నా ప్రశస్తమైన స్నేహితులారా, బైబిల్ నుండి దేవుడు మనకు బయలుపరచిన నేటి వాగ్దానముగా, యెషయా 33:15,16వ వచనములలో మనము చూడగలము. ఆ వచనము, "నీతిని అనుసరించి నడచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండ తన చేతులను మలుపుకొని హత్య యను మాట వినకుండ చెవులు మూసికొని చెడుతనము చూడకుండ కన్నులు మూసికొనువాడు ఉన్నత స్థలమున నివసించును. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును తప్పక అతనికి ఆహారము దొరకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును'' ప్రకారం దేవుడు మీ కోసం సమస్తమును అనుగ్రహించుచున్నాడు. ఎంతో ఆదరణను కలిగించే హామీ కదా! దేవుడు మీ అవసరాలన్నిటిని తీర్చి, మిమ్మును ఉన్నత స్థలములలో నివసింపజేస్తాడు. కనుకనే, మీ హృదయమును కలవరపడనీయకండి.
అందుచేతనే, యేసు ఈ భూమి మీద జీవించినప్పుడు అత్యంత అల్పస్థాయికి దిగిపోయి తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన స్వయంగా సంపూర్ణమైన మహిమతో నింపబడిన దేవుడుగా ఉన్నప్పటికిని, ఆయన తండ్రి చిత్తప్రకారము మరణానికి, సమాధి మరియు భూస్థాపనకు అప్పగించుకొనియున్నాడు. అయినప్పటికిని, దేవునిలో ఉన్న ఆత్మ, ఆయనను లేపినది. అందుకే, "మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును'' అన్న వచనం ప్రకారం, యేసు మృతులలో నుండి సజీవంగా తిరిగి లేచాడు. ఈ రోజున, దేవుడుగా, ఆయన సజీవుడుగా, ఆయన మనకు పునరుత్థానమును కలిగించుటకు రక్షకునిగా ఈ లోకమునకు వచ్చాడు. యేసు యొక్క అదే ఆత్మ నేడు మిమ్మును కూడా పైకి లేపుతుంది, మీకును పునరుత్థానమును కలిగిస్తుంది. మిమ్మును కూడా ఈ లోకంలో జయించే వారి కంటే అత్యధికంగా విజయాన్ని అనుగ్రహింపజేస్తాడు. దేవుడు మీ కొరకు సిద్ధం చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు అనుభూతి చెంది ఆనందించునట్లు చేస్తాడు. ఎందుకంటే, యేసు అనే శక్తివంతమైన నామం మీ మీద ఉంటుంది. ఆయన పరిశుద్ధ నామాన్ని మాత్రమే స్తుతించండి! ఆయనను నమ్మండి మరియు విశ్వాసంతో ఆయన నామాన్ని గట్టిగా పట్టుకోండి. ఆయన మీకు సహాయం చేస్తాడు, మీ అవసరాలన్నిటిని తీరుస్తాడు మరియు భూమి యొక్క ఉన్నత స్థలములలో మీరు నివసించునట్లుగా చేస్తాడు.
కలకత్తాకు చెందిన శ్రీమతి దేవోనిత నుండి ఒక చక్కటి సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశించుచున్నాను. ఇంజెనీరింగ్‌లో ఎమ్‌టెక్‌ను పూర్తి చేసుకున్నారు. ఆమె ఆ తర్వాత తన స్వగ్రామానికి దూరంగా ఉన్న జంషెడ్‌పూర్‌లోని ఓ కంపెనీలో చేరారు. ఆమె కార్యాలయంలో, పురుష-ఆధిక్యత(మేల్-డామినేటెడ్) కంపెనీలో ఆమె నిరంతరం వ్యతిరేకతను ఎదుర్కొనినది. ప్రభువైన యేసుపై ఆమెకున్న విశ్వాసం కొరకు ఆమె అపహాస్యం మరియు విమర్శలను ఎదుర్కొనవలసి వచ్చింది. ఇందులో ఒకటి, ఆమె కలకత్తా మరియు జంషెడ్‌పూర్ మధ్య వారానికోసారి ప్రయాణించవలసి వచ్చింది, జంషెడ్‌పూర్‌లో తన ఉద్యోగములో ఉన్న యజమాన్యమును చూసుకోవాలి. ఆలాగుననే, కలకత్తాలో అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసుకోవాలి. తన తల్లిగారు ఎంతో అనారోగ్య పరిస్థితులలో ఉండెను.
