నా ప్రియ సహోదరీ, సహోదరులారా, ఈ సందేశము ద్వారా మిమ్మును కలుసుకోవడం నాకెంతో ఆనందముగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 115:14వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, " యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును'' ప్రకారము దేవుడు మిమ్మును మరియు మీ పిల్లలను వృద్ధి పొందించునట్లు చేయును. దేవుని ఆశీర్వాదము మనకు వృద్ధి పొందించునట్లు చేయుచున్నది. దేవుడు మనలను గురించి తలంచినప్పుడు, దేవుని యొద్ద నుండి మనము అభివృద్ధిని పొందుకుంటాము.
ఇంకను బైబిల్‌లో, కీర్తనలు 40:5వ వచనములో చూచినట్లయితే, కీర్తనాకారుడు ఈలాగున అంటున్నాడు, "యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మా యెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైన వాడొకడును లేడు'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మన జీవితములో ఆశ్చర్యక్రియలను జరిగిస్తాడు. పై వచనము ప్రకారము దేవుడు దావీదును అత్యధికముగా ఆశీర్వదించియున్నాడు. అందుకే అతడు ఈలాగున అంటున్నాడు, 'ప్రభువా, నేను దరిద్రుడను, అవసరతలో ఉన్నాను. కానీ నీవు నన్ను గురించి తలంచుచున్నావు కదా.' అవును, దేవుడు మనలను గురించి తలంచినప్పుడు, మనము వృద్ధిని పొందుకుంటాము. అందుకే 'దేవా, నేను మునిగిపోతున్నానని ఎప్పుడూ చెప్పకండి. ' దేవుడు మీ జీవితంలో తెరవెనుక క్రియలు జరిగిస్తాడు. ఆయన మీ జీవితములో ఒక చక్కటి ప్రణాళికను కలిగియున్నాడు. నా ప్రియులారా, మీరు అల్పులుగా ఉండుట దేవుని యొక్క ప్రణాళిక కాదు. కనుకనే, ధైర్యము తెచ్చుకొనండి.
బైబిల్‌లో యెషయా 51:2వ వచనములో దేవుడు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, "మీ తండ్రియైన అబ్రాహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన శారాను ఆలోచించుడి అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమందియగునట్లు చేసితిని '' అని చెప్పాడు. ఎందుకు అబ్రాహామును పెక్కుమందియగునట్లుగా ఆశీర్వదించెను? ఈ భూమి మీద తన యొక్క రాజ్యాన్ని నిర్మించడాని కొరకు మాత్రమే. అందుకే ప్రభువు మిమ్మును మరియు నన్నును ఆశీర్వదించాలని మన పట్ల కోరుకుంటున్నాడు. మనము ఆదికాండము 22:16-18వ వచనములలో మనము చూచినట్లయితే, దేవుడు అబ్రాహామును ఆశీర్వదించినప్పుడు, ఆయన ఇలాగున సెలవిచ్చాడు, "నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక యీ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.'' అవును, ఈ వచనములో చెప్పినట్లుగానే, దేవుడు మనలను ఆశీర్వదించుట మాత్రమే కాదు, మన పిల్లలను కూడా ఆశీర్వదించుచున్నాడు. ఎందుకు మనలను ఆశీర్వదించుచున్నాడు? తద్వారా, మనం ఇతరులను ఆశీర్వదించగలము. దేవుని ఉద్దేశ్యం ఏమనగా, మనం ఆయన ఆశీర్వాదాలను ఇతరులతో పంచుకోవడమే. అందుచేతనే, ఆయన మిమ్మును మరియు మీ పిల్లలను మాత్రమే కాకుండా మీతో సంబంధం ఉన్న వారందరినీ మరియు మీకు సంబంధించిన ప్రతిదానినీ ఆయన ఆశీర్వదిస్తాడు.
బైబిల్‌లో 2 సమూయేలు 6:11 వ వచనములో చూచినట్లయితే, "యెహోవా మందసము మూడు నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటివారినందరిని ఆశీర్వదించెను. '' అవును, దేవుడైన యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాడు. కనుకనే, మన గృహాలలో దేవుని వాక్యాన్ని భద్రపరచుకోవడం చాలా ప్రాముఖ్యం. మన గృహాలలోనే కాదు, మన పిల్లల హృదయాలలో కూడా భద్రపరచుకోవడం అంతకంటె ముఖ్యము. కనుకనే, దేవుని వాక్యం మనలో నివసించినప్పుడు, ప్రభువు మనకు సంబంధించిన ప్రతిదానిని ఆశీర్వదించుచున్నాడు. నా ప్రియులారా, నేడు మీ ప్రతి ఒక్కరి జీవితాలలో దేవుని అభివృద్ధి, వర్థిల్లత, ఫలప్రదత మరియు విస్తరణను నేను నిర్దేశించుచున్నాను. నేడు స్నేహితులారా, మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబానికి మరియు మీకు సంబంధించిన ప్రతిదానికీ ప్రభువు వృద్ధిని పొందిస్తాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును మరియు మీ కుటుంబమును దీవించును గాక.
ప్రార్థన:
ఆశీర్వాదములకు కర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, నీ సమృద్ధియైన ఆశీర్వాదములకు మరియు మమ్మును ఎల్లప్పుడు తలంచినందుకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, మా జీవితంలో అభివృద్ధి మరియు విస్తరణకు నీవే ఆధారం. ప్రభువా, అబ్రాహాము మరియు దావీదుల కొరకు నీ వాగ్దానములను నీవు నెరవేర్చినట్లుగానే, మాలో కూడా నీ ప్రణాళికలు నెరవేరాలని మేము కోరుచున్నాము. ప్రభువా, మమ్మును మరియు మా పిల్లలను ఆశీర్వదించుము మరియు మా కుటుంబాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చుము. దేవా, నీ వాక్యము మా హృదయాలలో మరియు గృహములలో నివసించుచూ, మా ప్రతి అడుగును సరియైన మార్గములో నడిపించుము. ప్రభువా, ఆకాశపు వాకిళ్లు తెరచి, మాకు సంబంధించిన ప్రతిదానిపై నీ అనుగ్రహాన్ని కుమ్మరించుము. దేవా, మేము చూడలేనప్పుడు కూడా నీ చక్కటి ప్రణాళికను నమ్మడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ అద్భుతాలు మా జీవితాలలో కొనసాగునట్లుగాను మరియు నీ నామమునకు మహిమను తీసుకొని వచ్చునట్లుగా, నీ రాజ్యం మా ద్వారా కట్టబడునట్లుగా కృపను చూపుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.