నా ప్రియ స్నేహితులారా, దేవుడు మీ జీవితమును మేలుతో నింపి మిమ్మును తృప్తిపరచుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 103:5వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "పక్షిరాజు యౌవనమువలె నీ యౌవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు.'' ఇది మీ కొరకైన దేవుని వాగ్దాన వచనము. పక్షిరాజు యొక్క యౌవనము వలె దేవుడు మీ జీవితమును పునరుద్ధరింపజేయవలెనని మీ పట్ల కోరుచున్నాడు. ఇంకను పక్షిరాజు యొక్క జీవితము వలె మీ జీవితమును మేలుతో తృప్తిపరుస్తాడు. ఈ రోజు మీరు అనుకోవచ్చును, 'నేను అలసిపోయాను, నేను సమస్తమును కోల్పోయాను, అన్నిటిలో ఓటమి పాలైయ్యాను. ముందుకు వెళ్లడానికి బలము లేదు. భవిష్యత్తుకు సంబంధించిన ప్రత్యక్షతలు లేవు కదా. ఆలాంటి సూచనలు నాలో ఏవియు కనిపించలేదు అని అంటున్నారా?' భయపడకండి. నేడు దేవుడు మిమ్మును పక్షిరాజు వలె పైకి లేవనెత్తజేయడము కొరకై ఆయన మేలుతో మీ హృదయమును తృప్తిపరచి, మీ కోరికలను తీర్చుచున్నాడు. కనుకనే, ప్రభువునందు ఆనందించండి.
ఒకవేళ నా ప్రియులారా, మీ ప్రయాసకు తగినంతగా ప్రతిఫలము మీకు రావడము లేదేమో? మీరు నిరుత్సాహము చెందియున్నారు. మేలుతో మీ హృదయ వాంఛలను మీకనుగ్రహించి, ఆయన మీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుడు ఎల్లప్పుడు కూడా మీకు మంచి యీవులు ఇవ్వాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. మీరు లోకపరమైన విధానములో నడుస్తున్నప్పుడు, మీరు లోకపరమైన కార్యములను పొందుకుంటారు. కానీ, యేసు మాత్రమే మంచి యీవులు అనుగ్రహించగలడు. ఎందుచేతననగా, అపవాది మరియు లోకము గానీ, మీ జీవితములోనికి తీసుకొని రావలసిన కార్యములన్నియు కూడా యేసు సిలువలో చేసిన త్యాగము చేత నాశనము చేశాడు. కనుకనే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ జీవితములను బలి అర్పణముగా ఆయనకు సమర్పించుకొనుము. ఆయనతో చెప్పండి, "ప్రభువా, నీ యందు మాత్రమే మేము నిరీక్షణను కలిగియున్నాము. మంచి యీవులను మాకు అనుగ్రహించుచున్నావు. కనుకనే, మా జీవితమును నీకు సమర్పించుకొనుచున్నాము, పరిశుద్ధమైన మార్గములో నేను నడుచుకొందును, ఎల్లవేళల నీ యందే నిరీక్షణ ఉంచియున్న సజీవయాగము వలె నేను నడుచుకొందును అని చెప్పండి. అప్పుడు యేసు తన సిలువ త్యాగము ద్వారా మీ నిమిత్తము కొనుగోలు చేసియున్న మంచి యీవులన్నియు కూడా, మీ యొద్దకు వచ్చును. మీరు అట్టి మార్గము గుండా వెళ్లి కార్యములను చేసియున్నప్పుడు, యేసు యొద్ద నుండి మంచి యీవులు ఒకదాని వెంబడి ఒకటి మీ యొద్దకు వచ్చును. కనుకనే, నేడు మిమ్మును మీరు పరిశుద్ధముగాను సజీవయాగముగాను దేవునికి సమర్పించుకొనండి. అప్పుడు ప్రభువు యొద్ద నుండి ఒకదాని వెంబడి ఒకటి ఆశీర్వాదములు మీ యొద్దకు వచ్చును. కనుకనే, మీరు ప్రభువునందు ఆనందించండి.
