నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు యేసులో చిరునవ్వుతో ఉండబోవుచున్నారని గుర్తుంచుకోండి. ఆయన వ్యక్తిగతంగా మీతో ఉండి, మీతో మాట్లాడుట ద్వారా మిమ్మును ఎంతగానో సంతోషపరచుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి రోమీయులకు 8:32వ వచనములో ఏమని చెబుతుందో చూడండి, "తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక... ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?'' ప్రకారం మన అందరి కొరకు అప్పగింపబడిన ఆయన ఎందుకు మనకు సమస్తమును అనుగ్రహింపడు? చూడండి, ఇది ఎంత చక్కటి లేఖన భాగము కదా!

నా ప్రియులారా, ఆయన తన స్వంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలేదు అని మనము ఈ వచనములో చదువుచున్నాము. తన స్వంత కుమారుడు అను మాటలో భావమేమిటి? దేవుడు తన సొంత కుమారుడిని విడిచిపెట్టలేదని మనం తెలుసుకోవాలనుటయే. ఇది దేవుడు మానవ రూపం ధరించి, ఈ లోకములోనికి దిగివచ్చినట్లుగా సూచించుచున్నది. అదేమనగా, పరలోకములో ఉన్న తండ్రికి మరియు ఈ భూమి మీద కుమారునికి మధ్య ఉన్న బాంధవ్యాన్ని ఆయన వివరించుచున్నాడు. తద్వారా తండ్రి కుమారుల మధ్య ఉన్న బాంధవ్యాన్ని మనకు చూపించునట్లుగా, ఆయన తనను తాను బయలుపరచుకున్నాడు. అందుకే ఆయన, 'యేసును తన కుమారుడు ' అని అంటున్నాడు. కనుకనే, ఈ వచనములో, 'తన స్వంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక,' అని ప్రభువు మన కొరకు చేసిన గొప్ప కార్యాన్ని వివరించుచున్నది. ఆయన తన స్వంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయని ఆయన, సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? అవును, నా ప్రియ స్నేహితులారా, మనకు కుమారుని అనుగ్రహించుట ద్వారా మన జీవితాలు రక్షింపబడ్డాయి. ఇంకను మనలను కడుగుటకు తన పరిశుద్ధ రక్తమును చిందించునట్లుగా చేసియున్నాడు. ఆ రక్తము మన ప్రాణములను రక్షిస్తుంది. అవును, తన స్వంత కుమారుని ఆలాగున జరిగించుటకు మనకు అనుగ్రహించియున్న దేవుడు మీకు అవసరమైన దానిని అనుగ్రహించడా? నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. కాబట్టి, దిగులుపడకండి.


నా ప్రియులారా, అనేక ఫర్యాయములు మనము దీనిని నమ్మము మరియు తగినంతగా విశ్వసించము. అందుచేతనే, సమస్యలను గురించి విచారిస్తూ ఉంటాము. ఇంకను జీవితములో ఈ కార్యాలు జరుగుతాయా? అని దిగులు చెందుతాము. ఈ శస్త్ర చికిత్స సఫలమవుతుందా? ఈ బాకీ లేక అప్పులను తీర్చగలమా? లేక ఎలా ఈ అప్పును తీర్చాలి? నా కుమార్తె/ కోడలు గర్భము ధరిస్తుందా? నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది? అని విచారిస్తుంటాము. ఇంకను ఇతరేతర కార్యముల నిమిత్తము మనము భయపడుతుంటాము. అయితే, తన స్వంత కుమారుని అనుగ్రహించుట ద్వారా తన ప్రేమను చూపించిన దేవుడు, తన కృపాసహితము ద్వారా మీకు అవసరమైన వాటన్నిటిని మీకు అనుగ్రహించడా? అని ఈ వచనము మనకు తెలియజేయుచున్నది. కనుకనే, ఆయన యందు విశ్వాసముంచండి. మత్తయి సువార్తలో చెప్పబడినట్లుగానే, "ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?'' (మత్తయి 6:26)ప్రకారము ఆకాశ పక్షులు ఏమాత్రము కూడ చింతించవు, వాటి పరలోకపు తండ్రి, వాటికి సమస్తమును అనుగ్రహిస్తాడని వాటికి తెలుసును. ప్రతి దిన వనరులు వాటికి దేవుడు దయచేస్తాడని అవి గుర్తెరిగియున్నాయి. కనుకనే, అవి చింతించవు. ఆలాగుననే, మన పట్ల కూడ అది జరుగుతుంది. దేవుడు మనకు పోషణ ఇచ్చును. ఆయన మనకు సమస్తమును అనుగ్రహిస్తాడు. కనుకనే, కేవలం మనము చేయవలసినది ఆయనను స్తుతిస్తూ ఉండాలి. ఆలాగున చేసినప్పుడు, ఆయన మీకు సమస్తమును అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపామయుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీవు మాతో ఉన్నావు, కనుకనే నీవు మాకు సమస్తమును అనుగ్రహిస్తావని మేము నమ్ముచున్నాము. యేసయ్యా, నీవే మా కొరకు ప్రాణమును పెట్టియున్నావు, మా కొరకు నీవు ఈ లోకమునకు వచ్చి, నీ రక్తమును, శరీరమును మా కొరకు బలిగా అర్పించావు, అందును బట్టి నిన్ను స్తుతించుచున్నాము. యేసయ్యా, మమ్మును రక్షించుట కొరకు నీవు మా నిమిత్తము మరణము గుండా వెళ్లియున్నావు. దేవా, మేము నీ యందు నమ్మిక యుంచుచున్నాము, నిన్ను ప్రేమించుచున్నాము. ప్రభువా, నీ ప్రేమపూర్వక వాగ్దానము ద్వారా నీవు మా జీవితంలోనికి తీసుకొని వచ్చిన ఆనందానికి మేము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీవు నీ సింహాసనాన్ని విడిచిపెట్టి, మా కొరకు త్యాగం చేసి ఈ లోకంలోనికి వచ్చావు, నీవు మమ్మును ఎంతగానో ప్రేమిస్తున్నావు మరియు మా కొరకు సమస్తమును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావని మేము గ్రహించునట్లు చేసినందుకై నీకు వందనాలు. దేవా, మా కొరకు సమస్తమును చేయగల శక్తి నీకు కలదు. ఎందుకంటే నీకు అసాధ్యమైనది ఏదియు లేదు. ప్రభువా, నీవు సజీవుడవు గనుకనే, నీవు మా ప్రతి అవసరాన్ని తీర్చి, మా జీవితంలో ఆరోగ్యం, శాంతి మరియు ఆనందాన్ని పునరుద్ధరిస్తావని తెలుసుకుని, మేము విశ్వాసంతో రేపటి దినమును ఎదుర్కొనగలమని నమ్ముచున్నాము. ఎందుకంటే నీవు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడవు. కనుకనే, నీవు మా జీవితంలో ఏ మేలు చేయక మానవు. ప్రభువా, నీ మంచితనం మరియు కృపను మాకు అనుగ్రహించి, సమస్త మేలులను మాకు దయచేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.