నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. ఈ రోజు మన ధ్యానము కొరకు 1 పేతురు 5:10వ వచనమును తీసుకొనబడియున్నది. ఆ వచనము, "తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును.'' ఎంత గొప్ప ఆశీర్వాదమును మనము ప్రభువు యొద్ద నుండి పొందుకొనుచున్నాము. సర్వకృపానిధియగు దేవుడు తన యొక్క నిత్య మహిమార్థమై మనలను పిలుచుకొనుట మాత్రమే కాదు, ఆయన మనలను స్థిరపరచి, బలపరుస్తాడు. కాబట్టి, ధైర్యముగా ఉండండి.

అయితే, నా ప్రియులారా, ఈ లోకములో మనము జీవించుచున్నప్పుడు అనేక శ్రమలను ఎదుర్కొనవలసి వస్తూ ఉంటుంది కదా! కారణము, 1 యోహాను 5:18లో మనము చూచినట్లయితే, "మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము'' ప్రకారం ఈ లోకమంతయు దుష్టుని యొక్క చేతిలో ఉన్నది. కనుకనే, మనము శ్రమలను ఎదుర్కొంటున్నాము. మరియు కీర్తనలు 143:3 లో చూచినట్లయితే, "శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు'' అని చెప్పబడినట్లుగానే, అపవాది మనలను గాఢాంధకారములో నివసింపజేయుచున్నాడు. ఎందుకనగా, మనము ప్రభువు సన్ని«ధానమును విడిచిపెట్టి, అంధకారములో మనము కష్టాలను మరియు శోధనలను అనుభవించాలనియు అపవాది మన పట్ల కోరుకుంటాడు. అయితే, చీకటి వైపు చూచుటకు బదులుగా, వెలుగైయున్న యేసు ప్రభువు వైపు మనము చూడాలని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. అందుకే బైబిల్‌లో కీర్తనలు 18:28వ వచనము ప్రకారము, " నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు మన చీకటిని వెలుగుగా చేసి, యథార్థమైన మార్గములో మనలను నడిపింపజేస్తాడు.

నా ప్రియులారా, అందుకొరకే యేసయ్య, మన శ్రమలన్నిటిని మన కొరకు ఆ సిలువలో అనుభవించియున్నాడు. ఆయన పొందిన శ్రమల వలన మనము దేవుని యొక్క ఆశీర్వాదములన్నిటిని పొందుకొనగలుగుచున్నాము. అవును, మనము ఎల్లప్పుడు ఆ సిలువ వైపు చూడవలెను. ఆ సిలువలో ఆయన శారీరకంగాను, మానసికంగాను మన శ్రమలన్నిటిని భరించి, మనకు విడుదలను ఇచ్చియున్నాడను విషయమును ఎల్లప్పుడును, మనము గుర్తుంచుకోవాలి. ఆయన చేసిన త్యాగము వలన ప్రభువు యొక్క సమృద్ధి దీవెనలను మనము పొందుకొనియున్నాము. బైబిల్‌లో చూచినట్లయితే, హెబ్రీయులకు 2:18లో " తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు.'' ఒకవేళ మీరు శోధనలలో ఉన్నారేమో, భయపడకండి, దేవు డు శోధనలను ఎదుర్కొంటున్న మీకు ఆయన సహాయము చేస్తాడు.

అవును, నా స్నేహితులారా, నేడు మీరు మీ సమస్యలను మరియు శ్రమలను చూచి భయపడకండి, ఇప్పుడే మనము ప్రార్థించి, ప్రభువు వైపు చూడబోవుచున్నాము. అతి సుళువైన ప్రార్థన ద్వారా ప్రభువు మిమ్మును అందరిని మీ యొక్క శ్రమల నుండి విడిపించుచున్నాడు. మీ సమస్య ఏదైనను సరే, అది నిరంతరము మీ యొద్ద నుండి తొలగింపబడుతుంది. కనుకనే, నేడు మనము ఆ సిలువ వైపు చూద్దామా? రండి ప్రార్థించుకుందాము. ఒకవేళ మీరు శ్రమలను మరియు శోధనలను ఎదుర్కొంటూ కృంగిపోతున్నారా? దిగులుపడకండి, మీరు కూడ సిలువపై చూడండి, నిశ్చయముగా ఆయన సిలువలో ఉన్న శక్తి చేత, మిమ్మును స్థిరపరచి, బలపరుస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్ధన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీవే మా నిరీక్షణ, సమాధానము, విడుదల, మా సంతోషము నీవే. కనకనే దేవా, మేము నీ వాక్యములో ధ్యానించినట్లుగానే, మా శ్రమలు మరియు సమస్యల నుండి విడుదల పొందుటకు నీ శక్తి మా మీదికి దిగివచ్చునట్లు చేయుము. ప్రభువా, నీ బిడ్డలైన మమ్మును తాకి, మా శ్రమలను మరియు మా బంధకాల నుండి మమ్మును విడిపించుము. ప్రభువా, నీ మహిమార్థమైన మేము సమస్త బంధకాలు మరియు సమస్యల నుండి విడిపించబడుటకు కృపను దయచేయుము. ప్రభువా,ఈ రోజున నీ దయ మరియు ప్రేమకు మేము కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, కొన్నిసార్లు, మా జీవితానికి సంబంధించిన నీ ప్రణాళికను అర్థం చేసుకోవడం మాకు చాలా కష్టంగా ఉన్నప్పటికిని మరియు మా సమస్యలు మమ్మును దిగజా ర్చాయని మేము అంగీకరించుచున్నాము. ప్రభువా, కానీ ఇప్పుడే, మా జీవితాలలో ఉన్న చీకటిని పారద్రోలడానికి మరియు మమ్మును సరైన మార్గంలో నడిపించడానికి నీ మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగియుంటూ, మేము నీ వద్దకు వస్తున్నాము. దేవా, మేము నిన్ను అనుసరించగలిగేలా నీ సత్యం మా హృదయంలో నిజం కావాలని అడుగుచున్నాము. అపొస్తలుడైన పౌలు ప్రార్థించినట్లుగానే, ఏ పోరాటం లేదా బాధ మమ్మును నీ నుండి దూరం చేయకూడదని మేము వేడుకొనుచున్నాము. దేవా, మా జీవితంలో మేము అనుభవించే ప్రతిదీ క్రీస్తులో నీ శాశ్వతమైన మహిమను సూచించునట్లుగా చేయుము. తద్వారా, మేము నీ బిడ్డగా సత్యానికి సాక్ష్యమివ్వగలుగునట్లుగా మమ్మును మార్చుము. దేవా, అదృశ్యమైన మరియు శాశ్వతమైన దానిని వెదకడానికి మరియు ఏమి జరిగినా, నిన్ను విశ్వసిస్తూ, ప్రేమిస్తూ మరియు నిన్ను వెంబడించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ సిలువ ద్వారా నిత్యమహిమకు క్రీస్తునందు మమ్మును పిలిచినందుకు వందనాలు చెల్లించుచు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.