నా అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 14:13వ వచనము మనకు ఇవ్వబడినది. ఆ వచనము, ‘‘మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును’’ అని యేసు ప్రభువు మన పట్ల వాగ్దానము చేయుచున్నాడు. ఇంకను బైబిల్‌లో, న్యాయాధిపతులు 13:18వ వచనములో మనము చూచినట్లయితే, సమ్సోను తండ్రి దేవుని దూత యొద్ద వేచి యుండెను. ‘‘మానోహ నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించునట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత నీ వేల నాపేరు అడుగుచున్నావు? అది చెప్పశక్యముకాని దనెను’’ ప్రకారం అతడు దేవుని దూత కాదు కానీ, స్వయంగా దేవుడే. ఒక దేవదూత రూపములో ఆ మనుష్యునితో మాట్లాడి అతనిని ప్రోత్సహించాడు.
అదేవిధముగా, నా ప్రియులారా, మోషేతో మాట్లాడాడు. బైబిల్‌లో నిర్గమకాండము 6:3వ వచనములో చూచినట్లయితే, ‘‘నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు’’ ప్రకారం అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు మరియు మోషేకు ప్రభువు సర్వశక్తిగల దేవునిగా తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన సర్వశక్తుడైన దేవుడు. కనుకనే, మీరు దేవుని సన్నిధానముతో నింపబడినప్పుడు, మీరు ఆయనను వ్యక్తిగతంగా చూడగలుగుతారు. అదేవిధముగా, దేవుని సన్నిధితో మీరు నింపబడెదరు. అనేకసార్లు, నా స్వంత జీవితములో చూచినట్లయితే, నా జీవితములో నిరాశ, నిస్పహలో మరియు నిరీక్షణ లేకుండా ఉన్నప్పుడు, దేవుని సన్నిధానమును నేను చూశాను. ఆయన దేవదూత వలె నాకు ప్రత్యక్షమైన ఎల్లవేళల నేను ఉన్నాను అని ప్రభువు నన్ను ప్రోత్సహించాడు. దేవునికే మహిమ కలుగును గాక.
అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు ఎల్లవేళల మీతో కూడా ఉన్నాడు. బైబిల్‌లో కీర్తనలు 8:1వ వచనములో దావీదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ‘‘యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచు వాడా, భూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది ’’ ప్రకారము, దేవుని నామము ఎంతో ప్రభావముగలదిగా ఉన్నది. ఆలాగుననే, బైబిల్‌లో సామెతలు 18:10వ వచనములో చూచినట్లయితే, ‘‘యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును’’ ప్రకారము, భద్రత లేని ఈ లోకములో మనము సురక్షితముగా ఉండాలంటే, మనము ఆయన నామమును ధరించుకోవాలి. గత 86 సంవత్సరములుగా ప్రభువు ఎల్లవేళల నాతో కూడా ఉంటూ, ఆయన తన సన్నిధిని నాకు తోడుగా ఉంచి, నన్ను బలపరస్తూ వచ్చియున్నాడు. అందుకే ప్రభువునందు నేను సంతోషిస్తున్నాను. ఇంతవరకు ప్రభువులో నేను ఆనందించుచున్నాను. ఆయన దీవెనలన్నియు నేను పొందుకొని ఉన్నాను. నేడు ప్రియులారా, మీరు కూడా సమద్ధిగా ఆశీర్వదించబడతారు. మీరు మనుష్యుల వైపు చూడకండి, ప్రభువును హత్తుకొని ఉండండి, ఇప్పుడే, ఆయనను గట్టిగా హత్తుకుందామా? ఆలాగున చేసినట్లయితే, నిశ్చయముగా దేవుడు మిమ్మును నేటి వాగ్దానము ద్వారా మిమ్మును ఆశీర్వదిస్తాడు.
ప్రార్థన:
అమూల్యమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియ ప్రభువా, నీ నామంలో మేము ఏది అడిగనను నీవు దానిన చేస్తావని నీవు మా పట్ల ఇచ్చిన వాగ్దానానికై నీకు కతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, నీ నామం ఆశ్చర్యకరుడు అని చెప్పబడినట్లుగానే, నీ యొక్క శక్తి మరియు మహిమతో మేము నింపబడునట్లుగా చేయుము. తండ్రీ, నీవే మా దేవుడవు, మా నిరీక్షణ, నీ బిడ్డలైన మేము నీ యందు నమ్మకముంచునట్లుగాను నీవు మాతో మాట్లాడుము. ప్రభువా, మేము నీ యొద్దకు ఆకర్షింపబడునట్లుగా మాకు అటువంటి గొప్ప ధన్యతను దయచేయుము. దేవా, మేము నిన్ను వ్యక్తిగతంగా చూచునట్లుగా మాకు నీ కపను దయచేయుము. ప్రభువా, మేము నిన్ను చూచి, నీ యొద్ద ఉన్న దీవెనలను పొందుకొనునట్లుగా మాకు సహాయము దయచేయుము. దేవా, నీవు సమ్సోను తండ్రికి, మోషేకు నీను ఏలాగు వ్యక్తిగతంగా ప్రత్యక్షపరచుకున్నావో, అలాగే నీవు మాకు కూడా ప్రత్యక్షమగునట్లుగా సహాయము చేయుము. దేవా, నీ పరిశుద్ధ సన్నిధితో మమ్మును నింపుము. ప్రభువా, నీ సన్నిధిని ప్రత్యక్షంగా అనుభవించుటకు మాకు అవకాశం కలుగజేయుము. దేవా, నీవే మాకు బలమైన కోటగాను, రక్షణ మరియు బలముగా ఉన్న నిన్ను ఆశ్రయించునట్లుగా మాకు కపను అనుగ్రహించుము. ప్రభువా, మేము మనుష్యుల మీద ఆధారపడకుండా నిన్ను ఆశ్రయించాలని మాకు బోధించుము. దేవా, మా జీవితములో నీ నామము మహిమపరచబడునట్లుగా సహాయము చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.