నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 29:11వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో ప్రభువు, "నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.'' అవును, దేవుడు ఎల్లవేళల మనము ఆశీర్వదింపబడు నిమిత్తము ప్రణాళికలను కలిగియున్నాడు. దేవుని యొక్క ప్రణాళికలు, మన యొక్క మేలు కొరకు అత్యంత జాగ్రత్తగా రూపింపబడియున్నవి. ఇంకను యెషయా 28:29వ వచనములో బైబిలేమని చెబుతుందో చూడండి, "జనులు సైన్యములకధిపతియగు యెహోవాచేత దాని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచనశక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే'' అన్న వచనము ప్రకారము దేవుడు సంకల్పించు ప్రణాళికలన్నియు కూడా అత్యంత జ్ఞాన యుక్తము గలవి. అవి ఎల్లప్పుడు విజయమును సాధించునవిగా ఉంటాయి. మానవులైతే, అనేకమైన ప్రణాళికలను సంసిద్ధము చేస్తారు. కానీ, చివరికి దేవుని యొక్క ఉద్దేశము మాత్రమే వర్థిల్లుతుంది.
ఆలాగుననే, దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్న దావీదు జీవితములో అద్భుతముగా ప్రణాళికలను సంసిద్ధము చేశాడు. రాజైన దావీదు నిమిత్తము దేవుడు ఒక చక్కటి ప్రణాళికలను సిద్ధము చేసినప్పుడు, ప్రజలు దావీదునకు విరుద్ధముగా లేచారు. పురుషులును మరియు స్త్రీలు అతని మీద అసూయ చెందారు. వారు అతనికి విరుద్ధముగా దుష్ట ప్రణాళికలను పన్నారు. అందుచేతనే, కీర్తనలు 140:1,2వ వచనములలో దావీదు దేవునికి ఈలాగున మొఱ్ఱపెట్టాడు, "యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము బలాత్కారము చేయువారి చేతిలో పడకుండ నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు వారు నిత్యము యుద్ధము రేప జూచుచుందురు'' అని చెప్పుచున్నాడు మరియు దాని తదుపరి వచనముగా కీర్తనలు 140:3లో చూచినట్లయితే, "పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది'' అని అంటున్నాడు. కనుకనే, కీర్తనలు 140:4వ వచనములో చూచినట్లయితే, "యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండ నన్ను కాపాడుము. బలాత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు.'' అతడు ప్రభువా, నన్ను క్షేమముగా భద్రపరచుము మరియు ఇంకను అతడు దుష్ట ప్రజల చేతిలో పడకుండా, నన్ను భద్రపరచుము అని ప్రార్థించాడు. స్నేహితులారా, దేవుడు ఎంతో మంచి దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రణాళికలు ఎల్లవేళల మేలుకరముగానే యున్నవి. పురుషులు మరియు స్త్రీల యొక్క తలంపుల ఎంతో చెడుగా ఉన్నట్లుగా మనము చూచుచున్నాము. అందుచేతనే, దేవుడు తెలియజేయుచున్నాడు, 'నా తలంపులు హానికరమైనవి కావు, అవి మీ కొరకు మేలుకరమైన తలంపులుగా ఉన్నవి' అని అంటున్నాడు. మనము కష్టముల గుండా వెళ్లుచున్నప్పుడు, దేవుని యొక్క ప్రణాళికలకు సంబంధించిన వివరములను అర్థము చేసుకోలేకపోతాము. అంతమాత్రమే కాదు, మనము మొఱ్ఱపెడుతుంటాము, విలపిస్తుంటాము. భవిష్యత్తు ఏమిటో మనకు తెలియకుండా కొన్ని ఫర్యాయములు దేవుని మీద నిందవేస్తుంటాము. అయినను దేవుని ప్రణాళిక ఎల్లప్పుడు మేలుకరమైనది. దేవుడు మన మేలు కొరకు సమస్తమును కూడా జ్ఞానయుక్తముగా ప్రణాళిక చేయుచున్నాడు. ఒకవేళ, నేడు మీ యొక్క అడుగులు చెల్లాచెదురుగాను, గందరగోళంగాను ఉన్నట్లుగా మీకు అనిపించినప్పటికిని కూడా దేవుడు వాటిని వినియోగించుకొని, సరైన మార్గములోనికి మిమ్మును నడిపిస్తున్నాడని గుర్తించి మీరు దేవుని యందు నిరీక్షణ ఉంచినప్పుడు, నిశ్చయముగా దేవుని ప్రణాళికలు మీ జీవితములో చక్కగా నెరవేర్చబడతాయి.
