నా ప్రియమైన స్నేహితులారా, నేడు బైబిల్ నుండి ఒక చక్కటి వాగ్దానముగా సామెతలు 10:22వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆయాశీర్వాదము ఎక్కువ కాదు'' ప్రకారం నేడు ఐశ్వర్యమును కలిగించే దేవుని ఆశీర్వాదములను మీ పట్ల కుమ్మరించాలని కోరుచున్నాడు. ఒకవేళ, మీరు, ' నేను చాలా కష్టపడి పనిచేస్తున్నాను, కానీ నా కొరకు నేను సంపదను కూడబెట్టుకోలేకపోతున్నాను...,నా ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి నేను ఎంతో ప్రయసపడుచున్నాను... నా వ్యాపారంలో లాభం కనిపించడం లేదు... నేను ఎన్నో గంటలు పని చేస్తున్నాను, నా కుటుంబంతో తక్కువ సమయం గడుపుతున్నాను, మరియు ఇంత కష్టపడి పనిచేసినప్పటికిని - నాకు ఎటువంటి ప్రతిఫలం కనిపించడం లేదు అని మీరు అనుకుంటున్నారా?'

అయితే, నా ప్రియ స్నేహితులారా, మీ హృదయమును కలవరపడనీయ్యకండి. నేడు దేవుడు మిమ్మును ఆశీర్వదించాలని మీ పట్ల కోరుచున్నాడు. దేవుడు మీ చేతుల కష్టార్జితమును ఆశీర్వదిస్తాడు. ఆయన మీకు కావలసిన సంపదను సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. మరియు దీనిని మీరు ఎంతో తేలికగాను మరియు సులభంగాను అనుభూతి చెందుతారు. మీరు ప్రభువు నడిపింపుతో సమస్త కార్యాలు జరిగిస్తారు. కనుకనే, మీరు నెమ్మదితోను మరియు సమాధానముతో జీవిస్తారు. మన జీవితంలో, సంపద అంటే మనలో ప్రతి ఒక్కరికి భిన్నమైనదిగా ఉంటుంది. కష్టపడి పని చేయువారికి లేదా వ్యాపారాలు కలిగి ఉన్నవారికి, సంపద అంటే డబ్బును సేకరించడం లేదా సంపదను నిర్మించడం అని అనుకుంటారు. కానీ, పెద్దలకు, సంపద ఆరోగ్యం కావచ్చును. యువతకు, సంపద వారి స్వేచ్ఛ కావచ్చును.

నా ప్రియులారా, మనం బైబిల్‌ను పరిశీలించినప్పుడు, ఇశ్రాయేలీయులు సంపదను కేవలం తినడానికి ఆహారంగా మాత్రమే చూశారు. మనము నిర్గమకాండము 16వ అధ్యాయములో చూచినట్లయితే, వారు ఆహారము లేకుండా అరణ్యములో ఉన్నందున సణిగారు. కానీ, ప్రభువు తన కృపతో, అద్భుతంగా ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించాడు. అది ఎంతో రుచికరంగా ఉండెను. వారు ఎన్నడును అటువంటి ఆహారమును రుచి చూచి ఉండలేనంతగా భిన్నంగా ఉండెను. ఆ దినమునకు కావలసిన ప్రతి భోజనంలోనూ వారికి ఆహారం సమృద్ధిగా ఉండెను. అది ఏమిటో వారికి తెలియదు కాబట్టి, అది అద్భుతంగా ఉండెను కనుకనే, వారు దానిని మన్నా అని పిలిచారు.

