకరించి, తద్వారా, హెచ్చించబడండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, మా ఆత్మ, జీవమును మరియు నిరీక్షణ కలిగించే నీ వాగ్దానాలకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, ఈ రోజు నీ యొక్క క్రొత్త తైలముతో మా మీద కుమ్మరించుము మరియు గురుపోతు కొమ్ము వలె శక్తివంతమైన కొమ్మువలె మా ఆత్మను పైకి లేవనెత్తి మమ్మును హెచ్చించుము. ప్రభువా, మేము శోధనల ద్వారా నడుస్తున్నప్పుడు మమ్మును బలపరచుము మరియు మా బాధలు గొప్ప మహిమను సిద్ధం చేస్తున్నాయని విశ్వసించుటకు మాకు సహాయపడుము. దేవా, మా కష్టాలు మరియు ఎదురు దెబ్బలలో, నీవు తెరవెనుక పని చేస్తున్నావని, మమ్మును ఘనత మరియు ఆనందంతో కూడిన భవిష్యత్తు వైపు నడిపిస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నీవు యోసేపు యొక్క కష్టాలను జయించినట్లుగానే, నీవు తగిన సమయంలో మమ్మును హెచ్చింపజేయుము. ప్రభువా, మమ్మును ఏ మాత్రము నిరాశపరచుకుండా, మా ఉద్యోగములోను, వ్యాపారములోను, చదువులలోను మరియు మా భవిష్యత్తులో మమ్మును హెచ్చించుము. దేవా, మేము ఈ రోజు కృతజ్ఞతతో మరియు విశ్వాసంతో నీ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకొనునట్లుగా నీకృపను మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.