నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 సమూయేలు 22:29వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "యెహోవా, నీవు నాకు దీపమై యున్నావు యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును'' ప్రకారం దేవుడు తన శక్తి ద్వారా మన చీకటిని వెలుగుగా మారుస్తుందని ఈ వచనము మనకు చక్కగా గుర్తు చేయుచున్నది. ఆయన మనకు దీపమై యున్నాడు మరియు ఆయన వెలుగు పరిశుద్ధాత్మ తైలంతో ప్రకాశింపబడుతుంది.

నా ప్రియులారా, పరిశుద్ధాత్మ అభిషేకం తైలం వలె మీలోనికి వచ్చి, మిమ్మును నింపినప్పుడు, ఎట్టి అంధకారము కూడా అధిగమించని స్థాయిలో, ఆయన మీ యొక్క వెలుగును ప్రకాశింపజేస్తాడు. కనుకనే, దేవుని సన్నిధి యొక్క అగ్ని మనలో ప్రకాశవంతంగా మండేలా చేస్తుంది. తద్వారా ఏ చీకటి దానిని అధిగమించదు. ఇంకను అపొస్తలుల కార్యములు 2:4వ వచనములో ఈలాగున చెప్పబడియున్నది, " మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి'' ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు తన శిష్యుల మీదికి దిగివచ్చినప్పుడు, వారు అన్యభాషలతో మాటలాడుటకు ప్రారంభించారు. లోక ప్రజలకు విభిన్న భాషలకు సంబంధించిన భాషలలో వారు మాట్లాడుటకు ఆరంభించినప్పుడు, ఆ సమయములో యెరూషలేమునకు విభిన్న దేశముల నుండి ప్రజలు వచ్చారు. వారు దానిని ఆలకించారు. వీరు నిరక్షరాసులు కదా అని అనుకున్నారు కదా! కానీ, వారు ప్రపంచ దేశాలకు సంబంధించిన భాషలను మాట్లాడుచుండిరి. వారు ఆ యొక్క భాషల ద్వారా దేవునిని మహిమపరచారు. వారి మాటలు వీరి హృదయాలను తాకినవి. పేతురు వారికి బోధించినప్పుడు వారు పేతురు ద్వారా దేవుని యొక్క వాక్యమును విన్నప్పుడు ఒప్పింపబడి, వారు యేసు వైపునకు మరలుకున్నారు. వారు ప్రభువును అనుసరించి, వెంబడించేవారుగా ఉన్నారు.

నా ప్రియులారా, పరిశుద్ధాత్మ తైలం ద్వారా వచ్చే వెలుగు ఆ రీతిగా వెలిగింపజేస్తుంది. అది మన యొక్క అంధకారమును వెలుగుగా మార్చేస్తుంది. మనలను ఇతర ప్రజల యొక్క జీవితాలలో వెలుగును తీసుకొని వచ్చునట్లుగా చేస్తుంది. నా ప్రియులారా, ఈ రోజు దేవుడు మిమ్మును వెలుగుగా చేయుచున్నాడు. మీ యొక్క అంధకారమును వెలుగుగా మార్చివేయుచున్నాడు. కనుకనే,మీ జీవితాలను ఆయన హస్తాలకు సమర్పించుకున్నట్లయితే, ఆయన మిమ్మును తన పరిశుద్ధాత్మ చేత నింపుతాడు.

నా ప్రియులారా, పరిశుద్ధాత్ముడు మీ పక్షముగా పోరాడతాడు. శత్రువులు ప్రవాహముల వలె మీకు వ్యతిరిక్తముగా వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి విరోధముగా లేచి నిలుస్తాడు. మీ పక్షమున పోరాడుతాడు, మీ జీవితములో ఉన్న చీకటిని తొలగించి, మీకు దీపముగా ఉండి మీ జీవితాన్ని ప్రకాశవంతముగా వెలిగిస్తాడు. ఆయన ఈ రోజున ఆలాగున మీ జీవితాలలో జరిగించును గాక.

