నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము మీతో మాట్లాడడము నాకెంతో సంతోషకరముగా ఉన్నది. కాబట్టి, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 26:3వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.'' అవును, నా ప్రియులారా, ఈ వచనము ప్రకారం ప్రభువు మీకు పూర్ణ శాంతిని అనుగ్రహిస్తాడు. శాంతి అనగానే, జీవితములో కలిగి ఉండగలిగే, ప్రశాంతత, కాపుదల మాత్రమే గుర్తుకు వస్తాయి. ప్రశాంతమైన సరస్సులో ఒక పడవలో కూర్చున్నట్లుగా ఊహించుకోండి. సూర్యుడు ప్రకాశించుచున్నాడు, చల్లని గాలి మీ ముఖము మీద వీస్తున్నప్పుడు, మీకు ఎంతో భద్రతగా ఉన్నామని అనిపిస్తుంది. ఆ సమయములో మీరు ఎంతో సమాధానమును కలిగి ఉంటారు. అన్నియు ప్రశాంతగా ఉన్నాయి అని తెలుసుకోవడం మీకు విశ్రాంతిని కలిగిస్తుంది. తద్వారా, మీరు సమాధానమును కలిగి ఉంటారు.
నా ప్రియులారా, ఒక దట్టమైన పొగమంచు చుట్టుకొని యున్న ఒక సరస్సు మధ్యలో ఉంటే ఏమి జరుగుతుంది? మీరు అవతల వైపు ఏమున్నదో చూడలేరు. అది అల్లకల్లోలమైన పరిస్థితిగాను, మీరు జీవిస్తారు అన్న నిరీక్షణ మీలో ఉండదు. అటువంటి పరిస్థితిలో కూడా మీ హృదయములో మీకు సమాధానము ఉంటుంది. ఒక గొప్ప వ్యక్తి చేతిలో మీ జీవితము ఉన్నదని తెలుసుకోవడములో, మీరు భద్రంగాను, నెమ్మదిగా జీవిస్తారు అన్న నిరీక్షణను మీరు కలిగి ఉంటారు. అది పరిపూర్ణమైన శాంతి, అది దేవుడు అనుగ్రహించు గొప్ప శాంతి. కనుకనే, అటువంటి శాంతిని దేవుడు నేడు మీకివ్వాలని మీ పట్ల వాంఛ కలిగియున్నాడు. కాబట్టి, అటువంటి శాంతిని పొందుకొని ప్రభువునందు ఆనందించండి.
నా ప్రియులారా, మన జీవితములో అనేకమైన కష్టములతో మనము చుట్టుకొనబడి ఉండవచ్చునేమో? భవిష్యత్తు మనకు ఏమి కలుగజేస్తుందన్న భయము మనలో తెలియకుండా ఉండవచ్చునేమో? మన జీవితములో పరిస్థితులు అల్లకల్లోలముగా ఉన్నాయి, మనము ముందుకు సాగి వెళ్లలేకుండా మనలను అనేక సవాళ్లు అడ్డుకుంటున్నాయని అనుకుంటున్నారేమో? అటువంటి పరిస్థితులలో కూడా దేవుడు తన సమాధానమును మరియు నెమ్మదిని మనకు ఇచ్చుచున్నాడు. ఆయన మనలను గురించి జాగ్రత్త వహించుచున్నాడు అన్న నిరీక్షణను మనలో కలుగజేస్తాడు. మనము దేవుని ప్రేమించుచూ, ఆయన యందు నమ్మకము ఉంచినప్పుడు, ఆయన తన యొక్క దైవీక సమాధానము మన హృదయాలలో ఉంచుతాడు. దేవుని వాక్యములో మనము దానినే చూడగలము. బైబిల్‌లో, కీర్తనలు 119:165వ వచనమును మనము చూచినట్లయితే, "నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు'' అన్న వచనం ప్రకారం మనము ఆయన ధర్మశాస్త్రమను దేవుని వాక్యమును ప్రేమించినప్పుడు మన జీవితాలలో మనకు ఎంతగానో నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా!
