నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 23:2వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు'' ప్రకారం మీ పట్ల ఇది ఎంత అమూల్యమైన దేవుని వాగ్దానము కదా. ఎందుకనగా, ప్రభువైన యేసు మిమ్మును ప్రేమించుచున్నాడు. కనుకనే, ఆయన మిమ్మును తన స్వంత బిడ్డలనుగా ఏర్పరచుకొనియున్నాడు. ఆయన మీ పట్ల జాగ్రత్త మరియు ఎంతో శ్రద్ధ వహించుచున్నాడు. ఎల్లప్పుడు మీరు ఆయన ఆశీర్వాదాలను కలిగించే పచ్చికగల చోట్లలో మీరు నివసించాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు. ఇంకను ఈ లోకములో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని, అది భూసంబంధమైనదియు మరియు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను కూడా దేవుడు మీకు అనుగ్రహించాలని మీ పట్ల వాంఛకలిగియున్నాడు. ఎందుకనగా, మీరు భద్రత మరియు శాంతి సమాధానముతో నెమ్మదిని కలిగి ఉండాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు. కారణము, ఆయన సమాధానమును మీ జీవితములో ఆజ్ఞాపించుచున్నాడు. అందుకే బైబిల్‌లో యెషయా 32:18వ వచనములో చూచినట్లయితే, "నీతి సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు'' ప్రకారము సుఖకరమైన నివాసముల యందు మీరు నివసించాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. కనుకనే, మీ హృదయములను కలవరపడనీయ్యకండి. మరియు వీటన్నిటికీ, ప్రభువు మీకు కాపరిగా ఉంటాడు. ఒకవేళ, మీరు అడగవచ్చును, 'నేను పచ్చని పచ్చిక బయళ్లను ఎక్కడ కనుగొనగలను? గందరగోళంతో నిండిన ఈ లోకములో శాంతికరమైన జలములు నాకు ఎక్కడ దొరుకుతాయి? మీ నుండి బలవంతముగా తీసుకొనడానికి ప్రయత్నిస్తున్న కఠినమైన జలాలు, అసూయపడే వ్యక్తులు మరియు దుష్ట హృదయాలు మాత్రమే మీరు చూడవచ్చును. "నేను శాంతిని, భద్రతలను ఎక్కడ కనుగొనగలను? నేను ఎవరిని నమ్మగలను?'' అని మీరు ఆశ్చర్యపోవచ్చును. అయితే, ప్రభువు అటువంటి మిమ్మును చూచి, "నేను మీ తండ్రిని'' అని జవాబిస్తున్నాడు. ఇంకను, "నా బిడ్డలారా, నేను నిన్ను ఎన్నటికిని విడువను, ఎడబాయను. నిశ్చయంగా, నేను నిన్ను శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాను. నేను పచ్చికగల చోట్ల నిన్ను పరుండ జేయుదును, పచ్చిక అనగా, సమృద్ధికరమైన ఆశీర్వాదాలను నీవు అనుభవించునట్లుగా చేయుదును. నేనే వాటిని నీ కొరకు ఉత్పత్తి చేయుదును'' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, ప్రభువునందు ఆనందించండి.
అవును, నా ప్రియులారా, బైబిల్ నుండి యోబు 25:2వ వచనములో చూచినట్లయితే, " అధికారమును భీకరత్వమును ఆయనకు తోడైయున్నవి ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయును'' ప్రకారం దేవుడు తన ఉన్నత స్థలములలో మీకు సమాధానమును కలుగజేయుచున్నాడు. అయితే, ఈ దేవుడే లోకంలోనికి వచ్చి, మీ కొరకు సిలువకు అప్పగించుకున్నాడు. అందుకే బైబిల్‌లో కొలొస్సయులకు 1:20వ వచనములో ఈలాగున ప్రకటించుచున్నది, "ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను'' అవును, ఆయన సిలువపై తన రక్తాన్ని చిందించాడు, ఆ రక్తం ద్వారా మనకు శాంతిని మరియు భద్రతను అనుగ్రహించాడు. ఆ శాంతి మొదట దేవునితో ఉన్నది. తద్వారా, మనం ఇప్పుడు ఆయనను 'తండ్రి' అని పిలిచి ధైర్యంగా ఆయన యొద్ద నుండి ఆ ఆశీర్వాదాలను పొందుకొనవచ్చును. ఆయన రక్తం ద్వారా, మనం ప్రజలతో కూడా సమాధానమును కలిగి ఉండగలము. ఇతరులు మనకు కీడు కల్పించడానికి ప్రయత్నించినప్పుడు కూడా, మనం దీవెనలు మాట్లాడే శక్తిని పొందుకొనే అనుభూతిని చెందుతాము.