ఒక అద్భుతమైన సాక్ష్యమును మీతో పంచుకోవాలని కోరుచున్నాను. జాన్సన్ దినకరన్ మరియు తన భార్య పేరు జూన్ ప్రియావతి, మరియు వారికి ముగ్గురు పిల్లలు. వారు వారి యొక్క స్వంత గృహమును విడిచిపెట్టి, పిల్లల పాఠశాలకు దగ్గరలో ఒక యింటిని అద్దెకు తీసుకొని అక్కడ ఉంటున్నారు. వారి యొక్క స్వంత గృహమును ఒక న్యాయవాధికి ఇచ్చారు. నాలుగు నెలలు అతడు అద్దె చెల్లించాడు. ఆ తర్వాత సాకులు చెప్పడం ప్రారంభించాడు. అతడు అద్దె చెల్లించడానికి తిరస్కరించాడు. వెనువెంటనే, ఈ కుటుంబము పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి విచారణ చేసినప్పుడు, లాయరు కుటుంబము మేము 10 రోజులలో ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పారు. అయితే, ఈ 10 రోజులలోనే, యజమానుల కుటుంబము తమకు విరుద్ధముగా పోకిరి చేష్టలు చేస్తూ మమ్మును వేధించారని వీరు వారికి విరోధముగా కేసును నమోదు చేశారు. ఇది చూచిన వారికి గ్రుండె బ్రద్ధలైపోయినది. వారి యిల్లు వారికి తిరిగి వస్తుందో లేదో అని చింతిస్తూ, దిగులుపడ్డారు. ప్రస్తుతము వారు ఉంటున్న ఇంటికి ఎలాగున అద్దె చెల్లించాలని వారికి తెలియక విచారించారు.

ఆ సమయములో వారు యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమునకు వెళ్లారు. ప్రార్థనా యోధులు వారితో కలిసి ప్రార్థించి, వారిని ఆదరించారు. వెనువెంటనే, లాయరుకు విరోధంగా ఒక రాజకీయ వేత పోట్లాడడము ప్రారంభించారు. వారిద్దరు పోట్లాడుకున్నారు. చివరిగా ఆ లాయరు ఇల్లు ఖాళీ చేశాడు. అక్కడ నుండి పారిపోవడము కాకుండా, ఆలాగుననే, తప్పుగా వారికి విరోధంగా నమోదు చేసిన కేసును కూడ వెనుకకు తీసుకోవడం జరిగింది. తద్వారా, వారు విడుదల పొందుకున్నారు. దేవుని ప్రజలు విడుదల పొందుకున్నారు.

దేవుడు తన పట్ల చేసిన గొప్ప కార్యము నిమిత్తము జాన్సన్ కదిలించబడి, వెనువెంటనే, ప్రభువుకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. కనుకనే, అతడు ఉద్యోగముతో కూడా యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో ఇప్పుడు క్రీస్తుకు రాయబారిగా సేవ చేయుచున్నాడు. ఇప్పుడు వారు ప్రార్థనా గోపురము ద్వారా దేవునికి సేవను జరిగించుచున్నాడు. ఆలాగుననే, నా ప్రియులారా, నేడు మీరు చీకటిలో జీవించుచున్నారని చింతించకండి, మీ జీవితాలను ఆయనకు సమర్పించుకున్నట్లయితే, దేవుడు మీ అంధకారమును వెలుగుగా మారుస్తాడు. ఆయన మీ చీకటి జీవితమునకు ఎల్లప్పుడు ప్రకాశవంతముగా వెలుగుచున్న దీపమై యుంటాడు. అంతమాత్రమే కాదు, ఆయన మీకు సహాయము చేస్తాడు.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా చీకటి జీవితాన్ని వెలుగుగా మారుస్తానని నీ వాగ్దానానికి కృతజ్ఞతలు. యేసయ్యా, మా చీకటి జీవితాలలోని దీపం నీవే. మా జీవితంలో నీ ప్రకాశించే వెలుగును ఏ చీకటి కూడా అధిగమించలేదు. ప్రభువా, మా జీవితంలోని ప్రతి చీకటిని పారద్రోలుతూ నీ సన్నిధి జ్వాల మాలో ప్రకాశవంతంగా మండునట్లుగా నీ పరిశుద్ధాత్మ తైలంతో మమ్మును అభిషేకించాలని మేము కోరుచున్నాము. దేవా, నీవు పరిశుద్ధాత్మ ద్వారా నీ శిష్యులను శక్తివంతం చేసినట్లుగానే, మేము ఇతరులకు నీ వెలుగును అందజేయగలుగునట్లుగా ఆత్మ యొక్క ఫలాలు మరియు వరములతో మమ్మును నింపి, ఇప్పుడు మమ్మును శక్తివంతముగా చేయుమని కోరుచున్నాము. దేవా, నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా శత్రువుకు వ్యతిరేకంగా నీవు ఒక ఉద్దేశమును కలిగి ఉంటూ మా ప్రతి చీకటిని పారద్రోలి, నీ అద్భుత వెలుగుకు దీటుగా మమ్మును మారుస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నీ బిడ్డలను నీ వెలుగుచేత నింపుము. ప్రభువా, మాకు విరోధంగా జరిగింపబడిన అన్యాయమంతటిని వెలుగుగా మార్చండి. వారు అన్యాయము నుండి విడుదల పొంది న్యాయాన్ని కలిగి ఉండునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, మేము కోల్పోయిన సమస్తమును మాకు తిరిగి దయచేయుము. ప్రభువా, మా ఉద్యోగము, ఆస్తి, మేము కలిగియున్న సమస్తమును మరల మాకు తిరిగి వచ్చునట్లు చేయుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.