నా ప్రియ స్నేహితులారా, నేడు దేవుని నుండి మనలను బలపరచు వాగ్దానమును మనము కలిగియున్నాము. బైబిల్‌లో, మీరు పరాక్రమము గల బలాఢ్యులని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఆయన ఏ విధంగా పరాక్రమముగల బలాఢ్యుడుగా మనకు సహాయము చేస్తాడో మనము ఆలకించుదాము. ఈ రోజు కొరకైన దేవుని వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 41:13వ వచనమును మనము చదవగలము. ఆ వచనము, "నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను'' అని సెలవిచ్చిన ప్రకారము, ఆయన మీకు సహాయము చేయుటకు మీ కుడి చేతిని పట్టుకొనియున్నాడు. కనుకనే మీరు దేనికిని భయపడకండి.
నా ప్రియులారా, నేడు ఆయన, "నేను మీ కుడి చేతిని పట్టుకున్నాను, మిమ్మును రక్షించువాడు నేనే'' అని ప్రభువు అంటున్నాడు. మనలో అనేకమంది ఈ కుడి చేతితోనే పని చేస్తుంటాము. ఇంకను మనము ఈ కుడి చేతితోనే పరీక్షలు వ్రాస్తుంటాము. అనేకమంది షేకండు ఇచ్చుటకు వచ్చినప్పుడు మరియు అనేకమంది వేదిక మీదికి మాట్లాడుటకు వచ్చి మైక్ పట్టుకున్నప్పుడు, వారి చేతులు వణికి పోతుండుట నేను గమనిస్తుంటాను. ఇంకను మనము కొన్ని పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు లేక ఒక పెద్ద పనిని చేస్తున్నప్పుడు మరియు గొప్ప విధులను నిర్వహించవలసి వచ్చిన సమయములలో భయము మనలను పట్టుకుంటుంది. కానీ, నేడు ఒకరు చెబుతున్నారు, "నేను మీ కుడి చేతిని, పట్టుకొనెదను, నేను మీ మీద నా చేతిని ఉంచుతాను, దేని గురించి మీరు భయపడకుండా, నేను చేస్తాను, భయపడకండి, నేను మీకు సహాయము చేయువాడను నేనే అని నేడు మీ పట్ల సెలవిచ్చుచున్నాడు.'' కనుకనే, మీరు ధైర్యముగా ఉండండి.
అవును, నా ప్రియులారా, మోషేతో చెప్పాడు, "మోషే, నేను నిన్ను ఒంటరిగా పంపించడము లేదు, నేను నా వాక్కును నీ నోట ఉంచెదను, అద్భుతాలు మరియు మహాత్కార్యాలు చేయుటకు నేను నీతో కూడా వస్తాను'' అని మీకు సెలవిచ్చుచున్నాడు. ఆయన తన జ్ఞానాన్ని మీ హృదయములో కుమ్మరించడానికి మీతో కూడా వస్తున్నాడు. మీ ఎదురుగా ఉన్న సమస్తాన్ని సవాళ్లను మరియు సమస్యలను సంపూర్తి చేయుటకు సకల నైపుణ్యతను మీకు అనుగ్రహిస్తాడు.
ఒకసారి ఒక యువకుడు తన సాక్ష్యాన్ని ఈలాగున పంచుకున్నాడు. ఆ యౌవనస్థుడు నేను చదువుకుంటున్నప్పుడు, ఎంతో కష్టపడుచున్నప్పుడు, నేను యౌవన భాగస్థుల పధకములో భాగస్థునిగా చేర్చబడ్డాను. మహాద్భుతముగా, దేవుని హస్తము నాకు సహాయము చేయుట నేను చూడగలిగాను. దేవుడు నాకు సహాయం చేయడం ప్రారంభించాడు మరియు నా అభివృద్ధిలో నేను ఆయన హస్తాన్ని చూశాను. 85 శాతము మార్కులను సాధించి, నా స్కూలు పరీక్షలన్నిటిని నేను ముగించుకోగలిగాను. ఆ తర్వాత విద్యలో నేను ముందుకు వెళ్లుచుండగా, ఇతరులకు విద్యను నేర్పించాలని నేను కోరుకున్నాను. ప్రొఫెసర్ కావాలని నేను కోరుకున్నాను. కానీ, నెట్-సెట్ పరీక్షలు నేను వ్రాయవలసి ఉన్నది. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులవడము చాలా అసాధ్యము అని వారు చెప్పారు. ఉత్తీర్ణత అనగా, ఉద్యోగమును పొందుకోవడము అనేది. కానీ, 70 వేల మంది ఆ పరీక్షకు పోటీ పడుచున్నారు. అయితే, నేను ఆ పరీక్షకు సంసిద్ధము అవుచుండగా, ఎవరో నాకు సహాయము చేసినట్లుగా ఉండెను. దేవుడు ఆ పరీక్షకు నేను మంచిగా కష్టపడుటకు నాకు సహాయము చేశాడు. ఆలాంటి ఆత్మను ఆయన నాకు అనుగ్రహించాడు. 70 వేల మందిలో 134 మంది మాత్రమే ఎంపిక చేయబడ్డారు. అందులో భారత దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా నేను 21వ స్థానములో ఉండి ఉన్నాను. ఇది ప్రచండ విజయము కదా! నా ప్రియ స్నేహితులారా. ఈ రోజు ఉన్నతమైన కళాశాలలో అతడు ప్రొఫెసర్‌గా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.
