నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నేను మీకు శుభములు తెలియజేయుచున్నాను. బైబిల్ నుండి నేటి వాగ్దానముగా 2 తిమోతికి 4:17వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో, "...ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను...'' అని చెప్పబడినట్లుగానే, నేడు మిమ్మును బలపరచుటకు ప్రభువు మీ ప్రక్కన నిలిచి ఉన్నాడు. ఇది ఎంతటి చక్కటి వాగ్దానము కదా! మనం ఆ లేఖన భాగమునంతటిని చదివినప్పుడు, ఆ తరువాత వచనం, 2 తిమోతికి 4:17-18వ వచనములతో కూడా ఇలాగున చెప్పబడియున్నది, " అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరును దాని విను నిమిత్తమును, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్'' అని చెప్పి ఈ మాటలను అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాశాడు.

అవును, నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు? మీరు ఈ దినములోని ప్రతి క్షణం కూడా దేవుని గట్టిగా పట్టుకొని ఉండాలి. ఒక్క క్షణమైనా సరే, ప్రభువును మరచిపోకండి. మీరు మీ హృదయములో కలత చెందినప్పుడు, ఆయన మీద మీరు దృష్టిని కోల్పోయినప్పుడు లేక మీరు ఆయనను మరచిపోయినప్పుడు, ప్రభువు మీతో ఉండడు. అప్పుడు సాతానుడు వచ్చి, మీ పరిస్థితిని తనకు సాధకముగా తీసుకొని మీ జీవితంలో అన్ని రకాల సమస్యలను సృష్టిస్తాడు. అందుకని, మీరు మీ పూర్ణ హృదయంతో దేవుని గట్టిగా పట్టుకోవాలని దైవజనులు పట్టువదలకుండా బోధిస్తుంటారు. ఇంకను బైబిల్ నుండి కీర్తనలు 115:10,11వ వచనములలో ఇలాగున చెబుతుంది, "అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము. యెహోవాయందు భయభక్తులుగలవారలారా, యెహోవాయందు నమ్మిక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము'' ప్రకారం అవును, నా ప్రియ స్నేహితులారా, దేవుని యందు మీరు పరిపూర్ణముగా నమ్మకముంచినప్పుడు, ఆయన మీకు ఆశ్రయముగాను మరియు కేడెముగాను ఉండి, మీకు సహాయము చేసి, మిమ్మును కాపాడతాడు.

నా ప్రియులారా, మనము బైబిల్‌లో 1 సమూయేలు 14:45 వ వచనములోని వాక్యభాగాన్ని కూడా చదివినట్లయితే, యోనాతాను ఇక్కడ ఒక గొప్ప కార్యమును చేసియున్నాడని మనము చూడగలము. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయుచున్నప్పుడు, వారు ఒకరితో ఒకరు వ్యతిరేకముగా ఉన్నప్పుడు, వారు ఒకరితో ఒకరు యుద్ధము చేయుచున్నప్పుడు, సౌలు అనేకమైనటువంటి నియములను పెట్టాడు. అయితే, యోనాతాను ప్రభువు వైపు మాత్రమే చూచాడు. అందువలననే, " అయితే జనులు సౌలుతో, ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికిని కూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను; యెహోవా జీవముతోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి.'' అవును, యోనాతాను శ్రద్ధగా ప్రభువును వెదికాడు. ఫలితం ఏమిటి? దేవుని గట్టిగా పట్టుకున్న యోనాతాను, ఆయన దృష్టిలో దయను పొందుకున్నాడు. ప్రభువు అతనికి సహాయము చేసి, అతనితో కలిసి యుద్ధము చేశాడు. సౌలు కుమారుడైన యోనాతాను, ఫిలిష్తీయులతో యుద్ధం చేయుచున్న ఇశ్రాయేలీయుల మీద వారికి గొప్ప విజయమును సాధించాడు. ప్రజలు దీనికి సాక్ష్యమిస్తూ, ఇలాగున అన్నారు, 'ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికిని కూడదు. యెహోవా జీవముతోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి,' అతనిని మరణము నుండి కాపాడారు. ఎందుకంటే, అతను ఈ రోజు దేవునితో కలిసి పనిచేశాడు. కనుకనే, అతను మరణము కాకుండా, యెహోవా యోనాతానును రక్షించాడు.

అలాగుననే, నా ప్రియమైన స్నేహితులారా, నేడు మీరు కూడా ప్రభువును దేవుని గట్టిగా హత్తుకొని ఉండండి. మీరు అలాగున చేసినప్పుడు, ఆయన మిమ్మును ప్రతి కీడు నుండి మరియు ప్రమాదాలన్నిటి నుండి కాపాడతాడు మరియు ఆయన మీకు బలముగాను మరియు విమోచకుడిగాను ఉన్నాడు. కనుకనే, మనము ఎంత గొప్ప మరియు ప్రేమగల దేవుని కలిగియున్నాము కదా! అటువంటి దేవుని హస్తాలకు ఈ రోజు మీరు మీ జీవితాలను సమర్పించుకుంటారా? ఆయన మాత్రమే అనుగ్రహించగల బలాన్ని మరియు గొప్ప విడుదలను కనుగొందామా? మీరు ఆలాగున చేసి, దేవుని యొద్ద నుండి బలాన్ని మరియు విడుదలను పొందుకొనండి. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కనికరము గలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీవు మా పక్కన నిలబడి ప్రతి క్షణంలో మాకు బలాన్ని ఇచ్చినందుకై మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, నీవే మా కేడెము మరియు మా విమోచకుడవు మరియు ఆపత్కాలములో మాకు ఎల్లప్పుడూ సహాయం చేయుము. ప్రభువా, యోనాతాను వలె మేము కూడా నిన్ను గట్టిగా హత్తుకొని ఉండునట్లుగా మరియు నీ సన్నిధిని నిత్యము కోల్పోకుండా చేయుము. దేవా, మేము నీ మార్గములను వెంబడించునట్లుగా మాకు కృపను చూపుము. ప్రభువా, మేము మరణము కాకుండా, మంచి సాక్షి జీవితమును కలిగి జీవించునట్లుగాను, యోనాతానుకు సహాయము చేసినట్లుగాను, మాకును సహాయము చేసి, మమ్మును విశ్వాసములో బలపరచి, దీవించుము. ప్రభువా, మేము నీతో అన్యోన్య సహవాసము కలిగియుండునట్లుగా మా హృదయాలను మార్చుము. దేవా, మా శత్రువుల పన్నాగాల నుండి మమ్మును రక్షించుము మరియు నీతి మార్గంలో మమ్మును నడిపించుము. ప్రభువా, నీవు యోనాతానును కాపాడి మరియు అపొస్తలుడైన పౌలును బలపరచినట్లుగానే, మా విశ్వాసములో మమ్మును బలపరచి, విడిపించడానికి నీ బలమైన హస్తములను మేము నమ్ముచున్నాము. దేవా, నీ పరలోక రాజ్యం కొరకు మమ్మును కాపాడతావని నమ్ముతూ మా జీవితాన్ని నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. దేవా, మేము నీకు సాక్షిగా జీవించే కృపను మాకు దయచేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.