నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు గొప్ప అభివృద్ధికరమైన రోజు! మనము ప్రతి రంగంలోను, భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను మరియు జీవితంలోని అన్ని విషయాలలోను మనము గొప్ప అభివృద్ధిని పొందుకొనబోవుచున్నాము. దేవుని యొక్క వాగ్దానము మన యొద్దకు వచ్చినప్పుడు, ఈలాగున జరుగుతుంది. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 కొరింథీయులకు 9:10లో వ్రాయబడినట్లుగానే, దేవుని వాగ్దానము బయల్పరచుచుండగానే, నేడు ఈ అభివృద్ధి తప్పకుండా మీ యొద్దకు వస్తుంది. కనుకనే, ఆ వాగ్దాన వచనము, " విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్యభాగ్యము గలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొందించును.'' అవును, ప్రభువు మీ కొట్లలలో నిల్వను వృద్ధిపొందింపజేయుచున్నాడు. తద్వారా, మీరు ఎల్లప్పుడు సమృద్ధిగా నిల్వలను కలిగి ఉంటారు. మీరు ఈ అధ్యాయమును చదివినట్లయితే, ధారాళంగాను, ఔదార్యముగాను మరియు ఉత్సాహముగాను ఇచ్చువారికి ఈ ఆశీర్వాదం కలుగుచుండుట మీరు చూడగలరు.
నా ప్రియులారా, సాధారణంగా, లోకములో ఈ విషయము ఎలాగున పనిచేస్తుందో మనము చూచినట్లయితే, క్రమపరమైన మీ ఆదాయమును మీరు మీ బ్యాంక్ ఖాతాలో నిల్వలు ఉంచినప్పుడు, దానిని మీరు ఖర్చు చేయుచున్నప్పుడు క్రమంగా మీ నిల్వలు తరిగిపోతుంటాయి. ఆలాగుననే, మీ ఖాతాలో ఉన్న ధనము కూడా తగ్గిపోతూ ఉంటుంది. సహజంగా ఇలాగున జరుగుతుంది. కానీ ప్రభువు మీకు సెలవిచ్చినట్లుగానే, ఆయన మిమ్మును నడిపించిన రీతిగా మీరు ఇతరులకు ఇచ్చుచుండగా, దేవుడు మీ ఖాతాను వృద్ధిపొందింపజేస్తాడు. ఆయన మీ సరఫరాను వృద్ధిపొందింపజేస్తుంటాడు. ఇది మహిమాన్వితమైనది మరియు మర్మయుక్తమైనది! ఆయన మీ ఆదాయాన్ని వృద్ధిపొందింపజేస్తాడు. మీకు సంబంధించిన వాటన్నిటిని వృద్ధిపొందింపజేస్తాడు. ఇంకను మీ స్థాయిని, ఘనతను వృద్ధిపొందింపజేస్తాడు. ఇంకను మీరు ఇతరుల కొరకు నిస్వార్థంగా ఖర్చు చేయడం వలన ఆయన మీ ఆదాయాన్ని, మీ ఆస్తులను, మీ స్థాయిని మరియు మీ ఘనతను అన్ని విషయాలలో వృద్ధిపొందునట్లు చేస్తాడు. ప్రభువు మీ విత్తన నిల్వను వృద్ధి పొందింపజేస్తాడు.
నేను ఒక చక్కటి సాక్ష్యమును మీతో పంచుకోవాలని కోరుచున్నాను. ఒకరోజు, ఒక కుటుంబము యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమునకు వచ్చారు. ప్రార్థనా యోధుల యొద్ద వారికున్న గొప్ప అప్పు తీర్చబడాలని చెప్పారు. ఆ సమయములో చిన్నపిల్లలకు హుండీలు (డబ్బులు పొదుపు చేసే చిన్న వసూళ్ల పెట్టెలు) ఇచ్చి, చిన్నప్పటి నుండి దేవునికి ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని నేర్చుకునే అలవాటు మాకు ఉండేది. ఈ హుండీలలో వారు సాధ్యమైనంతవరకు డబ్బును పొదుపు చేసి, నిల్వ ఉంచి, దేవుని సేవా పరిచర్య కొరకు సమర్పిస్తారు. తద్వారా వారు చిన్న వయస్సులోనే ప్రభువు సేవకు ఇవ్వడానికి నేర్చుకుంటారు. ఒక బిడ్డ హుండి ద్వారా తన కానుకలను సమర్పించుచున్నప్పుడు, ఈ కుటుంబములో ఉన్న ఒక చిన్న బిడ్డ నేను కూడా ఆలాగుననే ఇవ్వాలని కోరుచున్నాను అని వారి తలిదండ్రులతో చెప్పినది. నాకు కూడా ఒక హుండి కావాలని అడిగి తీసుకొనెను. ఆ కుటుంబమువారు వారికి ఉన్న అప్పులను గురించి చింతిస్తూ, తర్వాత చూద్దాము అని చెప్పినను కూడా సరే, ఆ చిన్న బిడ్డ ఏ మాత్రము కూడా వినిపించుకొనకుండానే, హుండీ కొరకు ఏడుస్తూ ఉండెను. కాదన్నను, మరి ఎక్కువగా ఏడుస్తూనే ఉండెను. ఆ బిడ్డ యొక్క ఒత్తిడి వలన ఆమె తండ్రి ఒక హుండిని తీసి తన కుమార్తెకు ఇచ్చాడు. కానీ, తన చేతిలో పెట్రోలు కొరకు ఉన్న కొంత డబ్బును ఆమె చేతికి ఇచ్చారు. ఆ డబ్బును హుండిలో ఉంచి ఆ పాప ద్వారా అక్కడ ఉన్న ప్రార్థనా యోధులకు అందించారు. జరిగింది ఏమిటో తెలుసా? అదే వారము రోజులలోనే, ఆ పాప తండ్రి యొక్క ఉద్యోగములో ఉన్న యజమానుడు వచ్చి, మీరు ఎంతో అద్భుతముగా పనిని నిర్వర్తించారు. కనుకనే, మీకు వృద్ధిని మరియు పదోన్నతిని కలిగించుచున్నాము అని చెప్పారు. అప్పుడు అతనికి గుర్తునకు వచ్చినది. తన కుమార్తె ఇచ్చిన హుండి ద్వారా ప్రార్థన గోపురములో సమర్పించిన కానుకల సంగతి. తదుపరి ఫర్యాయము ప్రార్థనా గోపురమునకు కుటుంబ సమేతముగా వచ్చి, జరిగిన సంగతి అంతయు వారికి తెలియజేయుట మాత్రమే కాదు, ఆ చిన్న పాప ఈసారి, హుండి నిండుగా డబ్బును సమకూర్చుకొని, ప్రార్థనా గోపురమునకు సమర్పించుట కొరకు చిరునవ్వుతో తీసుకొని వచ్చినది. చూడండి దేవుడు వారి పట్ల ఎంత గొప్ప అద్భుత కార్యమును జరిగించాడు కదా. అవును, దేవునికే సమస్త మహిమ కలుగును గాక.
