నా ప్రియ స్నేహితులారా, నూతన మాసములో అడుగిడిన మీకు ముందుగా దేవుడు నడుస్తాడు. ఇంకను నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 31:8వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై యుండును, ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు. భయపడకుము విస్మయమొందకుమని ఇశ్రాయేలీయులందరి యెదుట అతనితో చెప్పెను'' ప్రకారం నేటి వచనములో యెహోషువ ఇశ్రాయేలీయులను కనానులో ఒక భాగమునకు తోడుకొని వెళ్లుచున్నట్లుగా మనము గమనించగలుగుతాము. ఇక్కడ యెహోషువ ఒక పెద్ద పాత్రను నిర్వర్తించవలసి యుండెను. అతడు మోషే యొక్క స్థానమును పరిపూర్ణము చేయవలసి వచ్చెను. ఇశ్రాయేలీయుల యొక్క బాధ్యతలను అతడు నిర్వహించవలసి వచ్చినది మరియు సర్వసమాజము యొక్క బాధ్యతలు అతని యొక్క భుజముల మీద మోపబడియున్నది. ఇటువంటి సందర్భమును గూర్చి మోషే అతనితో ఇలాగున చెబుతున్నాడు, 'యెహోషువ, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై యుండును, ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు. భయపడకుము విస్మయమొందకుమని ఇశ్రాయేలీయులందరి యెదుట అతనితో చెప్పెను.' ఈ మాటలు సంపూర్ణమైన ధైర్యముతోను, బలముతోను యెహోషువాను ముందుకు సాగివెళ్లునట్లుగా చేశాయి. ఈ సందేశమును చదువుచున్న మీకందరికి కూడ ఇట్టి ప్రశస్తమైన మాటలు మీ నిమిత్తమే ఉద్దేశించబడియున్నవి.

నా ప్రియులారా, ఒకవేళ నేడు మీరు నూతనమైన ఒక వ్యాపారమును ఆరంభించియున్నారేమో? లేక మీ తండ్రిగారు చేసిన వ్యాపారమును ఇక మీదట మీరు చేపట్టబోవుచున్నారేమో? లేక నూతనంగా వివాహ జీవితాన్ని మీరు ప్రారంభించుచున్నారేమో? ఏది ఏమై ఉన్నప్పటికిని కూడా ప్రభువైన దేవుడు మీకు ముందుగా వెళ్లుచున్నాడనియు, నా ప్రియ స్నేహితులారా, నేడు ఆయన మీతో కూడా ఉంటాడనియు మీరు జ్ఞాపకముంచుకొనండి.