అవును, నా ప్రియ స్నేహితులారా, వారు తమ ఆహారాన్ని లేదా సంపదను సంపాదించు కోవడానికి విరామము లేకుండా పని చేయవలసిన అవసరం లేదని గమనించండి. దేవుడు వారితో కూడా ఎల్లప్పుడూ ఉండి, వారికి కావలసిన సమస్తమును అనుగ్రహిస్తాడని వారి పట్ల నిబంధన చేశాడు. కనుకనే, వారు ఆయనను వెంబడించినప్పుడు, వారు పరలోక మన్నాను అనుదినము పొందుకున్నారు. 40 సంవత్సరాలు, అరణ్యంలో వారి ప్రయాణంలో, వారికి ఎటువంటి లోటుగానీ లేక కొరతగానీ కలుగలేదు. అదేవిధంగా, దేవుడు నేడు మిమ్మును కూడా ఆశీర్వదించుచున్నాడు. కాబట్టి, మీరు ఏమి చేసినా అది ఆశీర్వదించబడుతుంది. మీరు చేసిన ప్రతి పని ఆశీర్వదింపబడాలంటే, మీరు ప్రభువుకు విధేయత చూపినప్పుడు, మీరు ఆయనను అనుసరించినప్పుడు, దేవుడు తన సంపదను మీకు సమృద్ధిగా దయచేస్తాడు. అంతమాత్రమే కాదు, మీ జీవితాన్ని నిలబెట్టడానికి ఆయన మీకు సరైన మొత్తంలో డబ్బును మీకు అనుగ్రహిస్తాడు, మీ శరీరంలో మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు మరియు మీ జీవితంలో మూయబడిన తలుపులను తెరుస్తాడు. మరియు, నా స్నేహితులారా, మీరు దాని కొరకు కష్టపడవలసిన అవసరం ఉండదు. కారణము, మీరు ప్రభువును అనుసరించండి, ఆయన స్వరాన్ని వినండి మరియు ఆయన చిత్తాన్ని చేయండి. అప్పుడు మీరు తెరిచి ఉన్న ప్రతి ద్వారములోకి సులభంగా నడుస్తారు. కాబట్టి నా స్నేహితులారా, ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మును ఆశీర్వదించి తన యొక్క సమృద్ధియైన సంపదతో నింపుతాడు. ఎల్లప్పుడు ఆయన ప్రేమతోను మరియు ఆయన ఆత్మతోను నింపబడి ఉండండి. మరియు ఆయనతో దగ్గరగా నడవండి. మీరు చేయాల్సిందల్లా అంతే. ఆలాగుననే, ఆయనను, 'ప్రభువా, నా జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చు' అని మీరు ఈ రోజు ప్రభువును అడుగుతారా? ఆలాగున అడిగి పొందుకొనుటకు మీ జీవితాలను ఆయనకు సమర్పించినట్లయితే, నిశ్చయముగా, ఇశ్రాయేలీయులను పోషించిన దేవుడు నేటి వాగ్దానము ద్వారా మీ కుటుంబమును కూడా పోషించి, మిమ్మును సమృద్ధిగల చోటికి నడిపించి, ఈ వాగ్దాన వచనము ద్వారా మీకు ఐశ్వర్యమిచ్చి, మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రశస్తమైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ అద్భుతమైన వాగ్దానానికి వందనాలు. దేవా, ఇప్పుడు కూడా, మేము చేయుచున్న మా చేతుల పనిని ఆశీర్వదించుము మరియు మా అడుగులు నడిపించుము. ప్రభువా, మా జీవితం నుండి ఫలించని శ్రమ భారాన్ని తీసివేయుము. దేవా, నీవు నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మన్నాను కురిపించినట్లుగానే మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, మా ప్రతి నిర్ణయంలోను నీ శాంతి మరియు నెమ్మదితో మమ్మును నడిపించునట్లుగా చేయుము. దేవా, ఎవరు మూసిన తలుపులు తెరిచి, నీ దీవెనకరమైన ఐశ్వర్యముతో మమ్మును ఆశీర్వదించుము. ప్రభువా, ప్రతిరోజు మమ్మును నీ ఆత్మతోను, నీ ప్రేమతోను మరియు నీ సన్నిధితోను నింపుము. దేవా, మా జీవితం నీ ఆశీర్వాదాలతో పొంగిపొర్లునట్లుగా చేయుము. ప్రభువా, మేము నిన్ను ఎల్లప్పుడూ మహిమపరచునట్లుగా ఐశ్వర్యమిచ్చు నీ ఆశీర్వాదములతో మమ్మును నింపుమని యేసుక్రీస్తు కృపగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.