నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికి నేను శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 1:51వ వచనమును మనము నేడు ధ్యానించబోవుచున్నాము. బైబిల్‌లో నతనయేలు అను వ్యక్తితో యేసు ఈలాగున మాట్లాడుచున్నాడు. ఆ మాటలు, "మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారునిపైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అని చెప్పాడు.
సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క లోతైన విషయాలు నతనయేలునకు తెలియదు. కానీ, ఆ సమయములో ప్రభువు యొద్ద నుండి ప్రత్యేకమైన జ్ఞానమును పొందుకునే కృపను ప్రభువు అతనికి అనుగ్రహించాడు. దేవుని తెలుసుకొనుట ఒక దేవుని బిడ్డ జీవితములో ఎంతో గొప్ప ఆశీర్వాదము కదా! అయితే యెషయా 53:11వ వచనములో చూచినట్లయితే, "అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించినకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును'' అని చెప్పబడినట్లుగానే, దేవుని వాక్యము చదవడము ద్వారా ప్రభువును గురించి ఎంతో అధికముగా మనము తెలుసుకొనగలము. అందు కే ఎల్లప్పుడు దేవుని వాక్యమును చదవమని మేము చెబుతుంటాము. వాక్యమును చదువుట ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుని గురించి అనేక విషయములను మనము తెలుసుకొనవచ్చును. హల్లెలూయా!
నా ప్రియ సహోదరీ, సహోదరులారా, కనుకనే, దేవుని వాక్యమును చదవడానికి మీరు ఎంత సమయమును కేటాయించుచున్నారు? మీరు ఎంతో ఆశతో వాక్యమును చదివినప్పుడు, మీ జీవితము రూపారంతరపరచబడుతుంది. అందుకే, కొలొస్సయులకు 1:10వ వచనములో మనము చూచినట్లయితే, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను...'' ప్రకారం దేవుని సంతోషపెట్టునట్లుగా మనము నడుచుకొనవలెను. కాబట్టి, నేడు దేవుని వాక్యమును ఎంత ఎక్కువగా చదువుతారో అంత ఎక్కువగా ప్రభువును సంతోషపెట్టగలరు. అంతమాత్రమే కాదు, ప్రతి మంచి విషయములోను మీరు ఫలవంతులు అవుతారు.
నా ప్రియులారా, ప్రభువు మీకు అన్నియు అద్భుతంగా నేర్పిస్తాడు. కాబట్టి, ఈ రోజు నుండి ఆయన సన్నిధిలో కూర్చుని బైబిల్ గ్రంథమును తీసి చదవండి. అప్పుడు ప్రభువు మీ చెంతకు వస్తాడు, ఆయన మీకు బోధిస్తాడు. బైబిల్‌లో కీర్తనలు 32:8వ వచనములో చెప్పబడినట్లుగానే, ఆయన మీకు సమస్తమును నేర్పిస్తాడు. అంతమాత్రమే కాదు, మీ మీద దృష్టిని ఉంచుతాడు. ఎల్లప్పుడు మిమ్మును ఆయనకు దగ్గరగా చేర్చుకుంటాడు. ప్రియ స్నేహితులారా, ఈ ప్రశస్తమైన అనుభవమును మీ జీవితములో కలిగి ఉండాలని అనుకుంటున్నారా? అయితే, దేవుని యొద్దకు రండి, ప్రభువును అడిగి పొందుకుందాము. ఇప్పుడే ప్రభువు మీకు అటువంటి దైవీకమైన అనుభవమును అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమామయుడవైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ సన్నిధిని మా మీద కుమ్మరించుము. ప్రభువా, నీ వాక్యమును చదివినప్పుడు, అర్థము చేసుకునే కృపను మాకు అనుగ్రహించుము. దేవా, విషయములను మాకు బోధించుము, నీలో అన్యోన్యసహవాసమును కలిగియుండునట్లుగా మమ్మును రూపాంతరపరచుము. ప్రభువా, మా జీవితాన్ని మార్చగల నీ వాక్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ వినయ హృదయంతో మేము నీ ముందుకు వచ్చుచున్నాము. దేవా, నీవు నతనియేలుకు వెల్లడించినట్లుగా నీ సత్యములోని లోతైన విషయాలను చూడడానికి మా కన్నులను తెరువుము. ప్రభువా, దయచేసి మేము నిన్ను మరి ఎక్కువ సన్నిహితంగా తెలుసుకోగలిగేలా ప్రతిరోజూ నీ వాక్యంలో లోతుగా వెళ్లుటకు మా హృదయములో వాంఛను కలిగించుము. దేవా, ప్రతి మంచి పనిలో నిన్ను సంతోషపరుస్తూ, నీ మహిమ కొరకు ఫలాలను అందిస్తూ, నీకు తగినట్లుగా నడవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ మార్గాలను మాకు బోధించుము మరియు నీ ప్రేమగల దృష్టిచేత మమ్మును నడిపించుము. దేవా, మమ్మును నీ యొద్దకు వచ్చునట్లుగాను మరియు మా జీవితంలోని ప్రతి క్షణంలో నీ సన్నిధిలో గల ఆనందాన్ని మాకు అనుగ్రహించుము. ప్రభువా, మేము నీ వాక్యాన్ని ధ్యానించుచున్నప్పుడు, నీ పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానంతో మరియు అవగాహనతో మమ్మును నింపుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.