మా తండ్రిగారైన డాక్టర్. డి.జి.యస్ దినకరన్‌గారు ప్రభువు చెంతకు వెళ్లిపోయిన తర్వాత, 2008వ సంవత్సరములో అది మాకు ఎంతగానో బాధగా అనిపించినది. ప్రత్యేకంగా నా యొక్క భర్తగారికి భారమంతయు తన యొక్క భుజముల మీదికి వచ్చినట్లుగా అనిపించినది. రాత్రివేళలలో ఆయన నిద్రపోయేవారు కాదు. వారు ప్రార్థించి, దేవుని చిత్తమును తెలియజేయవలసిన ఉత్తరములు అనేకములు పేర్చబడి, ఇంకను కూడా మిగిలిపోయాయి. దేవుని చిత్తమును ఎరిగి, వారికి నిర్ణయాలు తెలియజేయవలసిన వరము ఆయనకు లేకపోవుట చేత, దాదాపు 23 రోజుల వరకు ఆయన కనీసం సరిగ్గా నిద్ర కూడా పోలేకపోయారు. ఆ యొక్క పైల్స్ అన్నియు కూడా ఒకదాని వెంబడి ఒకటి పేరుకుపోయాయి. ఎంతో భారీ మొత్తంలో మిగిలిపోయాయి. ఆయన ఒక ఉత్తరమును తీసుకొనివచ్చి, నాకిచ్చి, దాని నిమిత్తము ప్రార్థన చేయమని నన్ను అడిగారు. అయితే, నేను కూడా ఆయనకు ఏ మాత్రము సహాయము చేయలేకపోయాను. 23 రోజుల తర్వాత, ఒక రోజున ప్రభువు, నా భర్తగారితో ఆకస్మాత్తుగా మాట్లాడారు. ప్రార్థనా విన్నపములన్నిటికి కూడా ఆయన జవాబును కనుగొనియున్నారు. మా సిబ్బందిలో ఒకరిని పిలిచి, వాటన్నిటికిని జవాబులు ఈ రీతిగా వ్రాయమని తెలియజేశారు. ఒక్కరోజులోనే ఆ ఉత్తరములన్నియు పూర్తి చేసి, వాటన్నిటికిని కూడా జవాబులను పంపించియున్నారు. ఒక్కరోజులోనే, ఆ ఉత్తరములన్నిటికిని, జవాబులను నిర్దేశించి చెప్పగలిగారు. పేరుకుపోయి ఉన్న ఉత్తరములన్నిటికిని జవాబులు పంపించబడినవి. అంతమాత్రమేకాదు, ఆ రోజు యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో, 'నూతన యుగం' కొరకైన దర్శనమును దేవుడు నా భర్తకు చూపించాడు. దేవుడు నా భర్తగారికి ప్రత్యక్షతలను అనుగ్రహించియున్నాడు. ప్రాజెక్టుల వెంబడి ప్రాజెక్టులను దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు అని బయలుపరచియున్నాడు. ఒక్క సంవత్సరములోనే, దేవుడు వారికి చెప్పిన ప్రతి కార్యములన్నిటిని ఆయన సంపూర్తి చేశాడు. దేవునికే మహిమ కలుగును గాక.

అవును, నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు ఏ మాత్రము విస్మయమొందకండి, భవిష్యత్తును గురించి భయపడకండి. ప్రభువు మీకు ముందుగా వెళ్లువాడై యున్నాడు, ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఆయన ఏమాత్రము మిమ్మును ఓడిపోనివ్వడు. ఆయన మిమ్మును ఎన్నడు కూడా విడువడు, ఎడబాయడు. ఆయన మీకు దర్శనములను అనుగ్రహిస్తాడు. ఆయన మీరు చేయుచున్న సమస్తమును మీరు సంపూర్తి చేయునట్లుగాను మీ పట్ల గొప్ప కార్యములను జరిగిస్తాడు. మీరు చేయు ప్రతి కార్యములలో కూడా ఆయన మీతో కూడా ఉంటాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మహా ఘనుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, మాకు ముందుగా వెళ్లి, మాకు ముందున్న మార్గాన్ని వెలిగించుము. దేవా, మా దృఢమైన మార్గదర్శి మరియు ఏ మాత్రము ఓటమి పాలు చేయకుండా సహాయము చేయు సహాయకుడు. ప్రభువా, దయచేసి మా భయాలను విడిచిపెట్టి, మా భవిష్యత్తును పూర్తిగా నీ ప్రేమగల చేతులకు అప్పగించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా ప్రత్యేకించి సవాళ్లు మమ్మును బాధపెట్టుచున్నప్పుడు, మేము నీ యొక్క స్థిరమైన సన్నిధిని ప్రతిరోజు మాకు గుర్తుచేయుము. ప్రభువా, మా విశ్వాసాన్ని బలపరచి, మాలో ధైర్యాన్ని నింపుము, తద్వారా నీవు మమ్మును ఏమాత్రము విడువకుండా, ఎడబాయకుండా లేక ఎటువంటి సమయంలోనైనా మమ్మును విడిచిపెట్టవనే విశ్వాసాన్ని మేము కలిగి ఉండునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, మా జీవితం పట్ల నీ దర్శనమును బయలుపరచి మరియు నీవు మమ్మును చేయమని పిలిచినవన్నిటిని మేము సాధించడానికి మమ్మును నడిపించుము. దేవా, నీ పరిపూర్ణ శాంతితో మా హృదయాన్ని నింపుము మరియు మా జీవితంలో ప్రతి వాగ్దానాన్ని నీవు నెరవేరుస్తావని నమ్మడానికి మాకు సహాయము చేయుమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.