నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ రోజు అద్భుతమైన లేఖన భాగమును మనము ధ్యానించుకొనబోవుచున్నాము. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 61:2వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొఱ్ఱ పెట్టుచున్నాను నేను ఎక్కలేనంత యెత్తయిన కొండ పైకి నన్ను ఎక్కించుము'' అని చెప్పబడిన ప్రకారం నేడు దేవుడు యెత్తయిన కొండపైకి మిమ్మును ఎక్కించాలని మీ పట్ల కోరుచున్నాడు. కాబట్టి, ఆనందంగా ఉండండి.

నా ప్రియులారా, నేడు మీ జీవితములో సమస్యల ద్వారా కృంగిపోయి మరియు కృశించిపోయి ఉన్నారా? మీకు సహాయము చేయుటకు ఎవ్వరు కూడా లేరు అని అంటున్నారా? అయితే, ఇలాంటి క్షణాలలో, మనం దేవుని వాక్యంలో గొప్ప ఆదరణను పొందుకొనగలము. బైబిల్ గ్రంథములో మనము యోనా అను ఒక దైవజనుని చూచినట్లయితే, అతడు జీవితములో ఎన్నో శ్రమలను మరియు సమస్యలను ఎదుర్కొన్నాడు. ఒకసారి దేవుని ఆజ్ఞలను తిరస్కరించి, వేరొక మార్గములో ప్రయాణించాడు. అందునిమిత్తమే అతడు చేప కడుపులో మూడు రాత్రింబగళ్లు గడపవలసి వచ్చినది. ఆ చేప కడుపులో ఎంతో కష్టాన్ని అనుభవించాడు.

నా ప్రియులారా, అతని యొక్క బాధను ఒక్కసారి ఊహించుకొన్నప్పుడు, ఎంత భయంకరముగా ఉంటుందో కదా? ఆ క్షణంలో చేప యొక్క జీర్ణ వ్యవస్థ పనిచేయడం ప్రారంభించినది. అందువలన విచిత్రమైన నొప్పిని మరియు బాధను అతడు అనుభవించాడు. ఆ సమయములో చేప కడుపులో ఉండి అతడు దేవునికి మొఱ్ఱపెట్టియున్నాడు. యోనా 2:1,2వ వచనములను మనము చదివినట్లయితే, " ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను; పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించి యున్నావు'' ప్రకారం ఆ చేప కడుపులో ఉన్నప్పటికిని అతడు దేవుని యొద్ద నుండి జవాబును పొందుకున్నాడు. ప్రభువు అతని మొఱ్ఱను ఆలకించాడు. సజీవముగా చేప కడుపులో నుండి బయటకు కక్కివేయబడ్డాడు.

నా ప్రియులారా, యోనా వలె రాజైన దావీదు కూడా, అనేక సమస్యల మధ్యలో ఈలాగున ప్రార్థించాడు. కీర్తనలు 5:2వ వచనములో దావీదు దేవునికి ఈలాగున మొఱ్ఱపెట్టాడు, "నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను'' ప్రకారం యోనా కూడా ఆ మత్స్యము కడుపులో నుండి యోనా దేవునికి ప్రార్థించాడు మరియు ఆయన కన్నీటితో మొఱ్ఱపెట్టియున్నాడు. ప్రభువు అప్పుడు కూడా అతని మొఱ్ఱను ఆలకించాడు. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా ఆ చేప తన కడుపులో నుండి యోనాను నేల మీద కక్కివేసెను.

