నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మలాకీ 4:2వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, ‘‘అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు’’ ప్రకారం, ఈ రోజు మీ యొక్క స్వస్థత కొరకు మీరు వేచియున్నారా? ‘‘నేను ఎంతో కాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్నాను. ఈ వ్యాధి ఎన్నో సంవత్సరములుగా నన్ను వేదించుచున్నది? ’’ అని మీరు అంటున్నారా? అయినప్పటికిని, అటువంటి పరిస్థితిలో కూడా, మీరు దేవుని నిందించకుండా, ఆయన నామాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నాను అని చెబుతున్నారా? నా స్నేహితులారా, ఆయన నామమును గట్టిగా పట్టుకొనియున్న మీ మీద నీతి సూర్యుడు ఉదయింపజేసి, తన రెక్కల వలన మీకు నేడే ఆరోగ్యమును కలుగజేస్తాడు మరియు అది ఈరోజే మీ మీదికి దిగివస్తుంది! కనుకనే, మీరు దిగులుపడకండి. నేడే మీరు ఆయన నామాన్ని గట్టిగా పట్టుకొని, ఆయన నామమును ఘనపరచినట్లయితే, నిశ్చయముగా దేవుడు తన రెక్కల క్రింద ఆరోగ్యమును మీకు అనుగ్రహించి, మిమ్మును స్వస్థపరుస్తాడు.
ప్రియమైన సహోదరి ప్రతిమ జీవితంలో కూడా ఇదే జరిగింది. భువనేశ్వర్ నుండి వచ్చి ఆమె తన సాక్ష్యమును ఈలాగున పంచుకొనెను. ఆమె ప్రతి రోజు ప్రార్థనా గోపురమును శుభ్రపరచడంలో ఎంతగానో సహాయం చేసేవారు. కానీ, నవంబర్ 2019వ సంవత్సరములో, ఆమెకు రక్త క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ చేయబడింది. అది విన్న ఆమె హృదయము ఎంతగానో విరిగిపోయినది. ఆమె శరీరంలో రక్తం లేదనియు, ఆమెలో ఉన్న రక్తమంతయు పాడైపోయినది, ఆమె పరిస్థితి పూర్తిగా క్షీణించిందని వైద్యులు చెప్పారు. ఆమెకు క్యాన్సర్ ఉందనియు, ఆమె ఎక్కువ కాలం బ్రతకదనియు మరియు ఆమె త్వరగా చనిపోతుందని వైద్యులు చెప్పారు. ఆమె ఎంతగానో భయపడిపోయినది. తద్వారా, ఆమె హృదయము విరిగిపోయిన పరిస్థితిలో ఉండెను. ఆమె భయంతో, తీవ్ర దుఃఖంతో నిండిపోయింది.
అయినప్పటికిని, అటువంటి పరిస్థితులలో కూడా, ఆమె ప్రార్థన గోపురమునకు మానకుండా వస్తుండేది. తన పని ముగించుకున్న తర్వాత కూర్చుని దేవునికి మొఱ్ఱపెడుతూ, ఏడుస్తుండేది. ఇంకను ఆమెను స్వస్థపరచమని ప్రభువును వేడుకొనేది. డాక్టర్. పాల్ దినకరన్‌గారి యొక్క వర్తమానములు వింటూ, ప్రార్థన చేయుచుండెను. ‘ప్రభువా, ఇది నీ శరీరము అని చెబుతుండేది. నా శరీరములోని, ప్రతి ఎముక, ప్రతి కణము, ప్రతి అవయవము, ప్రతి నరము నీదే ప్రభువా, నీ చిత్తమైతే, నన్ను పరిపూర్ణంగా స్వస్థపరచుము, నన్ను బాగు చేయుము’ అని ప్రార్థన చేయుచుండెను. ఈలాగున సంవత్సరము పాటు ప్రతి రోజు ప్రార్థన చేయుచుండెను. దేవుని నామమును విడిచిపెట్టకుండా, అనుదినము ప్రార్థన చేయుచుండెను. తన పనితో పాటు ప్రార్థన కూడా చేయుచుండెను. ప్రార్థన గోపురమునకు వస్తూ, ఆయన పరిచర్యకు సహాయపడుచూ, ఆయన వాగ్దానాలకు లోబడి ఉంటూ, దేవుని పని చేయుచుండెను.
అ తర్వాత జనవరి, 2021వ సంవత్సరములో ఆమె తన సాధారణంగా, టెస్ట్‌లు హాస్పిటల్‌కు కొరకు వెళ్లినప్పుడు, తన రక్తమును, ఆమె యొక్క ఎముక మజ్జను (బోన్‌మ్యారోను) పరీక్షించి, నీవు ఇప్పుడు పరిపూర్ణంగా స్వస్థతను పొందుకున్నావు, నీలో ఇక బ్లెడ్ క్యాన్సర్ లేదు, నీవు ఈ వ్యాధి నుండి సంపూర్ణమైన విడుదలను మరియు నీవు అద్భుత రీతిలో స్వస్థతను పొందుకున్నావు అని వైద్యులు చెప్పారు. ఆ మాటలు విన్న ఆమె ఎంతగానో సంతోషించినది. ఇంకను తన పూర్ణ హృదయముతో ప్రభువును స్తుతించినది. మరొక పరీక్షను వైద్యులు చేశారు, తన శరీరములో ఏదైన క్యాన్సర్ కణాలు, ఎక్కడైన ఉన్నాయని పరీక్షించారు. కానీ, ఆ పరీక్షలో రక్తపు క్యాన్సర్ నుండి తను పూర్తిగా విడుదల నొందినదని వైద్యులు తెలియజేశారు. అవును,స్నేహితులారా, తద్వారా, ఆమె ఎంతగానో సంతోషించినది. ఆమెను స్వస్థపరచినందుకు ప్రభువును స్తుతించి, ఘనపరచినది. దేవునికి మహిమ కలుగును గాక.