నా ప్రియ స్నేహితులారా, బైబిల్‌లో యాకోబు జీవితమును చూడండి. ' నేను కేవలం చేతి కర్రను మాత్రము కలిగియుంటూ, ఒంటరిగా వెళ్లాను. కానీ, దేవుడు నన్ను కలుసుకున్నాడు, నేను ఆయనను కలుసుకున్నాను. నేను ఆయనతో కూడా, నడచాను, ఆయన నన్ను నడిపించాడు, ఈ రోజు రెండింతలుగా రెండు భాగముల స్వాస్థ్య సంపదను కలిగియున్నవాడనై నేను తిరిగి వచ్చుచున్నాను అని అన్నాడు. ' బహు ఐశ్వర్యము, ఘనతను అతడు పొందుకొన్నాడు. దేవుడు ఆలాగుననే, 'నాతో కూడా మాట్లాడుతూ మరియు నాకు దేవుడుగా ఉండెను అని తెలియజేసెను. ఆలాగుననే, ఇస్సాకును గమనించండి, ఆ దేశపు రాజు ఇస్సాకు మీద అసూయ చెందాడు. ఇస్సాకునకు విరోధముగా అతడు పని చేశాడు. ఇస్సాకు బావిని త్రవ్విన ప్రతిఫర్యాయము రాజు యొక్క పరివారము వచ్చి, ఆ బావిని మూతవేశారు. అతడు ముందుకు వెళ్లి మరియొక బావిని త్రవ్వాడు. దేవుడు దానిని ఆశీర్వదించాడు. అతడు త్రవ్విన ప్రతిసారి నీరు వచ్చేవి. ఆ తర్వాత రాజు అతనిని తరిమివేసేవాడు. అతడు వెళ్లి మరియొక బావిని త్రవ్వేవాడు. దైవాశీర్వాదముతో ఆ బావిలో నీరు వచ్చుచుండెను. మరల అక్కడ నుండి తరిమివేశారు. చివరిగా ఏశెకు అను ప్రాంతమునకు వచ్చెను. అతడు బావిని త్రవ్వాడు. ఆ బావి నుండి నీరు వచ్చినవి. శత్రువులు ఇక ఏ మాత్రము రాలేదు. దేవుడు అతనిని బెయేర్షెబాకు తీసుకొని వెళ్లాడు. దేవుడు అతనిని దీవించాడు. నూరంతలుగా అతనిని ఆశీర్వదించాడు. చెడు కార్యాలు చేయడానికి దుష్టప్రజలు వచ్చారు. కానీ, ఇస్సాకు దేవుని యందు నమ్మిక కలిగి ఉండి, పని చేసుకుంటూ వెళ్లాడు. కనుకనే, దేవుడు అతనికి నూరంతలు ఆశీర్వాదమును అనుగ్రహించియున్నాడు.
అవును, నా ప్రియులారా, నేడు ఆయన మీకును నూరంతలుగా మంచి యీవులను అనుగ్రహిస్తాడు. మీ కుటుంబములోను, మీ ఆరోగ్యములోను, మీ జ్ఞానములోను, మీ పేరులోను, మీ ఆర్థికములోను, మీరు దేవునితో నడిచే నడతలోను మీకు ఔన్నత్యమును అనుగ్రహిస్తాడు. అదియే యేసును వెంబడించుట, ఆయన మీ నిమిత్తము సిలువలో క్రయధనమును చెల్లించియున్నాడు. ఇట్టి ఆశీర్వాదము కొరకై మనము ఆయన వైపు చూద్దామా? ఆలాగున మనము ఆయన వైపు చూచినప్పుడు నిశ్చయముగా, దేవుడు మిమ్మును మరియు మీ కుటుంబమును ఇస్సాకు మరియు యాకోబువలె నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, ఎల్లప్పుడు నిన్ను వెంబడించునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, మేము ఎప్పుడు ఈ లోకము మీద నమ్మిక ఉంచకుండా, మేము నీ యందు మాత్రమే నిరీక్షణ కలిగి ఉండునట్లుగా చేయుము. దేవా, నీ యొక్క విభిన్నమైన ప్రత్యేకమైన మార్గములో మమ్మును నడిపించుము. యేసయ్యా, మేము నీ సిలువ యందు నిరీక్షణ కలిగి జీవించునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మాకు మంచి యీవులను దయచేయుము. ప్రభువా, మా జీవితములో ఈ రోజు నుండి మా అర్థికంలోను, శరీరములోను, జీవితములోను, మా కుటుంబములోను మాకు మంచి యీవులను అనుగ్రహించుమని మరియు మా కోరికలను మంచి యీవులను ఇచ్చి తృప్తిపరస్తావని నీవు ఇచ్చిన వాగ్దానానికి వందనాలు. ప్రభువా, నీ అచంచలమైన ప్రేమను నమ్ముకుని, అలసిపోయి, బ్రద్ధలైపోయిన స్థితిలో మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, పక్షిరాజువలె మా బలాన్ని పునరుద్ధరించుము మరియు మా జీవితాన్ని నీ యొక్క ఆశీర్వాదాలతో నింపుము. దేవా, మమ్మును నీకు పరిశుద్ధంగాను మరియు అనుకూలమునైన సజీవ యాగముగాను, మా జీవితాన్ని నీకు సమర్పించుకొనుచున్నాము. దేవా, బైబిల్‌లో ఇస్సాకు మరియు యాకోబువలె, మేము కూడా నీ యొక్క సమృద్ధిగా ఉన్న ఆశీర్వాదాలను మరియు విశ్వాసాన్ని పొందుకొనునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము నీ మీద నమ్మకాన్ని ఉంచియున్నాము. ఎందుకంటే, నీవు మా పోషకుడవు మరియు మా సంరక్షకుడవు మరియు నీవు మా మీద నీ యొక్క రెట్టింపు ఆశీర్వాదాలను కుమ్మరించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.