నా ప్రియులారా, నేటి వాగ్దానము ద్వారా బైబిల్ నుండి యెషయా 61:11వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము ప్రకారం ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆ వచనము, " ...నిశ్చయముగా సమస్త జనముల యెదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును'' ప్రకారం నేడు ఆయన మీ నీతిని, న్యాయమును, మీ స్తోత్రమును ఉజ్జీవింపజేస్తాడు.


నా ప్రియులారా, మీ జీవితంలో ప్రభువు ఒక తోటమాలి వంటివాడు. తోట మాలి తన తోటకు మొగ్గు చూపినట్లుగానే, ప్రభువు మీ జీవితంలోని ప్రతిదానికి శ్రద్ధ వహిస్తాడు. అంతమాత్రమే కాదు, ఆయన మీ జీవితములో సమస్తమును మీకు ధారాళముగా అనుగ్రహిస్తాడు. ఇంకను మీ హృదయంలో లేక జీవితములో తన వాక్యపు విత్తనాలను నాటువాడు దేవుడే. ఆయన మీలో తన వాక్యమనే విత్తనమును నాటుతాడు. ప్రభువే దానికి నీరు కట్టుచున్నాడు. అంతమాత్రమే కాదు, ప్రభువే తన పరిశుద్ధాత్మతో మిమ్మును నింపుతాడు మరియు అవి మొలకెత్తడానికి, ఎదగడానికి మరియు వికసించేలా చేస్తాడు. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, యెషయా 58:11 లో చెప్పబడినట్లుగానే, "యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు'' ప్రకారం ప్రభువు మిమ్మును నిరంతరం నడిపిస్తాడనియు మరియు ఎండిన, కాలిపోయిన ప్రదేశాలలో ఆయన సంతృప్తిపరచువాడు. మీ కోరికను తీరుస్తాడని మరియు మీ ఎముకలను దృఢంగా చేస్తానని వాగ్దానం చేయుచున్నాడు. మీరు నీరు కట్టిన తోటవలె, నీటి బుగ్గవలె ఉంటావు. ప్రభువు ఏ విధంగా మీ జీవితములో సమస్తమును జరిగించుచున్నాడు చూడండి, ఆయన మిమ్మల్ని నిరంతరం ఆశీర్వదించడానికి గొప్ప హృదయమును కలిగియున్నాడు. ఆయన మీ యొక్క నీతిని న్యాయమును మొలకెత్తునట్లుగా చేయుటకు మీరు ప్రభువు వైపు చూడండి! ఆయన మీ పట్ల వ్యక్తిగతంగా ఎలా శ్రద్ధ వహిస్తాడు! ఆయన మీ నీతిని, న్యాయమును, నీ స్తోత్రాన్ని ఉజ్జీవింపజేయుచున్నాడు.


అదేవిధంగా, ఉమయాల్‌వాడి అను సహోదరి ఈ రీతిగా తన సాక్ష్యమును తెలియజేసియున్నారు. వారి యొక్క గృహము నిర్మాణ దశలో ఉండియున్నది. వారు గృహమును నిర్మాణము చేస్తున్నప్పుడు, తన పొరుగువారు వారికి ఎన్నో ఇబ్బందులను కలిగించారు. వారి యొక్క స్వంత స్థలమును 5 అడుగులు వారి స్వాధీనము చేసుకున్నారని తప్పుగా వారి మీద కేసును నమోదు చేశారు. వారు ఈ సమస్య గుండా వెళ్లుచున్న సమయములో చెన్నైలో ఉన్న జెసి హౌస్ ప్రార్థనా గోపురమునకు వచ్చారు. వారు ధ్యానగదిలో (ఛాపెల్) ఉండి దేవునికి కన్నీటితో ప్రార్థన చేయుచుండగా, కీర్తనలు 138:8 వ వచనము ఆ గోడ మీద వ్రాయబడి ఉండగా, అక్కడ కూర్చుని ప్రార్థించుకుంటున్న ఆ సహోదరి దృష్టిలో ఈ వాక్యము కనిపించినది. ఆ వచనము, " యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును'' అని వ్రాయబడి ఉండెను. ఆ వచనమును చూచినప్పుడు శాంతి ఆమె హృదయమును నింపినది. కనుకనే ఆమె ఎంతో సంతృప్తిగా వెనుకకు తిరిగి వెళ్లిపోయెను. ఆమె దేవుని వాక్యమునందు విశ్వాసముంచియుండగా, దేవుడు సమస్తమును ఆమె పట్ల జరిగించాడు. వారు కోర్టుకు వెళ్లవలసిన అవసరము లేకుండా, దేవుడు వారి యొక్క సమస్త కార్యములకు పరిష్కారము జరిగించాడు. అప్పటి నుండి ఇక ఆ పొరుగువారు ఏ మాత్రము కూడ ఆమెకు ఇబ్పంది కలుగజేయలేదు. ఆమె నిరాంతరాయంగా నిర్మాణము కట్టుటకు కొనసాగించారు. ఆమె తన యింటి చుట్టు ప్రహరి గోడను కూడ నిర్మించుకున్నారు. ఈ రోజు ఆమె, నాకు ఏ సమస్యలు లేకుండా, నా గృహమును దేవుడే నిర్మించియున్నాడు. గనుకనే ఆ చక్కటి గృహములో నేను నివసించుచున్నాను అని చెప్పెను. మన కోసము సమస్తమును జరిగించే ఎంత ప్రేమగల దేవుని మనము కలిగి యున్నాము కదా! మన కొరకు సమస్తమును చేయడానికి సిద్ధంగా ఉన్న ఎంత ప్రేమగల దేవుడు మనకున్నాడు. కాబట్టి, ఆయన నిశ్చయంగా మీ నీతిని, మీ న్యాయాన్ని మరియు మీ స్తోత్రములను కూడా ఉజ్జీవింపజేస్తాడు. కాబట్టి, ఉల్లాసంగా ఉండండి. ప్రభువు తన పరిపూర్ణమైన శాంతిని మీకనుగ్రహిస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
 

ప్రార్థన:
ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, మా జీవితంలో మా కొరకు సమస్తమును జరిగిస్తావనియు నమ్ముచున్నాము. దేవా, నీవు నీతిగల న్యాయాధిపతివని మేము నమ్ముచున్నాము. కనుకనే, నేడు నీవు మా నీతిని, మా న్యాయమును మరియు స్తోత్రమును ఉజ్జీవింపజేయుము. దేవా, తోటను కాయుచున్న తోటమాలిగా నీవు మా జీవితాలను కాయుము. ప్రభువా, నీవు కూడా మా జీవితాన్ని పోషించుము. ప్రభువా, నీ మాటలను మా హృదయంలో నాటి, వాటికి నీళ్ళు పోసి, నీ పరిశుద్ధాత్మతో మమ్మును నింపి మరియు నీ వాక్యం మా జీవితంలో మొలకెత్తడానికి, ఎదగడానికి మరియు వికసించడానికి అనుమతించుము. దేవా, ఈ రోజు మేము ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మరియు ఆటంకం నీ శక్తివంతమైన నామంలో మా నుండి తొలగించి మా జీవితంలో నీ విజయాన్ని అనుభవించునట్లు చేయుము. ప్రభువా, నీ శాంతి మా జీవితంలో ఒక నదివలె ప్రవహించునట్లు చేసి మరియు నీ మహిమ కొరకు బాగా నీరు కట్టిన తోటవలె మమ్మును ఫలభరితంగా మార్చుమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.