నా ప్రియులారా, దేవుడు అదే రీతిగా నేడు మీకు బోధించి, మిమ్మును ముందుకు నడిపించును గాక. అంతమాత్రమే కాదు, మీరు యౌవన భాగస్థులుగా చేరినప్పుడు, భాగస్థులుగా ఉన్న మీ పేరు మీద చేతులు పెట్టి ప్రార్థనా యోధులు ప్రతిరోజు మీ భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తారు. మరియు దేవాది దేవుడు మీ చేయి పట్టుకొని మీకు సహాయం చేయడానికిని, మీకు తోడుగా ఉండునట్లుగా మీ పేరు మీద ప్రార్థిస్తారు. అవును నా ప్రియులారా, నేడు మీ భవిష్యత్తును దేవుని హస్తాలకు అప్పగించుదామా? ఆలాగున చేసినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీ చేతి పట్టుకొని, మిమ్మును నడిపిస్తాడు, మీ జీవితములో అన్ని వైపుల అభివృద్ధి మీరు చూచునట్లుగా, మీకు సహాయము చేసి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపాకనికరము కలిగిన మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, మేము చీకటిలో నడుచుచున్నాము. కనుకనే, మా మరణము నిమిత్తము మరియు వ్యాధుల నిమిత్తము, అప్పుల సమస్యల నిమిత్తము మేము భయపడుచున్నాము. కానీ, మమ్మును బలపరచి, భవిష్యత్తులో ముందుకు నడిపించేవాడవు నీవే. కనుక నీలో మేము ఎప్పటికిని భయపడకుండా మమ్మును ధైర్యవంతులుగా మార్చుము. ప్రియమైన ప్రభువా, నేడు మా కుడి చేతిని పట్టుకుని, మేము ఎప్పుడు ఒంటరిగా లేమని నాకు గుర్తు చేసినందుకై నీకు వందనాలు. దేవా, భయం మరియు అనిశ్చితి క్షణాలలో, మేము నీ బలాన్ని నమ్ముచున్నాము. యేసయ్య, నీ జ్ఞానంతో మా హృదయాన్ని నింపుము మరియు మా ప్రతి సవాలులో మమ్మును నడిపించుము. దేవా, నీవు మోషేతో నిలబడినట్లుగానే, నీ మాటలను మా నోటిలో ఉంచి మాతో కూడా నిలబడి, మా పక్షమున నీవు మాట్లాడి మాకు విజయమును దయచేయుము. దేవా, రాబోయే కార్యముల కొరకు మా చేతులను బలపరచుము మరియు వ్యాధులను మరియు మరణమును చూచి వణుకుతున్న మా ఆత్మను మరియు మా చేతులను సమాధానముతో నిమ్మళింపజేయుము. ప్రభువా, మా భవిష్యత్తును నీ ప్రేమపూర్వకమైన చేతులకు అప్పగించుచున్నాము, నీవే మా పట్ల మాకు తోడుగా ఉండి, మమ్మును నడిపించుము. యేసయ్యా, నీవు మాత్రమే ఇవ్వగల నైపుణ్యం మరియు శక్తితో మమ్మును నడిపించుము. దేవా, మేము దేనికిని భయపడకుండా, నీవు మా సహాయకుడివిగా ఉండి, ఇప్పుడు మరియు ఎల్లప్పుడు మమ్మును నడిపించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.