నా అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 71:21వ వచనమును తీసుకొనబడియున్నది. ఇది దేవుని యొక్క అద్భుతమైన వాగ్దానము. ఆ వాగ్దాన వచనమును నేడు మనము ధ్యానించుకుందాము. ఆ వచనము, "నా గొప్పతనమును వృద్ధిచేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము'' అన్న వచనము ప్రకారము దేవుడు మీకు నెమ్మది కలుగజేయును నా ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి, నేడు మీకు కూడ దేవుడు నెమ్మదిని కలుగజేస్తాడు.

నా ప్రియులారా, బైబిల్‌లో చూచినట్లయితే, యోహాను 16:33లో దేవుని వాక్యము ఈలాగున సెలవిచ్చుచున్నది. ఆ వచనము, "నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను'' ప్రకారం దేవుడు మనకు సెలవిచ్చినట్లుగానే, మనకు శ్రమ సంభవించినప్పుడు, మనము ధైర్యముగా ఉండాలి. యేసుక్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు, ఆయన కూడ శ్రమలను ఎదుర్కొని యున్నాడు. ఆయన మన యెదుట మాదిరికరమైన జీవితాన్ని జీవించియున్నాడు. ఆయన పరలోకపు తండ్రిని వేడుకుంటూ, ఆయనను ప్రార్థిస్తూ, హత్తుకొని ఉన్నాడు. అదేవిధముగా, నా ప్రియమైన వారలారా, మనమెల్లప్పుడు, దేవుని వైపు కనిపెట్టుకొని ఉండాలి. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, కీర్తనలు 71:20వ వచనములో, "అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసినవాడా, నీవు మరల మమ్ము బ్రదికించెదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరల మమ్ము లేవనెత్తెదవు'' అన్న వచనము ప్రకారము కఠిన బాధలు దేవుడు మనకు కలుగజేసినను, ఆయన మనలను మరల బ్రదికిస్తాడు. అంతమాత్రమే కాదు, మనము కూరుకుపోయి ఉన్న అగాథ జలముల నుండి మనలను పైకి లేవనెత్తుతాడు. కనుకనే ఎటువంటి శ్రమలు వచ్చినను భయపడకండి.

నా ప్రియులారా, బైబిల్ నుండి 1 యోహాను 5:19 వ వచనములో మనము చూచినట్లయితే, " మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము'' ప్రకారము లోకమంతయు దుష్టుని యందున్నది. కాబట్టి, లోకములో ఉన్న మనము దేవుని వైపు చూచినట్లయితే, దుష్టుడైన అపవాది మనలను తాకలేడు. ఇంకను కీర్తనలు 143:3లో మనము చూచినట్లయితే, "శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు చిరకాలము క్రిందట చనిపోయిన వారితోపాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు'' ప్రకారము అపవాది మనలను గాఢాంధకారములో నివసింపజేస్తాడు. కనుకనే, అటువంటి గాఢాంధకారము మరియు శ్రమల నుండి మనము ఎలాగున బయటకు రాగలుగుతాము? అనేకమంది ప్రజలు, అనేక శ్రమల చేత బాధింపబడుచున్నారు. 'అయ్యో, నాకు ఈ శ్రమ ఉన్నది, ఆ శ్రమ ద్వారా వెళ్లుచున్నాను' అని వారు ఎల్లప్పుడు సణగుతూ ఉంటారు. ఇటువంటి శ్రమలన్నిటి నుండి బయటకు ఎలాగున రావలెనని చెప్పే ఒక అద్భుతమైన దేవుని వాక్యము ఉన్నది. అది కీర్తనలు 34:10వ వచనమును చదివినట్లయితే, "సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు'' ప్రకారము మనము దేవుని ఆశ్రయించినట్లయితే, మనకు ఏమేలు కొదువై యుండదు. నా స్నేహితులారా, ఇది ఒక్కటే మార్గము, మనము దేవుని గట్టిగా హత్తుకొనవలెను.

నా ప్రియులారా, మీరు ఆలాగున చేసినప్పుడు, మత్తయి సువార్త 6:33వ వచనములో మనము చూచినట్లయితే, "కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును'' అన్న వచనము ప్రకారము అవును, మనము దేవుని వెదకు అలవాటును కలిగియుండాలి. దేవుని హత్తుకొని ఉండండి. దేవుని యెదుట మీ శ్రమలన్నిటిని కుమ్మరించి, ఆయనకు మొఱ్ఱపెట్టండి. మన దేవుడు ప్రార్థనలను ఆలకించే తండ్రియై యున్నాడు. నిశ్చయముగా, ఆయన మీ అవసరతలన్నిటిని తీరుస్తాడు. ఆలాగుననే, దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా, దేవుడు మీ గొప్పతనమును వృద్ధి చేసి, ఎల్లప్పుడు మీకు నెమ్మదిని కలుగజేయును. ఇప్పుడే, మనము ఆయన వైపు చూద్దామా? ఆలాగున దేవుని వైపు కనిపెట్టుకొని ఉండండి, దేవుని దీవెనలను పొందండి. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ లోకములో మేము ఎదుర్కొంటున్న శ్రమలన్నిటిని బట్టి, మేము నీకే మొఱ్ఱపెట్టుచున్నాము. దేవా, నీ యెదుట మొఱ్ఱపెట్టుచున్న నీ బిడ్డలైన మా హృదయములను యెరిగి యున్నావు, కనుకనే, నీ యొక్క గొప్ప హస్తమును మా మీద ఉంచి, నేడు మా చింతలన్నిటిని మరియు శ్రమలన్నిటిని తొలగించుము. దేవా, నీ యొక్క శక్తితో మేము ఎదుర్కొంటున్న ప్రతి భారము నుండి ఇప్పుడే మమ్మును విడిచిపించుము. ప్రభువా, మేము నీ ద్వారా అద్భుతములను పొందుకొనునట్లుగా చేయుము. దేవా, మమ్మును నెమ్మదిపరచి ఆదరించుము. ప్రభువా, యేసు నిన్ను హత్తుకొని జీవించినట్లుగానే, తనకు కలిగిన శోధనల ద్వారా ప్రార్థించినట్లుగానే, ఎల్లప్పుడు నీ వైపు చూడాలని మరియు నీ బలంపై ఆధారపడాలని మాకు నేర్పించుము. దేవా, మేము అనేకమైన కష్టాలను ఎదుర్కొన్నప్పుడు, నీవు మా జీవితాన్ని పునరుద్ధరించి మమ్మును మరల పైకి లేవనెత్తి, నీ గొప్పతనముతో మమ్మును ఉద్ధరించి, మాకు నెమ్మది కలుగజేయుము. అయితే నిన్ను వెదకువారికి ఏ మేలు కొదువై ఉండదని నీ వాగ్దానములో మేము నిరీక్షించినట్లుగానే, మా అవసరాలన్నిటిని నీవు తీరుస్తావనియు, మొదట నీ రాజ్యాన్ని, నీతిని వెతకడానికి మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు గొప్ప నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.