అవును, నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు దేవుని ప్రేమించుచూ, మీ పూర్తి నమ్మకమును ఆయన మీద ఉంచినప్పుడు, ఆయన ఆజ్ఞలను మీరు పాటించినప్పుడు, తన పూర్ణ శాంతిని మీ యందు ఉంచుతాడు. అంతమాత్రమే కాదు, మీరు పడిపోకుండా కాపాడబడతారు. ఏది మిమ్మును కదలించబడలేదు. ఇంకను మీకు వ్యతిరేకముగా ఎన్నో మాటలు రావచ్చును. ప్రజలు మీకు వ్యతిరేకముగా లేవవచ్చును. మీ ముందున్న పరిస్థితులు జీవితములో మీరు ముందుకు అడుగు వేయకుండా మీకు అడ్డంకులను కలుగజేయవచ్చును. మిమ్మును నశింపజేయుటకు ప్రయత్నించుచుండవచ్చును. అటువంటి పరిస్థితులలో కూడా దేవుడు మీకు పూర్ణ శాంతిని అనుగ్రహిస్తాడు. అంతమాత్రమే కాదు, మీరు పడిపోకుండా మిమ్మును కాపాడతాడు. మీరు భవిష్యత్తును గురించి ఎంతమాత్రము కూడా భయపడరు. ఇంకను, దేవుని హస్తాలలో మీ జీవితము భద్రంగా ఉంటుందని మీరు గుర్తెరుగుతారు. ఆయన మిమ్మును భద్రంగా ఒడ్డునకు చేరుస్తాడు. మీరు ఊహించని విధంగా మీ జీవితమను గమ్యమునకు మిమ్మును సురక్షితముగా చేరుస్తాడు. దేవుడు మీ ప్రయాణమంతటిలో మీతో కూడా ఉంటాడు. కాబట్టి, ధైర్యము వహించండి, దేవునిలో ప్రోత్సహించబడండి. నేడు దేవుడు మీతో కూడా ఉన్నాడు, తన శాంతిని మీకిస్తాడు మరియు ఒడ్డుకు మిమ్మును చేరుస్తాడు. ఆయన అనుగ్రహించు శాంతి కొరకు మీరు వందనాలు చెల్లించుచూ, ఈ రోజు అంతయు అటువంటి శాంతిని పొందుకొని దీవించబడాలని ఆయనను అడుగుదామా? ఆలాగైతే, నేడే మీ జీవితాలను దేవుని హస్తాలకు సమర్పించుకున్నట్లయితే, ఆయన మీకు లోకమిచ్చునటువంటి శాంతికాకుండా, తన శాంతిని, పూర్ణశాంతిని మీకనుగ్రహించి, నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
సమాధానమునకు కర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రశస్తమైన ప్రభువా, కృతజ్ఞతతో నిండిన హృదయంతో మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము. దేవా, ప్రస్తుతం మా జీవితాన్ని మరియు మా హృదయాలను నీ యొక్క పూర్ణ శాంతితో నింపుచున్నందుకై నీకు వందనాలు. దేవా, ఈ లోకమిచ్చు శాంతి కాదు కానీ, నీవు ఇచ్చు పూర్ణశాంతి, మా హృదయాలలోనికి ఇప్పుడే ప్రవేశించునట్లుగా చేయుము. దేవా, మా పోరాటాల మధ్యలో కూడా, మేము నిన్ను నమ్ముకోవాలని ఎంచుకున్నాము. కనుకనే, నేడు మాకు నీ యొక్క దైవీకమైన జ్ఞానమును మరియు నీ భద్రతను, నడిపింపును మాకు దయచేయుము. దేవా, మా జీవితములో వస్తున్న వ్యతిరేకతలన్నిటిని ఎదుర్కొనే శక్తిని మాకు అనుగ్రహించుము. యేసయ్యా, మా అనారోగ్యము మధ్యలోను, శత్రువుల మధ్యలో, సవాళ్ల మధ్యలో, నీ శాంతిని మా యెడల కుమ్మరించుము, మా యొక్క ప్రతి అవసరతను నీవే తీర్చి, మా యొక్క గమ్యస్థానమునకు భద్రంగా చేర్చుము. ప్రభువా, ఈ రోజు మమ్మును నీ సురక్షితమైన కాపుదల క్రింద భద్రపరచుము. దేవా, ఈ రోజు మేము ఏమి చేయాలో మాకు తెలియజేయుము. ప్రభువా, మా ఉద్యోగములోను, పాఠశాలలోను, వివిధకరములైన పనులలో మేము ఉంటుండగా, నీ యొక్క దైవీకమైన జ్ఞానమును, భద్రతను మాకు అనుగ్రహించి, నీ సన్నిధి మాకు తోడుగా వచ్చునట్లు చేయుము. దేవా, నీవు మా కొరకు సిద్ధపరచిన గమ్యస్థానానికి మమ్మును సురక్షితంగా నడిపించుము. ప్రభువా, మేము ఈ రోజును గడుపుచున్నప్పుడు నీ శాంతి మా హృదయములను ఏలునట్లుగా చేయుము. ప్రభువా, నీవే మా ఆశ్రయం, మా బలం మరియు మా శాంతిగా ఉండి, అనునిత్యము మాకు తోడుగా ఉండి, మమ్మును ప్రశాంతమైన మార్గములో నడిపిస్తావని నమ్ముచూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.