నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 60:1 వ వచనము ప్రకారం, ప్రభువు వెలుగు నేడు మీ మీద ప్రకాశింపజేయును గాక: "నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను.'' ఈ వచనం నేను ఆరాధన చేసిన నా యొక్క చిన్ననాటి పాటను గుర్తుచేస్తుంది: 'ఈస్ లిటిల్ లైట్ ఆప్ మైన్, ఐ యామ్ గొన్న, లెట్ ఇట్ షైన్; లెట్ ఇట్ షైన్, లెట్ ఇట్ షైన్, లెట్ ఇట్ షైన్. ఐ వన్'ట్ లెట్ సాటాన్ బ్లో ఇట్ అవుట్; ఐయామ్ గొన్న లెట్ ఇట్ షైన్!' ' నా యొక్క ఈ చిన్న కాంతి, నేను దానిని ప్రకాశింపజేయబోవుచున్నాను. ప్రకాశించనివ్వండి, ప్రకాశింపజేయండి, ప్రకాశింపజేయండి. సాతాను దానిని చెదరగొట్టనివ్వను, నేను దానిని ప్రకాశింపజేయుదును. ప్రకాశించనివ్వండి, ప్రకాశింపజేయండి, ప్రకాశింపజేయండి!' అను ఈ పాటను మా పిల్లలు చిన్న వయస్సులో పాడారు, ఈ రోజు మా మనవరాలు కూడా పాడుతుంది. మన జీవితాలలో కూడా ఎంత అందమైన పాట: ఇది దేవుని వెలుగును గుర్తుచేయుచున్నది. ఆలాగుననే, ప్రభువు మీ హృదయాన్ని తన సంతోషంతో నింపి, ప్రతిరోజు ఈ పాటను పాడేలా చేస్తాడు.
ఇంకను బైబిల్ నుండి సామెతలు 4:18వ వచనములో చెప్పబడినట్లుగానే, "పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును'' అని చెప్పినట్లుగానే, వేకువ వెలుగువలె మీ నీతి తేజరిల్లాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు. అదేవిధంగా, 1 పేతురు 2:9వ వచనములో చూచినట్లయితే, "అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునైయున్నారు'' ప్రకారము మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచియున్నాడు. అవును, మనం ఆయన మహిమ యొక్క సంపూర్ణతను చేరుకునే వరకు, ప్రభువు మన మీద ప్రకాశిస్తూనే ఉంటాడు. దేవుడు వెలుగు, కనుకనే, ఎటువంటి చీకటి కూడా ఆయనను జయించలేదు. ఆయన మనలను తన వెలుగులో, తన అద్భుతమైన వెలుగులో నడిపించాలని కోరుకుంటున్నాడు. కనుకనే, చీకటిని చూచి భయపడకండి.
నా ప్రియులారా, ప్రభువు మిమ్మును అజ్ఞానం, పాపం మరియు దుఃఖం నుండి మీరు బయటకు రావాలని పిలుచుచున్నాడు. అంతమాత్రమే కాదు, మీరు ఆయన వలె ఉండునట్లుగా మిమ్మును జ్ఞానం, తెలివి మరియు పరిశుద్ధత యొక్క వెలుగులోనికి తీసుకువచ్చాడు. అందుకే మత్తయి 4:16లో యేసును గూర్చి చెప్పబడినట్లుగానే, " చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను'' ప్రకారం యేసు ఈ భూమి మీద నడిచినప్పుడు, ప్రజలు ఆయనలో దేవుని వెలుగును చూశారు. బైబిల్ నుండి యోహాను 1:4-5 ప్రకటించినట్లుగానే: "ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగై యుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను'' ప్రకారం దేవునిలో జీవము మనలను అది వెలిగించుచున్నది. కనుకనే, మీరు వెలుగుగా ఉంటారు. చీకటిని మీరు గ్రహింపరు.
