నా ప్రియ స్నేహితులారా, బైబిల్‌లో నేటి వాగ్దానముగా ప్రభువు యొద్ద నుండి ఫిలిప్పీయులకు 2:13 కనుగొనబడినది. ఆ వచనము, "...మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే '' అని చెప్పబడిన ప్రకారం ఎంతటి నమ్మకమైన వాగ్దానము కదా. మీరు మీ జీవితములో సకల ఆశీర్వాదములను కలిగియుండు నిమిత్తము మీలో కార్యసిద్ధిని కలుగజేస్తాడు. అవును, దేవుడు మీ ఆత్మలోను మరియు మీ యొక్క మనస్సులోను, ఇంకను మీ యొక్క దేహములో కూడా పని చేస్తాడు. దేవుడు మీ యొక్క ఉనికిలోను పని చేస్తాడు. దేవుడు మీ కుటుంబములోను పని చేస్తాడు. తద్వారా, ఆయన చిత్తము పరిపూర్ణమవుతుంది. ఆయన దయాసంకల్పము నెరవేర్చబడుటకై మీలో సమస్తమును కూడా జరుగుతుంది. మీరు యేసునకు చెందియున్నవారు. మీరు దైవ చిత్తానుసారముగా ఆశీర్వదింపబడియున్నప్పుడు, అందును బట్టి ఆయన ఆనందిస్తాడు. మిమ్మును బట్టి ఆయన యొక్క చిత్తము నెరవేరుతుంది. మీ జీవితము ద్వారా ఆయన చిత్తము పరిపూర్ణము కావడం బట్టి, ఆయన ఎంతగానో ఆనందాన్ని పొందుకుంటాడు.
అందుచేతనే రోమీయులకు 8:28లో మనము చూచినట్లయితే, "దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము'' ప్రకారం దేవుని ప్రేమించేవారికి మరియు ఆయన సంకల్పము చొప్పున జరిగించువారికి ఆయన సమస్తమును మేలు కలుగునట్లు చేస్తాడు. కనుకనే, దేవుని యొక్క మంచితనము, మీ జీవితములో కనుపరచు నిమిత్తమై దేవుడు కార్యములు చేయుచున్నాడు. భయపడకండి, కీడు మరియు శ్రమ, ఇంకను హింసలు రావచ్చును గానీ, మీ జీవితము దేవునికి ఆనందమయముగా ఉండాలి గనుకనే, ఆయన సమస్తమును కూడా మేలుకరముగా చేయువాడై యున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మీరు ఆశీర్వాదకరముగా ఉండుట దేవునికి ఆనందకరము గనుకనే, మీ జీవితములో సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగునట్లుగా ఆయన చేయును. మీరు ఆశీర్వాదములను ఎదురు చూచుటకంటె, మీ నిమిత్తము మేలుకరమైన కార్యములు జరుగు నిమిత్తము ఆయన మిక్కిలిగా ఎదురు చూచువాడై యున్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఆయనను విశ్వసించండి మరియు ఆయనను స్తుతించండి. ఎందుకంటే, ఆయన మహిమ మరియు మీ ఆనందం కొరకు ప్రతిదీ మంచిగా పని చేస్తుందని ఆయన నిర్ధారిస్తాడు.
పాండిచ్చేరికి చెందిన సహోదరుడు దయాళన్ కుటుంబంలో దేవుని వాగ్దానం ఎలా జీవం పోసిందనే దానికి సంబంధించిన శక్తివంతమైన సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని కోరుచున్నాను. అతనికి ఇద్దరు కుమార్తెలు ఉండెను. కోవిడ్ సమయములో వారు చెన్నై నుండి పాండిచ్చేరికి తన భార్య మరియు ఇద్దరు కుమార్తెలతో వెళ్లిపోవడము జరిగింది. త్వరగా తిరిగి రావాలని అనుకున్నారు గానీ, ఆర్థిక సమస్యల వలన వారు తిరిగి రాలేకపోయారు. ఉద్యోగమును కోల్పోయారు. ఆదాయము చాలా స్వల్పముగా ఉండెను. అతడు వాహనములకు సంబంధించిన యంత్ర భాగాలను అమ్మకము చేయుచున్నాడు. మూడు సంవత్సరములుగా అతడు ఎంతగానో బాధను అనుభవించాడు.
కానీ వారి కష్టాల మధ్య, అతను దేవుని యందు ఎంతో నమ్మకంగా ఉండెను. అతడు అటువంటి సమయములో ప్రార్థనా గోపురమును సందర్శించి, ప్రభువు నుండి ప్రార్థన మరియు బలాన్ని కోరుతూ ప్రార్థనలను పొందుకొనుచుండెను. అప్పుడు, నేను భాగస్థులనందరిని కలుసుకునే ఒక భాగస్థుల కూటములో నేను వారి మీద చేతులుంచి, దేవుడు మిమ్మును నిశ్చయముగా ఆశీర్వదించును, మీరు రెండింతలుగా దీవెనలను పొందుకుంటారు అని చెప్పాను.
