నా అమ్యూలమైన స్నేహితులారా, దేవుని వాక్యం 1 కొరింథీయులకు 6:19వ వచనము మనకు గుర్తుచేయుచున్నది, "మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు'' అని చెప్పబడినట్లుగానే, పరిశుద్ధాత్మ యొక్క రూపాంతరపరచే శక్తిని విశ్వసించాలని మరియు జీవముగల దేవుని ఆలయంగా జీవించుటకు మనము పిలువబడియున్నాము. పరిశుద్ధాత్మ మనలో నివసించడమే కాదు, జీవిత సవాళ్లను అధిగమించి పరిశుద్ధతలో నడవడానికి దైవీకమైన శక్తిని కూడా మనకు అనుగ్రహించబడుతుంది.
అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి లూకా 1:35వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "...పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును'' అని దేవుని దూత యేసుక్రీస్తు తల్లియైన మరియకు బయలుపరచెను. అదేవిధంగా, పరిశుద్ధాత్మ కూడా మనలను శక్తితో లేదా మానవ బలంతో కాకుండా తన దైవీకమైన సన్నిధి ద్వారా శక్తివంతం చేస్తాడు. అందుకే జెకర్యా 4:6వ వచనములో చూచినట్లయితే, "అప్పుడతడు నాతో ఇట్లనెను జెరుబ్బాబెలు నకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేతనైనను బలముచేతనైననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను.'' అవును, నేడు మీరు మీరు బలహీనంగా లేదా జీవితంతో భారంగా భావించినప్పటికిని, దేనికిని మీరు భయపడకండి! పాపం, భయం మరియు చీకటి నుండి మిమ్మును విడిపించడానికి పరిశుద్ధాత్మ శక్తి మీ మీదికి దిగివస్తుంది. ఇంకను లూకా 4:18వ వచనమును మనము చదివినట్లయితే, " ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు'' అని యేసు పలికెను. అవును, పరిశుద్ధాత్మ మన పాపముల నుండి విడిపిస్తుంది మరియు బంధకాలను బ్రద్ధలు చేస్తుంది మరియు యేసు యొక్క సంపూర్ణతతో మనలను నింపుతుంది.
నా ప్రియులారా, ఈ రూపాంతరము ఎలాగున జరుగుతుంది? యేసు, తాను సిలువలో బలి అగుట ద్వారా, పాపం నుండి మనము పరిశుద్ధులముగా చేయబడటానికి మనకు మార్గం ఏర్పరచాడు. అందుకే 1 యోహాను 1:7వ వచనములో చూచినట్లయితే, "...అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును '' అని చెప్పబడినట్లుగానే, యేసుక్రీస్తు మన పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. కనుకనే, మనము పవిత్రులముగా జీవించాలంటే, మనము యేసు రక్తముతో కడగబడాలి మరియు పరిశుద్ధాత్మతో నింపబడాలి. కాబట్టి, ఇటువంటి పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలని మనం అడిగినప్పుడు, ఆయన తన ఆత్మతో మనలను నింపుతాడని లూకా 11:13వ వచనములో మనకు స్పష్టముగా తెలియజేయుచున్నదిలా, "పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను.'' అంతమాత్రమే కాదు, పరిశుద్ధాత్మ ద్వారా మన పాపముల నుండి మనము పశ్చాత్తాపం పొందునట్లు చేయుటకు మనలను నడిపిస్తాడు మరియు పరిశుద్ధాత్మ శక్తి చేత క్షమాపణను పొందునట్లు చేస్తాడు. పరిశుద్ధాత్మ మన దృష్టిని మనకు ఆధారముగా ఉన్న యేసు వైపునకు మరల్చుతుంది. "ఇందుచేత దేవుని ఆత్మవలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను (1 కొరింథీయులకు 12:3) మరియు రోమీయులకు 8:2లో చూచినట్లయితే, " క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను'' ప్రకారం యేసు రక్తం ద్వారా మనం పాపమరణం నుండి విడుదల పొందుకుంటాము. ఈ స్వాత్రంత్యం నూతన జీవితాన్ని, నూతన ఆలోచనలను మరియు నూతన భాషను యేసు మార్గాల్లో వేరుపారునట్లు చేస్తుంది. "నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు''(మార్కు 16:17). పరిశుద్ధాత్మ మనలను శుద్ధిచేయడమే కాకుండా శోధనలను అధిగమించడానికి మనలను బలపరుస్తుంది. ఈ లోక శోధనలు మనలను చుట్టుముట్టినప్పుడు, మనం సహాయం కొరకు పరిశుద్ధాత్మను ప్రార్థిస్తాము. ఇంకను 1 కొరింథీయులకు 14:4లో వివరించినట్లుగా, "భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివద్ధి కలుగజేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివద్ధి కలుగజేయును'' ప్రకారం భాషలలో మాట్లాడటం ద్వారా శత్రువును ఎదిరించడానికి మనకు శక్తినిస్తుంది మరియు అధికారమును అనుగ్రహిస్తుంది. ప్రతి విధమైన చీకటిపై విజయం సాధించేందుకు పరిశుద్ధాత్మ మనలను సన్నద్ధం చేస్తుంది మరియు దేవుని పిల్లలుగా స్థిరంగా నిలబడేలా చేస్తుంది.
