నా ప్రశస్తమైన స్నేహితులారా, ఈ రోజు మీతో మాట్లాడడము నాకెంతో సంతోముగా ఉన్నది. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 8:47వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులుకారు గనుకనే మీరు వినరని చెప్పెను.'' యేసుక్రీస్తు ప్రజలకు బోధించుచున్నప్పుడు పలికిన మాటలివి. యేసు క్రీస్తు, ప్రజలకు బోధించుచున్నప్పుడు పరిసయ్యులు కూడా ఆయన మాటలను ఆలకించారు. మరియు ఆయన చెప్పిన మాటలన్నిటికిని, ఏదో ఒక ప్రశ్న అడగాలని, వారు ఆయన మాటలను ఆలకించుచుండెను. యేసుక్రీస్తు చెప్పుచున్న మాటలను అర్థము చేసుకొని నమ్మడము కొరకు వారు వినేవారు కాదు. " నీవు తండ్రికి సంబంధించినవాడవు కాదు కనుకనే, నీవు చెప్పేది నిజము కాదు అని వారు చెప్పేవారు.'' యేసుక్రీస్తు చెబుతున్న మాటలు వారు వినుటకు ఇష్టము లేదు కనుకనే, వారు ఆయన మాటలు వినేవారు కాదు. యేసయ్య, చెబుతున్న మాటలను వారు అర్థము చేసుకునేవారు కాదు. ఇంకను నమ్మేవారు కూడా కాదు. అదేవిధముగా, మన జీవితములో మనకు ఇష్టము లేని మాటలు ఎవరైన చెబితే కనుక, మన మనస్సులో మనము ఏదో ఒకటి అనుకుంటాము. దానికి వ్యతిరేకముగా ఎవరైనా, ఏదైనా చెబితే మనము ఆ మాటలను అంగీకరించడానికి అస్సలు ఇష్టపడము. వారు మన మంచి కొరకు చెప్పినప్పటికిని, మనకు ఇష్టము లేదు కాబట్టి, ఆ మాటలను మనము పట్టించుకోము, ఇంకను ఆ మాటలను అంగీకరించము.

అదేవిధముగా, నా ప్రియులారా, కొన్నిసార్లు మనము దేవుని పట్ల కూడా ఆలాగుననే ప్రవర్తిస్తాము. ఆయన ఆజ్ఞలను పాటించాలని దేవుడు అడుగుతాడు. ఆయన చిత్తమును చేయాలని ఆయన మన పట్ల కోరుతాడు. అది పాటించడం మనకు ఎంతో కష్టతరమై ఉండవచ్చును. ఆయనకు విధేయత చూపించడము మరియు ఆయనను వెంబడించడము, అది మనము చేయవలసిన నూతన ఉద్యోగము కావచ్చును, లేక నూతన స్థలమునకు వెళ్లవలసి వస్తుండవచ్చును. ఇంకను లోకాశలన్నియు విడిచిపెట్టడము కావచ్చును, ఇప్పుడు మనము సుఖముగా ఉన్నాము. కాబట్టి, అది చేయడము చాలా కష్టతరముగా ఉండవచ్చును. కాబట్టి, దేవుని స్వరమును వినడానికి ఇష్టపడము. అందువలన ప్రార్థించడము మరియు ఆయన ఆజ్ఞలను పాటించడము మానేస్తాము. దేవుడు లేనటువంటి జీవితమును మనము జీవిస్తాము. కానీ, నా ప్రియ స్నేహితులారా, ద్వితీయోపదేశకాండము 30:16వ వచనమును మనము చూచినట్లయితే, "నీవు బ్రదికి విస్తరించునట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకాజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును'' ప్రకారం మీరు దేవుని ఆజ్ఞలకు విధేయులవ్వండి. నిశ్చయముగా, మీరు దేవునికి సంబంధించినవారుగా ఉంటారు.

నా ప్రియ స్నేహితులారా, ఇంకను దేవుని ప్రేమించుచూ, ఆయన మార్గముల యందు నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞల యందు విధేయత చూపాలని నిర్ణయము తీసుకొనండి. అప్పుడు ఆయన సరియైన మార్గములో మిమ్మును నడిపిస్తూ, దీవించి, మిమ్మును ఆశీర్వదిస్తాడు. నా స్నేహితులారా, దేవుని మాటలను విని, విడిచిపెట్టే పరిసయ్యులవలె మనము ఉండకూడదు. మనము దేవుని సంబంధులుగా ఉండాలంటే, మనము ఆయన మాటలను వింటూ, ఆయనకు లోబడి జీవించాలి. ఆయన ఆజ్ఞలను మనము పాటించడానికి ఎంత కష్టతరముగా ఉన్నప్పటికిని, ఆయన ఆజ్ఞలను, ఆయన చిత్తాన్ని అనుసరించుచున్నప్పుడు, మన చిత్తమును వదిలిపెట్టివేసి, అప్పుడు సమృద్ధితో కూడిన, మంచి ప్రణాళికలతో కూడిన జీవితమును ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అది మన మేలు కొరకు అంతా జరుగుతుంది. అవును, నా ప్రియులారా, ఈ రోజు మనము ఈ నిర్ణయమును తీసుకుందాము. అవు ను, 'ప్రభువా, నేను నీ సంబంధికులముగా ఉండాలి, నీ వాక్యమును వినాలి, నీ చిత్తమును జరిగించాలి' అని చెప్పినప్పుడు, నిశ్చయముగా, దేవుడు మిమ్మును మంచి మార్గములో నడిపించి, మిమ్మును ఘనపరుస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కనికరము గలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ రోజు ధ్యానించినట్లుగానే, మమ్మును మేము నీ చిత్తానికి సమర్పించుకొనుచున్నాము. ప్రియమైన ప్రభువా, మేము నీ స్వరాన్ని వినాలని కోరుతూ విధేయతగల హృదయంతో నీ స్వరాన్ని వినడానికి మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. అది సులభం కానప్పటికిని, అన్ని పరిస్థితులలోనూ మేము నీకు విధేయతతో నీ స్వరాన్ని వినడానికి మాకు సహాయం చేయుము. బైబిల్ గ్రంథమును చదువుచుండగా, ఈ రోజు మేము ఏమి చేయాలో మాతో మాట్లాడుము మరియు మా కుటుంబము కొరకు మరియు మా ఉద్యోగములో ఏమి చేయాలో, మేము ఏమి చదువుకోవాలో, మా జీవితములో మేము ఎలా జీవించాలో మాకు నేర్పించుము. దేవా, మేము తీసుకొని ప్రతి నిర్ణయములో కూడా మేము నిన్ను ఘనపరచుటకు కృపను దయచేయుము. ప్రభువా, నీ స్వరమును వింటూ, నీ చిత్తమును జరిగిస్తూ, నీ ఆజ్ఞలను పాటించడానికి మాకు సహాయము చేయుము. దేవా, మా ఇష్టాన్ని పూర్తిగా నీ చేతులకు అప్పగించడానికి మరియు మా జీవితానికి నీ పరిపూర్ణ ప్రణాళికలను విశ్వసించడానికి మాకు బలమును అనుగ్రహించుము. ప్రభువా, నీ మార్గం కష్టంగా అనిపించినప్పుడు, నీ మార్గాలు ఎల్లప్పుడూ మా మేలు కొరకు అని మాకు గుర్తు చేయుము. ప్రభువా, మమ్మును దీవించి, నడిపించుము. మేము ఈ రోజు తీసుకొనన్న ఈ తీర్మాణమును ఘనపరచి, దీవించి, అభివృద్ధి పొందునట్లుగా చేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.