నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున మీకందరికి శుభములను తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మార్కు సువార్త 9:23వ వచనమును మనము ధ్యానించబోవుచుచున్నాము. ఆ వచనము, ఆనారోగ్యముతో ఉన్న కుమారుని తీసుకొని వచ్చిన తండ్రితో, యేసయ్యా, ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు, "...నమ్ముట నీ వలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే'' అని అతనితో చెప్పెను.

అవును, నా ప్రియులారా, దేవుని వాక్యము ఈలాగున అంటున్నది, "నీవు నమ్మినట్లయితే, దేవుని మహిమను చూచెదరు''అని చెప్పినట్లుగానే, మీరు నమ్మండి, నిశ్చయముగా దేవుని మహిమను చూస్తారు. ఇంకను 1 యోహాను 5:4లో చూచినట్లయితే, "దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే'' ప్రకారం లోకమును జయించిన విజయము మన విశ్వాసము. కాబట్టి, మనము విశ్వాసముతో పొందుకుంటున్న వాటన్నిటి కొరకై ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించాలి. కొలొస్సయులకు 2:7 ప్రకారము, " మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకొనుడి'' ప్రకారం మీరు విశ్వాసమందు స్థిరపరచబడాలి. కాబట్టి, ప్రియ స్నేహితులారా, ప్రార్థించినప్పుడు, మీ విశ్వాసమును బట్టి, ప్రభువు అనుగ్రహిస్తాడన్న విషయాన్ని తెలుసుకొని గుర్తించుకోవాలి. అంతమాత్రమే కాదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ, మనము ప్రార్థించాలి. అప్పుడు అవి నెరవేరుతాయి. మొదటిగా మనము విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసముతో ప్రభువును అడగాలి. దానితో కూడా, 'యేసయ్యా, నీవు మాకు సమస్తమును అనుగ్రహించినందుకై నీకు వందనాలు'అని చెప్పాలి. అదే విశ్వాసమై ఉంటున్నది.

నా ప్రియులారా, నేడు మీరు దేవుని కృతజ్ఞతలు చెల్లించినప్పుడు, ప్రభువు సన్నిధితో నింపబడతారు. అంతమాత్రమే కాదు, 1 థెస్సలొనీకయులకు 5:18 ప్రకారం, "ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. '' దావీదు యొక్క జీవితమును చూడండి, కీర్తనలు 34:1వ వచనము ప్రకారం, "నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.'' అవును, దావీదు వలె మీరు కూడా దేవుని ఎల్లప్పుడు స్తుతిస్తూ ఉండండి. ఆయనను ఎంతగా స్తుతిస్తారో అంతగా ఆయన సన్నిధానమును అనుభవిస్తారు. ఇంకను 1 సమూయేలు 30:6,17వ వచనములలో చూచినట్లయితే, 'దావీదు మిక్కిలి దుఃఖపడెను' అని వ్రాయబడియున్నది. కానీ, అటువంటి సమయములో కూడా దావీదు, దేవుడు అద్భుతము చేస్తాడు అన్న విశ్వాసముతో దేవుని స్తుతించాడు. అదే అధ్యాయములో 19వ వచనములో చదివినట్లయితే, దావీదు కోల్పోయిన వాటన్నిటిని తిరిగి పొందుకొనెను అని వ్రాయబడియున్నది.

నా ప్రియ స్నేహితులారా, ఆలాగుననే, మీరు కూడా మీ జీవితములో అనేక దీవెనలను పోగొట్టుకున్నారని చింతించుచున్నారేమో? మీ హృదయాన్ని కలవరపడనీయకండి, మీరు మీ హృదయాంతరంగము నుండి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు,ప్రభువు వాటన్నిటిని మీకు అనుగ్రహించబోవుచున్నాడు. కనుకనే, ప్రార్థించి, మీకు అవసరమైన ఆశీర్వాదాలన్నిటిని ఇప్పుడే పొందుకుందామా? మీరు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించినప్పుడు, ఆయన మీ అవసరాలన్నింటినీ రెట్టింపుగా తీరుస్తాడు. ఆయన నుండి గొప్ప విషయాలను ఎదురు చూడండి!

ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నీ వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీ అద్భుత సన్నిధానమునకై నీకు వందనాలు. ప్రభువా, మా జీవితాలను నీవు ఎరిగి యున్నావు. మేము అనేకవిధాలుగా లేమిని కలిగియుంటూ, నీ సన్నిధికి వచ్చియున్నాము. 'విశ్వాసం లేకుండా, నీకు ఇష్టుడై ఉండుట అసాధ్యమని' మాకు తెలుసు, కాబట్టి దయచేసి నిన్ను ఎక్కువగా విశ్వసించడానికి, నిన్ను ఎక్కువగా ప్రేమించడానికి మరియు నీ మార్గాలను అనుసరించడానికి మమ్మును మేము ఎక్కువగా అంగీకరించడానికి మా హృదయాన్ని ప్రేరేపించుము. ప్రభువా, ఈ లోకపు ఒత్తిళ్లకు చెదిరిపోకుండా, నీ మీద మా దృష్టిని నిలుపుటకు మాకు సహాయం చేయుము. దేవా, నీకు అసాధ్యమైనది ఏదీయు లేదు. కనుకనే, మా చుట్టూ ఉన్న ఇతరులకు నీ శక్తిమంతమైన కార్యాలను గురించి చెప్పగలిగేలా నీవు నీ శక్తిమంతమైన హస్తాన్ని చాచి మమ్మును అద్భుతంగా విడిపించమని కోరుచున్నాము. ప్రభువా, మేము నీవిచ్చు విడుదలను చూచు వరకు మాలో ఉన్న ఆవగింజంత విశ్వాసం దినదినము అభివృద్ధి పొందునట్లు చేయుము. దేవా, నిన్ను విశ్వసించే ఎవరినీ నీవు ఎన్నటికీ నిరాశపరచవని మాకు తెలుసు, ఎందుకంటే నీవు విశ్వాసమునకు కర్తవు గనుకనే, ప్రభువా, మా ప్రార్థన విని జవాబును దయచేయుము. దేవా, మేము నిన్ను పరిపూర్ణంగా నమ్మునట్లుగాను, నీ మహిమను చూచునట్లుగా మాకు అటువంటి గొప్ప ధన్యతను దయచేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.