అవును నా ప్రియులారా, నేడు, మరియ మరియు యేసు శిష్యులను నింపిన అదే పరిశుద్ధాత్మ మీకు అందుబాటులో ఉన్నది. కనుకనే, పాపం నుండి విడుదల పొందుకొని, పాపాన్ని జయించగలిగే అధికారాన్ని పొంది, క్రీస్తు యేసులో సమృద్ధి జీవంతో నింపబడి దేవుని పరిశుద్ధ ఆలయముగా ఆయన మిమ్మల్ని మార్చనివ్వండి. అందుకే 2 కొరింథీయులకు 3:17 ప్రకటించినట్లుగా, " ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాత్రంత్యము నుండును '' అన్న వచనము ప్రకారము ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ విడుదల ఉంటుంది. కనుకనే, నా స్నేహితులారా, మీ హృదయమును కలత చెందనీయ్యకండి; ఎందుకంటే, మీలో నివసించడానికి మరియు విజయం మరియు ఉద్దేశముతో కూడిన జీవితంలోనికి మిమ్మల్ని నడిపించమని పరిశుద్ధాత్మను మీలోనికి ఆహ్వానించినప్పుడు, పరిశుద్ధాత్మ మిమ్మును నింపుతుంది. అప్పుడు, మీ దేహము దేవునికి ఆలయముగాను, పరిశుద్ధంగా జీవించునట్లు చేస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు ఈ నూతన మాసమంతయు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా దేహమును నీ పరిశుద్ధాత్మకు ఆలయంగా చేసినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ ఆత్మతో మమ్ను నింపుము మరియు నీ దైవీకమైన శక్తితో మా జీవితాన్ని మార్చుము. యేసయ్యా, నీ రక్తం ద్వారా మమ్మును శుద్ధులనుగా చేసి, మా ప్రతి పాపం మరియు బానిసత్వం నుండి మమ్మును విడిపించుము. దేవా, ఈ లోకములో శోధనలను మేము అధిగమించి, నీ పవిత్రత యొక్క సంపూర్ణతతో జీవించడానికి దయచేసి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ ప్రియమైన బిడ్డగా నీవు అనుగ్రహించు విడుదలతోను మరియు ఆనందంలో నడవడానికి మాకు అధికారం దయచేయుము. పరిశుద్ధాత్మ దేవా, దయచేసి యేసును మహిమపరచడానికి మా ఆలోచనలు, మాటలు మరియు క్రియలను నీ యొక్క శక్తి చేత పరిశుద్ధంగా మార్చి, యేసు వైపు మమ్మును నడిపించుము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తిచేత మమ్మును నింపుము, మేము క్రొత్త భాషలు మాట్లాడి, అపవాదిని ఎదిరించే శక్తిని మాకు దయచేయుము. యేసయ్యా, నీవు మాలో నివసించుటకు మా పాపములను నీ రక్తము ద్వారా కడిగి, నీ సన్నిధిని ఎల్లప్పుడూ మాతో ఉండునట్లుగా చేయుము మరియు ఈ లోకములో నీ ప్రేమ మరియు ఉద్దేశముతో నిండిన పాత్రగా మమ్మును మార్చుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.