నా ప్రియమైన స్నేహితులారా, నేడు మీరు కూడా దేవునికి ధారాళంగా ఇచ్చే హృదయాన్ని కలిగియున్నప్పుడు దేవుడు మీ విత్తన నిల్వను కూడా ఆశీర్వాదిస్తాడు. ఆయన మీ పంటను కూడా నీతి ఫలముల పంటగా చేస్తాడు. ఏ రీతిగా ఆ కుటుంబము వారు లక్షలాది మందికి ఆశీర్వాదకరముగా ఉండియున్నారో, ఆ రీతిగా మీ నీతి కూడా తేజోవంతముగా ప్రకాశిస్తుంది. కాబట్టి, నేటి నుండి మీరు దేవునికి ఉత్సాహముగా ఇచ్చుటకు నేర్చుకొన్నట్లయితే, నిశ్చయముగా, దేవుడు నేటి వాగ్దానము ద్వారా మిమ్మును విస్తారముగా వృద్ధిపొందింపజేసి, మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రియమైన ప్రభువా, ధారాళంగా ఇతరులకు ఇచ్చే హృదయాన్ని మాకు దయచేయుము. దేవా, మేము నీకిచ్చుట ద్వారా నేటి నుండి మా నిల్వలను వృద్ధిచేయుము. ప్రభువా, మా చేతిలో ఉన్న స్వల్పమైన వాటిని అత్యధికంగా అభివృద్ధి పొందునట్లుగా చేయుము. ప్రభువా, మేము ఇతరులకు ఇచ్చు కార్యములో మా హృదయాలను తెరచి ఇచ్చుట ద్వారా మమ్మును వృద్ధి పొందించుము. దేవా, అన్ని విషయాలలో మేము వృద్ధిపొందునట్లుగా, మరి ఎక్కువగా ఇతరులకు ఇచ్చునట్లుగా మమ్మును మార్చుము. ప్రభువా, మేము ఈ రోజు మా హృదయం కృతజ్ఞత మరియు విశ్వాసంతో నింపబడునట్లుగా మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, సర్వసంపదలకు ఆధారముగా ఉన్నందున మరియు మా విత్తన నిల్వను వృద్ధిపొందించడానికి మరియు మా యొక్క నీతిఫలములను విస్తరింపజేస్తానని నీ వాగ్దానానికి వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీ ప్రేమలో మేము అనుగ్రహించే వాటన్నింటినీ నీవు మాకు మరల తిరిగి సమృద్ధిగా నింపుతావనియు మరియు వృద్ధిపొందింపజేస్తావని మేము నమ్ముచూ, ధారాళంగాను మరియు ఉత్సాహంగాను నీకు ఇవ్వడానికి దయచేసి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ మార్గాలలో నడవడానికి, నిస్వార్థంగా ఇతరులను ఆశీర్వదించడానికి మరియు మా జీవితంలో నీ సమృద్ధిగా ఉన్న కృపను మేము ప్రతిబింబించడానికి మాకు నేర్పించుము. దేవా, నీ నామానికి మహిమను తీసుకొని వచ్చునట్లుగా మా నీతిని తేజోవంతముగా ప్రకాశింపజేయుము. దేవా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా మరియు అంతకంటె అత్యధికంగా మా జీవితంలోని ప్రతి రంగంలో నీ అద్భుతమైన ఏర్పాటును అనుభవించునట్లు చేయుము. యేసయ్యా, మమ్మును కేవలం భౌతికంగా మాత్రమే కాకుండా, జ్ఞానం, సమాధానము మరియు ఆనందంతో వృద్ధిపొందింపజేయుము. దేవా, అనేకుల జీవితాలను ఫలింపజేయడానికి మమ్మును నీ ఆశీర్వాదములతో నింపబడిన ఒక పాత్రగా ఉపయోగించుకొనుమని యేసుక్రీస్తు వృద్ధిపొందించు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.