ఇందుకు ఒక ఉదాహరణగా, మా కుమార్తె షారోన్ తన విశ్వవిద్యాలయంలో ప్రవేశము పొందినప్పుడు, అత్యంత పెద్ద ఒక గోడ మీద ఇటువంటి పదము అక్కడ వ్రాయబడి ఉండుట ఆమె గమనించియుండెను. అదేమనగా, "నేను నీ కొరకు మంచి ఉద్దేశములను కలిగియున్నాను. అవి నీకు హానికరమైనవి కావు, అవి నీకు మేలు కొరకు మాత్రమే, ఇంకను నీకు భవిష్యత్తును, నిరీక్షణను ఇవ్వడానికే నేను ఇక్కడ నీ కొరకు ఉన్నాను'' అని ఉండెను. ఆ మాటలను చూచిన షారోన్ తాను ఎంతగానో ప్రోత్సహించబడెను. ప్రభువు నన్ను గురించి కూడా తలంచుచున్నాడు అని ఆమె గుర్తించెను.
చూడండి, నా ప్రియ స్నేహితులారా, అనేక ఫర్యాయములు ప్రజలు మన తలల మీద ఎక్కి స్వారీ చేయుచున్నట్లుగాను, ఎక్కి త్రొక్కుచుండవచ్చును. దేవుడు అగ్నిలో బడి వెళ్లునట్లుగాను, జలములలో బడి వెళ్లునట్లుగాను మనకు అనుమతిని ఇచ్చి ఉండవచ్చును. అయినప్పటికిని, కీర్తనలు 66:12వ వచనములో మనము చూచినట్లయితే, "నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి అయినను నీవు సమృద్ధిగల చోటికి మమ్ము రప్పించి యున్నావు'' అని చెప్పబడినట్లుగానే, ఈ రోజున మీరు ఏమి లేకుండా దీన స్థితిలోను మరియు ఎవరు లేకుండా ఒంటరిగా ఉండవచ్చును. అయినప్పటికిని ప్రియ స్నేహితులారా, దేవుడు మీ కొరకు ఒక చక్కటి భవిష్యత్తును కలిగి ఉన్నాడు. నిశ్చయముగా, మీరు మీ భవిష్యత్తులో నిరీక్షణ కలిగినవారై యున్నారు. కనుకనే, మీ నిరీక్షణ మరియు మీ ఆశ ఎన్నటికిని భంగము కానేరదు. కాబట్టి, ధైర్యము తెచ్చుకొనండి. ప్రభువు ఎల్లవేళల, మిమ్మును తన మనస్సునందు తలంచుచున్నాడని మరువకండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మహిమ గల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మా జీవితాలను ఆశీర్వదించుట కొరకు ఇంత చక్కటి భవిష్యత్తును మాకిచ్చినందుకై నీకు వందనాలు. దేవా, నీ వాక్యమును మేము హత్తుకొని జీవించునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మా చేతులను గట్టిగా పట్టుకొని, అత్యంత సమృద్ధిగల చోటికి మమ్మును నడిపించుము. ప్రభువా, నీ యొక్క అధిక సృమద్ధిలో నుండి ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదము వచ్చునట్లుగా మాకు కృపను దయచేయుము. దేవా, నీ ఆశీర్వాదములను మా తలల మీదికి వచ్చునట్లుగాను మరియు మా జీవితం పట్ల నీవు కలిగి ఉన్న అద్భుతమైన ప్రణాళికలకు, మాకు హానికరమైనవి కాకుండా మాకు మేలుకరమైనవిగా ఉండునట్లు నీవు ఉద్దేశమును కలిగియున్నందుకై నీకు వందనాలు. దేవా, నీవు జ్ఞానవంతుడవైన దేవుడవు, గనుకనే, నీవు కలిగియున్న ప్రతి ప్రణాళిక పరిపూర్ణమైనది మరియు నిశ్చయంగా అవి మా జీవితంలో విజయం సాధించునట్లు చేయుము. ప్రభువా, ఇతరులు మా మీదికి లేచినప్పుడు, నీవు మాకు ఆశ్రయంగా ఉండి, దుష్టుల చేతుల నుండి మమ్మును భద్రంగా కాపాడుము. దేవా, సంశయించు సమయాలలో, నీవు మా అడుగులు సరైన మార్గంలో నడిపిస్తున్నావని గ్రహించడానికి మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, మేము మంచి భవిష్యత్తును చూడలేనప్పుడు కూడా, నీవు మా పట్ల మేలుకరమైన ఉద్దేశములను కలిగియున్నావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మమ్మును అగ్ని మరియు నీళ్ల ద్వారా నడిపించి, మమ్మును సమృద్ధిగలచోటికి తీసుకొని వెళ్లతావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మేము ఈ రోజు ఎక్కడ ఉన్నా, నీవు మా కొరకు చక్కటి భవిష్యత్తును సిద్ధపరచావని గుర్తించి, మేము ఆనందించునట్లుగా చేయుము. దేవా, నీవు ఎల్లప్పుడు మమ్మును తలంచుచున్నావనియు మరియు నీ ప్రణాళికలు ఎన్నటికిని మా పట్ల విఫలము కాకుండా చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.