ఆశ్చర్యకరముగా దేవుని వాగ్దానము వారి జీవితాలలో ప్రత్యక్షపరచబడటం ప్రారంభించింది. మహా అద్భుతముగా అతని యొక్క పాత ఉద్యోగము తిరిగి అతను మరల పొందుకున్నాడు. వారు కేన్సరుతో బాధపడుచున్న ఒక సహోదరిని మా యొద్దకు తీసుకొని వచ్చారు. ఆ సభలో మేము ఆమె నిమిత్తము ప్రార్థించగా, యేసు ఆమెను ముట్టి స్వస్థపరచియున్నాడు. అతని కుమార్తె కళాశాలలో తన విద్యలో ఆశీర్వాదమును స్వీకరించినది. తన కుమార్తె చదువులలో ఉన్నతముగా ఆశీర్వదించబడినది. వారు ఈ రోజు కుటుంబ సమేతముగా దేవునిని సేవించుచున్నారు. దేవుడు మీ జీవితములో మహా ఆనందము నిమిత్తమై సమస్తమును మేలుకరముగా జరిగించువాడై యున్నాడు.
అవును, నా ప్రియమైన స్నేహితులారా, సహోదరుడు దయాళన్ జీవితంలో దేవుడు కార్య సిద్ధి కలుగజేసినట్లుగానే, ఆయన మీకు కూడా అలాగే జరిగిస్తాడు. మీరు ఎదుర్కొనే సవాళ్లు ఏవైనా, అవి ఆయన శక్తికి మించినవి కావని తెలుసుకోండి. ఆయన ఆనందం కొరకు, మీరు ఆశీర్వదించబడినందుకు ఆయన ఆనందం కొరకు, ఆయన ప్రతి పరిస్థితిని మంచిగా మారుస్తాడు. ఆయనను విశ్వసించండి, ఆయన వాగ్దానాలను పట్టుకోండి మరియు విశ్వాసంతో నడుచుకోండి. ప్రభువు నమ్మదగినవాడు మరియు ఆయన మీ జీవితంలో తన చిత్తాన్ని పరిపూర్ణం చేస్తాడు, ఆశీర్వాదాలు మరియు ఆనందాన్ని కొలతకు మించి మీకు అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్యా, మా జీవితములో కోల్పోయిన సమస్తమును మరల మాకు అనుగ్రహించుము. దేవా, నీ యొక్క మంచి ఆనందము కొరకై, మాకు సమస్త మరల దయచేసి, మంచి యీవులు మమ్మును వెంబడించునట్లుగా చేయుము. దేవా, మా జీవితము తిరిగి కట్టబడునట్లుగా చేయుము. ప్రభువా, మా కుటుంబములో ప్రతి ఒక్కరి పట్ల మేము ప్రేమను పొందుకొనునట్లుగా చేయుము. దేవా, మేము ఘనపరచబడునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, నీ పరిపూర్ణ సంకల్పం మరియు మంచి ఆనందాన్ని నెరవేర్చడానికి మా జీవితంలో కార్యసిద్ధి కలుగజేయుము. దేవా, మేము మా జీవితములో ప్రతి భాగాన్ని - మా మనస్సు, శరీరం, ఆత్మ మరియు కుటుంబాన్ని నీ చేతులలోనికి అప్పగించుచున్నాము. దేవా, మేము ఎదుర్కొనే ప్రతి శోధనలలోను, కష్టాల్లోనూ నిన్ను విశ్వసించేలా మా విశ్వాసాన్ని బలపరచి, మాలో కార్యసిద్ధిని కలుగజేయుము. ప్రభువా, దయచేసి నీవు ఎల్లప్పుడూ మా మేలు కొరకు కలిసి పని చేస్తున్నావని మేము గుర్తించునట్లు చేయుము. దేవా, మేము నీ దైవీకమైన సంకల్పముతో ఏకీభంచునట్లుగాను, నీ ఆనందం మా జీవితంలో పొంగిపొర్లునట్లుగా చేయుము. యేసయ్యా, నీవు తగిన సమయంలో నీ ప్రణాళిక బయలుపరచునంతవరకు మాకు ఓర్పును దయచేయుము. ప్రభువా, నీ ఆశీర్వాదాలు మా అవసరాలను తీర్చడమే కాకుండా నీ నామానికి మహిమను తీసుకొని వచ్చునట్లుగాను, నీ విశ్వసనీయతకు మరియు నీకు ప్రియమైన బిడ్డగా జీవించునట్లుగా మాకు నీ కృపను దయచేయుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.