నా ప్రియ స్నేహితులారా, నేటి దినమున మీరు దేవుని ఆశీర్వాదములను పొందుకొనుటకు ఈ సమయమును మీతో గడుపుటకు నేను ఎంతో ఉత్సాహముగా భావించుచున్నాను. మీరు అత్యంత ఉన్నతమైన ఆకాంక్షలను కలిగియుండాలని కోరుచున్నాను. ఎందుకనగా, మిమ్మును ఎంతగానో ప్రేమించుచున్న దేవుడు, మిమ్మును అంత ఎక్కువగా దీవించవలెనని మీ పట్ల కోరుచున్నాడు. కనుకనే, మీరు దేనినిమిత్తము నిరుత్సాహమును చెందకండి. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కొలొస్సయులకు 2:10 వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై యున్నారు; ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై యున్నాడు'' ప్రకారం ఆయన మనకు శిరస్సుగా ఉన్నందున తద్వారా, మనకు సంపూర్ణత కలుగుతుంది. అది ప్రభువైన యేసులో మాత్రమే మీకు సంపూర్ణత వస్తుంది. కాబట్టి, మీరు ఆయన యందు ఉన్న నిరీక్షణను గట్టిగా హత్తుకొని ఉండండి, ఆయనను మీ నుండి తొలగిపోనీయ్యకండి. అంతమాత్రమే కాదు, మీ విశ్వాసము నుండి మీరు ఎన్నటికి తొలగిపోకండి. దేవుడు ఈ రోజు మన జీవితాలలో సంపూర్ణతను అనుగ్రహిస్తానని మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు.
భావన అను పేరుగల ఒక సహోదరి ఉండెను. తన భర్తతో వివాహము జరిగిన తర్వాత, ఆమె కర్నాటకకు వెళ్లిపోయినది. చాలా సంతోషకరమైన వివాహము జీవితము కొరకు ఆమె ఎంతగానో ఎదురుచూచినది. ఆమె ఎదురు చూచినట్లుగానే వివాహము జరిగింది. ఆమె బ్యాంకులో మంచి ఉద్యోగము చేయుచుండెను. కానీ, ఆలాగున 6 నెలలు గడిచిపోయినవి. అయితే, ఈ 6 నెలల కాలములోనే ఆకస్మాత్తుగా అన్ని మారిపోయినవి. పరిస్థితులన్నియు తలక్రిందులుగా మారినవి. వారు ఎంతగానో పోట్లాడుకొనుచుండెను. భార్యభర్తలిద్దరి మధ్యలో వారు సంతోషమును కోల్పోయారు. వారిద్దరి మధ్యలో గొడవలు ఎక్కువైపోయినవి. ఆమె భర్త చాలా చెడు మాటలతో దుర్భాషలాడుచుండేవాడు. తిట్టడము మాత్రమే కాదు, భయంకరముగా దెబ్బలు కొడుతుండేవాడు. తద్వారా, ఆమె యొక్క సంతోషమంతయు ఆ గృహమును విడిచి వెళ్లిపోయినది.
ఈలాగున ఉండగా, కొంతకాలము తర్వాత, అతడు ఆమెను మరియు తన యింటిని విడిచి ఎక్కడికో వెళ్లిపోయాడు. అది చూచిన ఆమె గుండె బ్రద్దలైపోయినది. తద్వారా, ఆమెకు ఏమి చేయాలో తెలియలేదు. ఒక సంవత్సరము పాటు విడిగా జీవించిన తర్వాత, వారు ఒక నిర్ణయమునకు వచ్చారు. ఇక వారు విడాకులు తీసుకుందామనుకొని నిశ్చయించుకున్నారు. కానీ, ఆ సమయములో ఆమె ప్రభువునందు తన యొక్క విశ్వాసమును కోల్పోలేదు. ఇంకను యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమునకు ఆమె కాల్ చేసి, ప్రార్థనలను పొందుకొనెను. ఆ సమయములో మా తండ్రియైన డాక్టర్. పాల్ దినకరన్‌గారికి ఒక ఉత్తరము వ్రాసెను. ఆమె తన పరిస్థితినంతటిని మా తండ్రిగారికి తెలియజేసెను. మా తండ్రిగారు, ఆమె కొరకు ఎంతో భారముగా ప్రార్థించి, ఈలాగున తిరిగి జవాబును పంపించారు, ' ప్రభువు మీ నిమిత్తము కూడా సమస్తమును పరిపూర్ణము చేయుటకు సిద్ధముగా ఉన్నాడనియు మరియు ఆయన మీ జీవితములో అన్నిటిని సంపూర్ణముగా నెరవేరుస్తాడు, కనుకనే దిగులుపడకండి' అని వ్రాశారు. ఆ ఉత్తరములో వ్రాసిన ప్రతి మాటను ఆమె గట్టిగా పట్టుకొని, ఎంతగానో నిరీక్షణతో ప్రార్థించెను.