ప్రియమైన సహోదరి దేవోనిత తాను విపరీతమైన పనిభారంతోను మరియు ఈ ఒత్తిడి అంతటితో మానసికంగా అలసిపోయారు. ఇటువంటి క్లిష్టమైన సమయంలో, ఆమె నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో జరిగిన యేసు పిలుచుచున్నాడు ప్రవచనాత్మక సదస్సునకు హాజరయ్యారు. ఒకరోజు నేను పరిచర్య చేయుచున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా ఈలాగున చెప్పమని నన్ను ప్రేరేపించాడు: 'చాలా దూర ప్రాంతము నుండి ప్రయాణించి వచ్చిన ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు, వారు ఈ రాష్ట్రానికి సంబంధించిన వారు కాదు. మీరు ఎన్నో చింతలతో నింపబడిన హృదయంతో భారాన్ని మోయుచున్నారు. మీరు మీ కార్యాలయానికి తిరిగి వచ్చినప్పుడు, ప్రభువైన యేసు సమస్తమును మార్చివేస్తాడు. అన్నియు కూడా మీకు అనుకూలంగా మార్చబడతాయి ' అని చెప్పిన ఈ మాటలు ఆమెను నిరీక్షణతోను మరియు సంతోషంతోను నింపబడ్డాయి మరియు ఆమె పరిశుద్ధాత్మచే బలపరచబడింది. ఆమె తన కార్యాలయానికి తిరిగి వచ్చినప్పుడు, ప్రభువు నిజంగా ఒక అద్భుతం చేశాడు. కోల్‌కతాలో పని చేయడానికి మరియు తన తల్లిని చూసుకోవడానికి ఆమె కంపెనీ ఆమెకు తన స్వగ్రామానికి బదిలీని చేయబడింది. ఆమె జీవితం సమాధానముగా మార్చబడినది మరియు ఈ రోజు కూడా ఆమె ఉద్యోగం గొప్పగా ఆశీర్వదించబడియున్నది. అంతమాత్రమే కాదు, ఆమె తన తల్లి పట్ల జాగ్రత్త వహించుచుండెను.
అదేవిధంగా, నా ప్రియులారా, దేవుడు మిమ్మును గురించి జాగ్రత్త వహించి, సమస్తమును ఆయనే మీకు అనుగ్రహించి, మీ ఆహారమును మరియు మీ పానీయమును కూడా ఆశీర్వాస్తానని వాగ్దానము చేయుచున్నాడు. ఆలాగుననే, మీ అవసరతలన్నియు కూడా తీరుస్తాడు. మరియు ఆయన అడుగడుగునా మీ ప్రక్కన నడుచునట్లుగాను, యేసు ఎల్లప్పుడు మీతో ఉండునట్లుగా ఆయన మిమ్మల్ని ఉన్నత స్థలములలో నివసించేలా చేస్తాడు. ఆయనను విశ్వసించండి, ఎందుకంటే ఆయన వాగ్దానము చేసిన దానిని జరిగించడానికి ఆయన నమ్మదగినవాడు. కనుకనే, ఆయనకు మీ జీవితాలను సమర్పించుకొనినట్లయితే, ఆయన మిమ్మును ఉన్నత స్థలములలో ఎక్కించి, మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా అవసరాలన్నియు తీరుస్తానని వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు. ప్రభువా, మమ్మును ఉన్నత స్థలములకు చేర్చి, అడుగడుగునా మమ్మును నడిపిస్తావని మేము నమ్ముచున్నాము. యేసయ్యా, మా కొరకు మరణించి, మహిమతో తిరిగి పునరుత్థానుడవై లేవడానికి నిన్ను నీవు తగ్గించుకున్నందుకు నీకు వందనాలు. ప్రభువా, నిన్ను మృతులలో నుండి లేపిన అదే ఆత్మతో మమ్మును కూడా నింపుము. దేవా, నీవు మా కొరకు సిద్ధపరచిన దీవెనలను ఆనందిస్తూ మమ్మును ఈ లోకములో అన్నిటికంటెను అత్యధికమైన విజయమును పొందునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. ప్రభువా, నీవు నీ వాగ్దానాలలో నమ్మదగినవాడవనియు గుర్తించి, మేము నీ నామమును విశ్వాసముతో పట్టుకొని యున్నాము. దేవా, దయచేసి అనుదిన ఆహారముగా మరియు నీ సన్నిధిలోని జీవజలాన్ని మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీ నిత్యమైన ప్రేమ మరియు సంరక్షణలో విశ్రాంతి తీసుకొనుటకు, ఉన్నతమైన స్థలములలో నివసించడానికి మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.