అవును, నా ప్రియ స్నేహితులారా, అదేవిధముగా, దేవుడు మీకు కూడ జరిగిస్తాడు. నేడు మీరు ప్రభువు నామమును ఘనపరుస్తుండగా, నీతి సూర్యుడు మీ మీద ఉదయించి, తన రెక్కల వలన మీకు ఆరోగ్యమును కలుగజేసి, మీకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఆ స్వస్థత ఇప్పుడే, మీ మీదికి దిగివస్తుంది. మీరు క్యాన్సర్‌తోను లేక ఏదైన భయంకరమైన వ్యాధులతో మీరు ఇప్పుడు బాధపడుచున్నారా? ఇక బ్రతకుతారన్న నిరీక్షణ లేదు అని వైద్యులు చెప్పారా? మీ చర్మము పై వచ్చిన దద్దుర్లు లేక గడ్డలు, కణితలు మిమ్మును బాధపెడుతున్నాయా? మీరు చెప్పుకోలేని వ్యాధులతో బాధపడుచున్నారా? మీ కళ్లలలోని నొప్పి మిమ్మును బాధిస్తుందా? ఇప్పుడే ప్రభువు మీ మీద తన ఉదయకాంతితో ఉదయించుచూ, తన నీతితో ప్రకాశించుచున్నాడు. కనుకనే, నేడు మీరు ఆయన నామమును గట్టిగా పట్టుకొని ఉండగా, మీ విశ్వాసమును ఎన్నడును విడిచిపెట్టకుండ ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితులలో కూడా ప్రభువు పరిచర్యను మీరు కొనసాగింపజేస్తుండగా, ఆలాంటి పరిస్థితులలో ప్రభువు తన యొక్క స్వస్థతా కిరణాలు మీ మీద ఉదయింపజేస్తాడు, మిమ్మును పూర్తిగా స్వస్థపరుస్తాడు. ఈ స్వస్థతను ఇప్పుడే మనము పొందుకుందామా? మీరు కూడా ఇటువంటి స్వస్థతను పొందుకోవాలంటే, మీరు దేవుని గట్టిగా పట్టుకొని, ఆయన నామమును ఘనపరచినట్లయితే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును స్వస్థపరచి, ఆయన రెక్కల క్రింద ఉన్న ఆరోగ్యమును మీకు కలుగజేసి, నీతి సూర్యుడు ఉదయించునట్లుగా చేసి, మిమ్మును ఆశీర్వదిస్తాడు.
ప్రార్థన:
అమూల్యమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్యా, అనారోగ్యముతోను మరియు వ్యాధితో బాధపడుచున్న మమ్మును ఇప్పుడే ముట్టి స్వస్థపరచుము. యేసయ్యా, మాలో ఉన్న భయంకరమైన లేక చెప్పుకోలేని వ్యాధులన్నిటిని ఇప్పుడే, నీ నామమున మాకు స్వస్థతను కలుగజేయుము. యేసయ్యా, స్వస్థపరచలేని వ్యాధులను ఇప్పుడే నీ నీతి కిరణాలను ఉదయింపజేసి, మమ్మును ఇప్పుడే, స్వస్థపరచుము. దేవా, నీ యొక్క స్వస్థతా శక్తి మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. ప్రభువా, నీ రక్తము ద్వారా మమ్మును స్వస్థపరచునట్లుగా చేయుము. యేసయ్యా, క్యాన్సర్ నుండియు మరియు చర్మ వ్యాధుల నుండి మమ్మును విడిచిపించుము. దేవా, మాకు మరియు మా ప్రియుల శరీరములో పని చేయని ప్రతి అవయవము ఇప్పుడే యేసు నామమున జీవమును పొందుకొనునట్లుగా చేయుము. ప్రశస్త ప్రభువా, నీ స్వస్థపరిచే శక్తిని నమ్మి, విశ్వాసంతో మేము నీ ముందుకు వచ్చుచున్నాము. దేవా, నీవు నీతి సూర్యుడివి మరియు నీ కిరణాలు నీ నామాన్ని ఘనపరచేవారికి స్వస్థతను తీసుకొని వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మా బాధలో కూడా మేము నిన్ను పట్టుకున్నాము. దేవా, మా బాధలలో కూడా, మేము కదిలించబడకుండునట్లుగాను, నీలో స్థిరంగా నిలిచి ఉండునట్లుగాను చేయుము. ఎందుకంటే నీవు మాకు స్వస్థతను ఇస్తావని మాకు తెలుసు. కనుకనే, దేవా, ఇప్పుడే, నీ యొక్క దైవీకమైన ఉదయకాంతిని మా మీద ప్రకాశింపజేయుము. యేసయ్యా, మా శరీరం, మనస్సు మరియు ఆత్మను మరల నీ గాయముల ద్వారా పునరుద్ధరించుము. ప్రభువా, నీ బలంతో మమ్మును నింపుము మరియు మా సాక్ష్యం నీ పవిత్ర నామాన్ని మహిమపరచునట్లుగా చేయుము. యేసయ్యా, నీ యొక్క అద్భుతమైన స్వస్థత మరియు విఫలం కాని కృపకు సాక్షిగా మేము నిలబడునట్లుగా చేయుము. ప్రభువా, నీవు నమ్మదగినవాడవు కాబట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాము మరియు నీ యొక్క స్వస్థపరిచే శక్తి మాలో పనిచేయునట్లుగా చేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.