నా అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి రోమీయులకు 10:9వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల, నీవు రక్షింపబడుదువు'' అన్న వచనము ప్రకారం యేసు క్రీస్తు ప్రభువై యున్నాడని మీరు నమ్మండి. మరియు మీ పాపములన్నిటి నుండి మీరు విజయమును పొందుకోవాలంటే, ఆయన మీ రక్షకుడని మీరు దానిని ఒప్పుకోవాలి. ఇంకను బైబిల్ నుండి నిర్గమకాండము 15:2 మరియు కీర్తనలు 118:14వ వచనములలో మనము చూచినట్లయితే, "యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను'' అని చెప్పబడియున్నది. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, నాతో కలిసి చెబుతారా? "ప్రభువే నా రక్షణ మరియు నా గానము'' అని ఒప్పుకున్నప్పుడు, నిశ్చయముగా నేడే మీకు రక్షణ దినము.
నా ప్రియులారా, నేడు మీరు ఎటువంటి పాపములో ఉన్నను సరే, ఇప్పుడే యేసయ్య దగ్గరకు వచ్చి, "ప్రభువే నా రక్షణాయెను. నేను ఒక పాపిగా జీవించాలని అనుకోవడం లేదు, ఒక పాపిగా నేను బ్రతకాలి అనుకోవడము లేదు. సిలువ ద్వారా దేవుడు నాకిచ్చిన రక్షణను నేను నేడు అనుభవించాలని అనుకుంటున్నాను'' అని మీరు ఒప్పుకోండి. నిశ్చయముగా యేసు సిలువలో సంపాదించిన రక్షణ నేడు మీ సొంతం.
నా ప్రియులారా, ఇంకను బైబిల్‌లో అపొస్తలుల కార్యములు 4:12వ వచనములో మనము చూచినట్లయితే, "మరి ఎవని వలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.'' కనుకనే, ఎల్లప్పుడు యేసు, ఒక శక్తివంతమైన నామమును పలకండి. హల్లెలూయా! అది మీ జీవితానికి రక్షణను తీసుకొని వస్తుంది. యేసయ్యను మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. నేడు మీరు సిలువ వైపు చూడండి, సిలువలో యేసు పొందిన శ్రమల ద్వారా మరియు ఆయన పొందిన గాయాల ద్వారా దేవుడు మీ జీవితాన్ని నూతనంగా మారుస్తాడు.
అదేవిధముగా, నా ప్రియులారా, ఇంకను బైబిల్‌లో 1 తిమోతికి 1:15 వ వచనములో చూచినట్లయితే, "పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను'' అని చెప్పబడిన ప్రకారముగానే నేడు మీలో అనేకమంది మాధక ద్రవ్యాలకు బానిసలై, వ్యసనక్రాంతులై ఉండవచ్చును. లేక మీ జీవితములో రహస్యపు పాపము అలవాట్లు ఇంకా ఏమైన ఉన్నాయా? అని మిమ్మును ఒకసారి పరీక్షించుకొనండి మరియు వాటన్నిటిని ఇప్పుడే ఒప్పుకొని, విడిచిపెట్టుటకు సిలువ వైపు చూడండి, ఇంక వేరొక మార్గము లేదు. కేవలము సిలువ ద్వారానే, మీరు రక్షణ జీవితమును పొందుకొనగలరు. యేసుక్రీస్తు రక్తము వలన మాత్రమే మీ జీవితము పరిపూర్ణంగా రూపాంతరపరచబడుతుంది.
ఇంకను నా ప్రియులారా, మన పట్ల దేవుని హృదయం ఎలా ఉన్నదని చక్కగా వివరించబడియున్నది. అందుకే బైబిల్‌లో 1 తిమోతి 2:4లో చూచినట్లయితే, "ఆయన, మనుష్యులందరు రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు'' అన్న వచనము ప్రకారం మనము రక్షణపొందాలని దేవుడు మన పట్ల కోరుచున్నాడు. ఎందుకంటే, మనము నశించుట ఆయనకు ఇష్టము లేదు కనుకనే, మత్తయి 18:14 వ వచనములో మనము చూచినట్లయితే, "ఆలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తముకాదు'' అని చెప్పబడియున్నది. అదేవిధముగా, ఫిలిప్పీయులకు 2:12 లో మనము చూచినట్లయితే, "కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులైయున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యా కాలమందును, భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి'' అని చెప్పబడినట్లుగానే, దేవుని యందలి భయముతో మీ సొంత రక్షణను కొనసాగించినప్పుడు, నిశ్చయముగా మీరు మీ పాపము నుండి విడుదల పొందుకుంటారు.
నా ప్రియ స్నేహితులారా, ఇప్పుడు మనము ప్రార్థించబోవుచున్నాము. కనుకనే, మీ జీవితాలను ప్రభువునకు సంపూర్ణంగా సమర్పించుకొనండి. ప్రభువు ప్రతి పాపము నుండి మిమ్మును విడిపిస్తాడు. నేడు మీ పాపములు ఎంత భయంకరమైనవైనను సరే, ఇప్పుడే యేసు మిమ్మును విడిపిస్తాడు. ప్రతి విధమైన పాపపు అలవాట్ల నుండి మిమ్మును విడుదల చేస్తాడు. కేవలం యేసయ్యను నమ్మండి. ఆయనకు మీ జీవితాలను అప్పగించండి, యేసయ్యను మీ సొంత రక్షకుని అంగీకరించినప్పుడు, నిశ్చయముగా నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీకు రక్షణను అనుగ్రహించి మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. యేసు ప్రభువా, నీవే మా జీవితానికి ప్రభువు మరియు రక్షకుడవు అని ఒప్పుకుంటూ వినయ హృదయంతో నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, మమ్మును రక్షించడానికి నీవు చనిపోయి తిరిగి లేచావని మేము నమ్ముచున్నాము మరియు ఈ రోజు, నీవే మా రక్షణకు కర్తవని మేము ప్రకటించుచున్నాము. ప్రభువా, మేము మా పాపాలకు దూరంగా ఉండునట్లుగాను మరియు వాటిని ఒప్పుకొని, విడిచిపెట్టునట్లుగాను మరియు నీ విలువైన రక్తంతో మమ్మును శుద్ధులనుగా చేయుము. యేసయ్యా, ఇక నుండి మేము పాపములో జీవించే వ్యక్తులముగా జీవించాలని లేదు కనుకనే, మేము సిలువ ద్వారా నీవు అనుగ్రహించిన విమోచనలో మేము నడవాలనుకుంటున్నాము. కనుకనే, నేడు మా జీవితాలను నీ హస్తాలకు సమర్పించుకుంటున్నాము. దేవా, నీవు మాత్రమే మా ఆత్మకు మోక్షాన్ని మరియు స్వస్థతను తీసుకువస్తావని తెలుసుకుని, నీ పవిత్ర నామం, యేసు, అన్ని నామములకన్న పైనామముగా ఉన్నదని మేము నీ నామము యొద్దకు వచ్చుచున్నాము. దేవా, మేము మా జీవితాన్ని పూర్తిగా నీకు అప్పగించుచున్నాము, నీ దయతో మమ్మును మార్చుము. ప్రభువా, మమ్మును నడిపించుము మరియు భయభక్తితో మా రక్షణను పొందుకోవడానికి మాకు సహాయము చేయుము. యేసయ్యా, మేము నీ రక్తము ద్వారా కడగబడి, నూతన వ్యక్తిగా మార్చబడునట్లుగా మాకు నీ కృపను దయచేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.