ఆలాగుననే, బైబిల్‌లో యాకోబు 5:16వ వచనము ప్రకారము, " నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును'' అని చెప్పబడినట్లుగానే, మనం హృదయ పూర్వకంగా మరియు మనఃపూర్వకముగా ప్రార్థన చేసినప్పుడు, దేవుడు తప్పకుండా వింటాడు మరియు ఆ ప్రార్థనకు ప్రతిస్పందించి జవాబిస్తాడు. మరియు మన ప్రార్థనలు ఎలాగున ఉండాలంటే, ఫిలిప్పీయులకు 4:6వ వచనములో చూచినట్లయితే, "దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి '' ప్రకారం ఆందోళన మనలను ముంచెత్తడానికి బదులుగా, మన చింతలు, భయాలు మరియు పోరాటాలన్నింటిని ప్రార్థనలో ప్రభువు వద్దకు తీసుకురావాలని మనము ప్రోత్సహించబడుచున్నాము. బైబిల్‌లో కీర్తనలు 65:2వ వచనము వాగ్దానం మనకు ఈలాగున చెప్పబడియున్నది. ఆ వచనం, "ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు'' ప్రకారం ప్రభువు మీ మొఱ్ఱను ఆలకిస్తాడు. దేవుడు చేప కడుపులో నుండి యోనా యొక్క మొరను విని అతనిని విడిపించినట్లుగానే, నేడు ఆయన మీ మొరలను విని, మీ సమస్యలన్నిటి నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. ఇప్పుడు కూడా మనము మన ప్రభువు వైపునకు చూడబోవుచున్నాము. ఆయనకు మొఱ్ఱపెట్టబోవుచున్నాము. నేడు ఆయన మీ సమస్యలన్నిటిని తొలగిస్తాడు. మీ జీవితాలలో అద్భుతాలను జరిగిస్తాడు. మీరు దానిని నమ్ముచున్నారా? మీ పరిస్థితి ఎంత లోతుగా లేదా క్లిష్టంగా అనిపించినా సరే, దేవుడు మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు కూడా, మీరు మీ హృదయాన్ని దేవుని వైపునకు త్రిప్పి, ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆయన మీ భారాలన్నింటిని తొలగించి, మీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. ఆయన యోనా జీవితంలో చేసినట్లుగానే నేడు మీ జీవితములో కూడా ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి మిమ్మును విడిపించి మీ పట్ల అద్భుతాలను జరిగిస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
అమూల్యమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన యేసు, నీవు మా కొండ మరియు మా ఆశ్రయం, మేము బలహీనమైన క్షణంలో నీ బలాన్ని మరియు నడిపింపును కోరుతూ నీ వద్దకు వచ్చుచున్నాము. దేవా, నీవు మా సమస్యల కంటే ఉన్నతమైన కొండవి, దుర్గముగా ఉన్నావు, నీలో మేము మా కష్టాలన్నింటి నుండి ఆశ్రయం పొందుకొనుచున్నాము. ప్రభువా, మత్స్యము కడుపు లోపల నుండి యోనా యొక్క మొర నీవు విని జవాబిచ్చినట్లుగానే, ఈ రోజు మా మొర ఆలకించి, మా కష్టాలన్నిటి నుండి మమ్మును రక్షించుము. దేవా, నీవు మా విమోచకుడవు, రక్షకుడవు గనుకనే, మేము సురక్షితముగా ఉండునట్లుగా నీ సన్నిధిలో మొఱ్ఱపెట్టుచున్నాము. దేవా, నీవు ఎల్లప్పుడూ నీ పిల్లలైన మా ప్రార్థనలను ఆలకిస్తావనియు మరియు వాటికి ప్రతిస్పందిస్తున్నావనియు గుర్తెరిగి, నిన్ను పూర్తిగా విశ్వసించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా హృదయాన్ని శాంతి మరియు బలముతోను నింపుతూ, ప్రతిరోజు నీ వాక్యము ద్వారా మమ్మును నడిపించుము. యేసయ్యా, నీవే మా కొండ, కోటగా ఉన్నావని మేము ఎల్లప్పుడూ మా శోధనల కంటే మమ్మును పైకి లేవనెత్తగలవని నమ్ముచున్నాము. దేవా, దావీదు మొఱ్ఱపెట్టినట్లుగానే, మేమును నీ సన్నిధిలో మొఱ్ఱపెట్టుచున్నాము, నేడు మా ఆర్త ధ్వనిని విని మా ప్రార్థనలకు జవాబిచ్చి, మా సమస్యల నుండి మమ్మును విడిపించి, మా పట్ల అద్భుతాలను జరిగించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.