చివరిగా, ఆమె విడాకులు తీసుకొనవలసిన సమయము వచ్చినప్పుడు, విడాకులు తీసుకొనుటకు కాగితము మీద సంతకము పెట్టవలసిన పరిస్థితులలో ముందుగా ఆమె ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న తన యొక్క స్వంత గ్రామమునకు తిరిగి వచ్చినది. అయితే, ఆమె సంతకము పెట్టకమునుపే, ఆకస్మాత్తుగా తన భర్త తన యింటిలోనికి వచ్చాడు. కర్నాటక నుండి వచ్చాడు. అతడు ఆమెను క్షమాపణ అడిగాడు, 'నన్ను మరల అంగీకరించు, మనమిద్దరము కలిసి జీవించుదామని చెప్పాడు. ' ఆమెతో మరల కలిసి కుటుంబ జీవితము జీవించుట కొరకు కర్నాటకకు తీసుకొని వెళ్లాడు. ఈ రోజు వరకు ఆమె తాను పొందుకున్న అద్భుతమును గురించి చెబుతుంటారు. ఇది ఎంత గొప్ప అద్భుత సాక్ష్యము కదా! ఇది ఎలా జరిగిందో నాకు తెలియలేదు. దేవునికి సోత్రములు. ఈ రోజు చక్కటి కుమార్తెతో సంతోషముగా జీవించుచున్నారు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక.
ఆలాగుననే, నా ప్రియులారా, దేవుడు భావన జీవితమును మరల కట్టినట్లుగానే, మిమ్మును కూడా తన సంపూర్ణతలోనికి తీసుకొని వస్తాడు. కనుకనే, ఆయన యందు నమ్మకముంచండి. కనుకనే, మీరు అచంచలమైన విశ్వాసంతో ప్రార్థించండి మరియు మీ జీవితంలో ఆయన సంపూర్ణత బయలుపరచడం మీరు చూచెదరు. అంతమాత్రమే కాదు, దేవుని సంపూర్ణత మీ జీవితములోనికి దిగివస్తుంది. అంతమాత్రమే కాదు, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగునట్లుగా చేసి, మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ప్రభువా, నీవే సమస్తమును పరిపూర్ణము చేయు దేవుడవని నమ్మి, విశ్వాసముతో నిండిన హృదయముతో మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము. దేవా, నీ సంపూర్ణత మాలోనికి వచ్చినప్పుడు, లోపించినవి, విరిగినవి మరియు నిరర్థకమైనవన్నియు వెళ్ళిపోవునట్లుగా నీ యొక్క సంపూర్ణతను మాలోనికి పంపించుము. ప్రభువా, నీ యందు నమ్మిక ఉంచియున్నాము. దేవా, అన్నియు పరిపూర్ణము చేసే దేవుడవు నీవే. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగునట్లుగా చేయుము. దేవా, నీవు తగిన కాలమందు సమస్తమును పరిపూర్ణము చేస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మా జీవితములో ఉన్న అంసపూర్ణతను తొలగించి, సంపూర్ణతను కలిగించుము. దేవా, నీవు తగిన కాలమందు సమస్తమును పరిపూర్ణము చేయుదువు మరియు మా జీవితము కొరకు నీ దైవీకమైన ప్రణాళికను మేము నమ్ముచున్నాము. యేసయ్యా, మా కోరికలను మరియు మా భారములను నీ చేతులకు అప్పగించుచున్నాము. దేవా, నీవు మాలో నిరీక్షణను చూస్తున్న దేవుడవు, కనుకనే, నీవు మా ప్రార్థనలను గుర్తెరిగి మరియు మా హృదయాంతరంగములో ఉన్న బాధలను అర్థం చేసుకొని, మాకు జవాబును దయచేయుము. ప్రభువా, నీవు మా కొరకు ఇప్పటికే సిద్ధపరచిన విజయ మార్గంలోనికి మమ్మును నడిపించుము. ప్రభువా, మా జీవితములో ఉన్న ప్రతి ఆటంకాలను తొలగించి, నీవు మా పట్ల కలిగియున్న ఉద్దేశము గొప్ప భవిష్యత్తు వైపు నా అడుగులు వేయునట్లుగా చేయుము. దేవా, మా జీవితం నీ మహిమను ప్రతిబింబించునట్లుగాను మరియు నీవు వాగ్దానం చేసిన సమృద్ధిలోనికి మా జీవితములో ఉన్న చీకటి తొలగించి సంపూర్ణతలోనికి నడవడానికి మమ్మును అనుమతించుమని యేసుక్రీస్తు సంపూర్ణమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.