నా ప్రియమైన స్నేహితులారా, నేడు మీ చుట్టూ ఉన్న చీకటిని చూచి మీరు భయపడకండి. ఈ లోకమంతయు అంధకారముతో నిండియున్నదనియు, కటిక చీకటి ప్రజలను కప్పివేస్తుందని బైబిల్ చెబుతుంది. అయితే, దేవుని వాగ్దానం యెషయా 60:2లో ఈ వెలుగు ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది: "చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది'' ప్రకారం ఇశ్రాయేలీయులలోని గుడారాల పండుగ సందర్భంగా, ప్రజలు అరణ్యంలో తమను నడిపించిన అగ్ని స్తంభాన్ని గుర్తుచేయుటకు రాత్రివేళ మందిరములో నాలుగు పెద్ద దీప వృక్షములు వెలిగించారు. ఈ దీప వృక్షములు, ప్రజలకంటే ఎత్తుగా ఉంచబడ్డాయి, అవి ఆ పట్టణమంతటిని ప్రకాశవంతమైన వెలుగుతో ప్రకాశింపజేసెను. ఈ వెలుగు కొండ మీద ఉన్న మందిరమును అద్భుతమైన వెలుగుతో నింపినది. అదేవిధంగా, ఈ చీకటి లోకంలో వెలుగుగా ఉండమని దేవుడు మిమ్మల్ని పిలుచుచున్నాడు. మీరు నివసించుచున్న అదే ప్రాంతములో మీరు వెలుగుగా ఉంటూ, ఆ పట్టణమంతటిని వెలిగించవచ్చును. అందుకే, యేసు మత్తయి 5:14వ వచనములో ఇలాగున సెలవిచ్చియున్నాడు," మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండ మీద నుండు పట్టణము మరుగైయుండనేరదు'' అని చెప్పబడినట్లుగానే, మీ సత్క్రియలను ద్వారా మీరు లోకమునకు వెలుగుగా మార్చవచ్చును.
నా ప్రియ స్నేహితులారా, మీరు ఈ లోకానికి వెలుగుగా ఉన్నారు. దేవుని వెలుగు మీ మీద ప్రకాశించుచున్నది. ఎందుకంటే, యేసు లేకుండా, చీకటిని అధిగమించలేము. ఈ లోకములో, చీకటి ప్రజలను ఆవరిస్తుంది, వారిని నిరాశలోనికి ఈడ్చును. ఇది సాతాను యొక్క కార్యములు, చనిపోయిన వారివలె ఆత్మలను చీకటిలో బంధించాలని కోరుతుంది. కానీ ప్రతి మనిషికి వెలుగునిచ్చేందుకు యేసు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన, ' నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక, జీవపు వెలుగును పొందును' అని యేసు స్వయంగా ప్రకటించాడు. నా ప్రియమైన స్నేహితులారా, మీరు యేసును వెంబడించడానికి సిద్ధంగా ఉన్నారా? మీ జీవితంలో ఆయన జీవపు వెలుగుగా ఉన్నప్పుడు, ఈ లోకములోని ఏ చీకటి కూడా మిమ్మును తాకదు. ఆయన వెలుగు మీ ద్వారా ప్రకాశింపజేయుదురు! కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును వెలిగించి, దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా భయం మరియు నిరాశను అధిగమించి చీకటిలో ప్రకాశించే నీ శాశ్వతమైన మరియు అద్భుతమైన వెలుగునకు మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, ఈ చీకటి లోకములో నీ వెలుగును ప్రతిబింబిస్తూ నీ తేజస్సుతో లేచి ప్రకాశించేలా దయచేసి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా అజ్ఞానం, పాపం మరియు దుఃఖం నుండి మమ్మును బయటకు తీసుకొని వచ్చి, నీ అద్భుతమైన జ్ఞానం మరియు పరిశుద్ధత యొక్క వెలుగులోనికి నడిపించుము. దేవా, చీకటిలో జీవించుచున్న మాకు వెలుగుగా ఉన్న యేసయ్య, మమ్మును వెలిగించినట్లయితే, మా జీవితం ఇతరుల మార్గాలను ప్రకాశించునట్లుగా చేయుటకు మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, నీ దయ మరియు సత్యం ద్వారా ప్రకాశించే వెలుగుగా అందరికి వెలుగునిచ్చే కొండ మీద ఉన్న పట్టణముగా ఉండటానికి మాకు అధికారమును దయచేయుము. దేవా, నీ వెలుగుతో మా హృదయాన్ని మరియు మనస్సును కప్పి, శత్రువుల ప్రయత్నాల నుండి మమ్మును రక్షించుము. యేసయ్యా, నీ జీవపు వెలుగుతో మమ్మును నింపుము. ప్రభువా, మేము నిన్ను వెంబడించునట్లుగాను, నీ వెలుగులో నడుచునట్లుగాను, ఏ చీకటి మమ్మును జయించకుండా ఉండునట్లుగా నీ వెలుగుతో మమ్మును ఆవరించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.