నా ప్రియ స్నేహితులారా, నేడు బైబిల్ నుండి యెషయా 33:5 వ వచనమును ఈ రోజు దేవుని వాగ్దానమును మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉన్నది: "యెహోవా మహా ఘనత నొందియున్నాడు ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సీయోనును నింపెను'' అన్న వచనము ప్రకారము దేవుని న్యాయము, నీతి మీ యొద్దకు త్వరగా వస్తుంది. ఆయన మీ పట్ల త్వరగా న్యాయమును జరిగిస్తాడు.


నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు న్యాయము కొరకు ఎదురు చూస్తున్నారా? మీ సమస్య నుండి బయటపడటానికి ఎవరైనా మీకు సహాయం చేసినట్లయితే, బాగుంటుంది అంటున్నారా? నేనేమి తప్పు చేయలేదు, అయినా నాకు వ్యతిరేకంగా నేరారోపణ చేయుచూ, తప్పుడు కేసులు పెట్టారు అంటున్నారా? నా మీద తప్పు నేరారోపణ చేయబడియున్నది, ఇవి ఏవియు కూడ నేను చేయలేదు అని అంటున్నారా? కానీ, మీ మీద పెట్టబడిన ఈ తప్పుడు నేరారోపణ అన్యాయమని, మీ జీవితంలో న్యాయం కొరకు మీరు ఎదురు చూస్తున్నారా? నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానం ద్వారా దేవుడు మీకు త్వరగా న్యాయం చేస్తాడు అని చెప్పబడియున్నది. ఆయన నీతి మరియు న్యాయం త్వరగా మీ యొద్దకు రానై యున్నవి. ఆయన మిమ్మును కనిపెట్టి చూచుచున్నాడు మరియు మీ న్యాయము అతి త్వరగా మీ యొద్దకు వచ్చునట్లు ఆయన చేయుచున్నాడు. కాబట్టి, దిగులుచెందకండి.


ప్రియ సహోదరి రూప జీవితంలో కూడ ఇదే జరిగింది. ఆమె కర్ణాటక నుండి తన సాక్ష్యాన్ని ఇలాగున పంచుకున్నారు. తమ కంపెనీ నుండి తన సహోద్యోగి ఏదో ఒకటి దొంగిలించారని చెప్పారు. తనను విచారణ చేయు సమయంలో, ఆమె సహోద్యోగి రూప ప్రమేయం కూడ ఉందని చెప్పెను. వెంటనే, నిందారోపణతో వారిద్దరు కూడ ఉద్యోగము నుండి తొలగించబడ్డారు. తద్వారా, సహోదరి రూప ఎంతగానో బాధతో దుఃఖించెను మరియు తను ఏ తప్పు చేయలేదని తెలిసి తనకు ఎప్పుడైనా న్యాయం జరుగుతుందా? అని తలంచుకొనుచుండెను. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో, ఆమె జయనగర్ ప్రార్థనా గోపురం వద్దకు వెళ్లి, యేసు పాదాల వద్ద కన్నీటితో మొఱపెట్టింది మరియు ప్రార్థనా యోధురాలు ఆమెకు ప్రార్థించి, ఆమెను తమ యింటికి పంపించారు. మూడు రోజుల తరువాత, ఆమె తాను ఎందుకు న్యాయము అడగకూడదని, తనను తాను సమర్థించుకోవడానికి కంపెనీకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆమె తన అధికారి కార్యాలయానికి వెళ్ళినప్పుడు, ఆమె అక్కడికి వెళ్లిన వెంటనే తన నోరు తెరచి న్యాయము చెప్పాలని అనుకున్నది. కానీ, ఆమె నోరు తెరవక ముందే, ఆమె అధికారి, నీవు ఏ తప్పు చేయలేదు అని మేము కనుగొన్నాము. కనుకనే, ఆమెను తిరిగి పనికి రమ్మని తెలియజేశాడు. తనను తాను సమర్థించుకోకుండానే తనకు ఉద్యోగం తిరిగి వచ్చిందని తలంచి, నమ్మలేక ఆమె నిర్ఘాంతపోయింది. తాను వెళ్లి న్యాయాన్ని అడిగి ఉద్యోగాన్ని పొందుకోవాలని అనుకున్నది. కానీ, తాను ఏ మాట మాట్లాడక ముందే తిరిగి తన ఉద్యోగమును పొందుకున్నది. దేవుడు ఆమె నిందారోపణ నుండి ఆమెకు ఉపశమును కలిగించాడు. దేవునికే మహిమ కలుగును గాక.


అవును నా ప్రియ స్నేహితులారా, దేవుడు ఆమె పట్ల న్యాయము జరిగించి యున్నాడు. అదేవిధముగా, నేడు మీకు కూడ ఆలాగుననే జరిగించనై యున్నాడు. మీ జీవితములో న్యాయము కొరకు ఎదురు చూస్తున్నారేమో? మా జీవితములో జరిగే అన్యాయమును ఎవరైనా చూస్తున్నారా? అని అనుకుంటున్నారా? దేవుడు ఇదంతయు చూస్తున్నాడా? స్నేహితులారా, ఆయన అన్నిటిని చూస్తున్నాడు. కనుకనే, మీకు న్యాయము త్వరగా మీ యొద్దకు వచ్చునట్లుగా ఆయన చేస్తాడు. కాబట్టి, ధైర్యమును వహించండి. ఈ వాగ్దానమును బట్టి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి, ఆయన నుండి ఈ ఆశీర్వాదాన్ని పొందుకుందామా? ఆలాగున చేసి, మన జీవితములో దేవుని యొక్క నీతిని మరియు న్యాయమును పొందుకుందాము. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
నీతిగల న్యాయాధిపతివైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చల్లించుచున్నాము. ప్రభువా, మా జీవితములో నీవు న్యాయమును జరిగించుటకు సిద్ధముగా ఉన్నందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, మా జీవితంలో నీ న్యాయం మరియు నీతిని కోరుతూ ఈ రోజు మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, మేము తప్పుడు నేరారోపణల భారాన్ని మరియు అన్యాయమైన చికిత్స భారాన్ని అనుభవిస్తున్నాము. యేసయ్యా, నీవు సమస్తమును చూస్తున్నావనియు మరియు త్వరగా మాకు న్యాయం జరిగిస్తావనియు నీవు మా పట్ల ఇచ్చిన వాగ్దానాన్ని మేము నమ్ముచున్నాము. ప్రభువా, దయచేసి నీ సమయము కొరకు వేచియుండుటకు మాకు కావలసిన శక్తిని మరియు నమ్మకమును నీవు మాకు అనుగ్రహించుము. దేవా, నీవు మమ్మును చూస్తున్నావనియు మరియు మా పక్షమున న్యాయము జరిగిస్తావని తెలిసి మా హృదయాన్ని సమాధానముతో నింపుము. ప్రభువా, నీ ప్రేమయందు స్థిరముగా ఉండుటకు మరియు నీ నీతియందు విశ్వాసముంచుటకు మాకు సహాయము చేయుము. దేవా, కష్టకాలములో మాకు ఆశ్రయంగా ఉంటూ, మా మీద మోపబడిన తప్పుడు నేరారోపణను తొలగించి, మా కోర్టు కేసు నుండి మాకు త్వరగా నీతి న్యాయమును జరిగిస్తావని మేము నీ మీద నమ్మకం ఉంచియున్నాము మరియు నీ నీతి న్యాయం కొరకు నిరీక్షణతోను మరియు కృతజ్ఞతతోను ఎదురు చూస్తున్న మా జీవితములో త్వరగా న్యాయము జరిగించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నీతిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.