గుర్తుంచుకోండి, యేసు తనను అప్పగించిన యూదా వైపు చూసి, " నీవు నా స్నేహితుడివి'' అని అన్నాడు. ఆయన అతనిని శత్రువులా చూడలేదు. అందుకు బదులుగా, యూదా దేవుని ప్రణాళికను మాత్రమే నెరవేరుస్తున్నాడనియు ఆయనకు తెలుసు. అందుకే, " యేసు చెలికాడా, నీవు చేయవచ్చి నది చేయుమని'' అతనితో చెప్పెను. చూడండి, ఆయన, అతనిని, ' స్నేహితుడా, నువ్వు ఎందుకు వచ్చావు?' అని అడిగాడు. శాంతిసమాధానమునకు గల శక్తి అలాంటిది మరియు అంత గొప్పది. మరియు దయ్యాలు దాడి చేయడానికి ప్రయత్నించినప్పటికి, బైబిల్‌లో కీర్తనలు 147:14వ వచనములో చెప్పినట్లుగానే, " నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే'' ప్రకారం దేవుడు మీ సరిహద్దులలో సమాధానముతో చుట్టుముట్టాడు. మీరు ఆయన స్వరాన్ని విని, ఆయనను వెంబడిస్తారా? ఆలాగైతే, ఇప్పుడే ప్రార్థించండి: "ప్రభువా, నేను నీ స్వరాన్ని వినాలనుకుంటున్నాను మరియు నీ చిత్తాన్ని చేయాలనుకుంటున్నాను, నీవు నన్ను ఏమి చేయమని అడుగుతావో ఆలకించుచున్నాను, దానిని నేను చేయుదును'' అని ప్రార్థించినప్పుడు, మీరు ఎల్లప్పుడూ పచ్చని పచ్చిక బయళ్లలో నివసిస్తారు, ఆయన సంరక్షణలో వర్ధిల్లుతారు. అప్పుడు, ప్రభువు మిమ్మును శాంతికరమైన జలముల ప్రక్కన నడిపించినప్పుడు మీ జీవితము సమాధానముతో నింపబడి ఉంటుంది.
ఇక్కడ సహోదరి సెల్వి ఎస్తేర్ యొక్క అద్భుతమైన ఒక సాక్ష్యం కలదు. అంకితభావంతో యేసును అనుసరించుచున్న సహోదరి సెల్వి ఎస్తేర్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరూ యౌవన భాగస్థుల పధకములో భాగస్థులుగా నమోదు చేసుకున్నారు. ఆమె యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో రాయబారిగా ఉండెను. వారు ఈ పరిచర్యలో భాగస్థులు కావడానికి ముందు, - అప్పులు, పిల్లల చదువు కొరకు ఇబ్బందులు మరియు కుటుంబ భారాలను కలిగియుండుట ద్వారా ఆమె జీవితం సవాళ్లతో నిండిపోయింది. కానీ, యేసు పిలుచుచున్నాడు పరిచర్య ద్వారా, ఆమె తన జీవితాన్ని యేసుకు అప్పగించుకొనెను. ఆమె పెద్ద కుమార్తె ఒక హోటల్‌లో పనిచేయుచున్నది. మరియు ఆమె ఇలాగున వ్రాసి పంపించెను, సహోదరుడు పాల్ దినకరన్ ఆ హోటల్‌లో బస చేసి ఆమె కోసం ప్రార్థించాడు. మరియు ఒక నెలలోనే, ఆమె కుమార్తె మేనేజర్‌గా పదోన్నతి పొందింది, వారు ఎప్పుడూ ఊహించలేనిది! ఆమె చిన్న కుమార్తె వ్యాపార ఆశీర్వాద పధకములో భాగస్థురాలుగా నమోదు చేసుకొనెను. తద్వారా, ఆమె ఒక ఐటీ కంపెనీలో అద్భుతమైన ఉద్యోగమును సంపాదించుకొనెను. ఈరోజు, సహోదరి సెల్వి ఎస్తేర్ యేసు పిలుచుచున్నాడు పరిచర్య ద్వారా తాను యేసుకు రాయబారిని అని గర్వంగా చెప్పుకొనుచున్నారు. నిజంగా, దేవుడు వారిని పచ్చని పచ్చిక బయళ్లలో పరుండబెట్టి శాంతికరమైన జలములను అనుభవించునట్లుగా చేశాడు. నా ప్రియులారా, నేడు ఆయన మీ కొరకు కూడా తప్పకుండా అలాగుననే జరిగిస్తాడు. కనుకనే, మిమ్మును మీరు దేవునికి సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును పచ్చిక గల చోట్లలో పరుండబెట్టి, శాంతికరమైన జలముల యొద్ద మిమ్మును నివసింపజేసి, మీ సరిహద్దులలో సమాధాముండునట్లుగా చేసి, సుఖకరమైన నివాసములలో మీరు నివసించునట్లుగా మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
సమాధానకర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, నీవు మాకు కాపరిగా ఉన్నందుకు మరియు మమ్మును ఇంతగా ప్రేమించినందుకు నీకు వందనాలు. దేవా, నీవు మమ్మును నీ సొత్తుగా ఏర్పరచుకున్నందుకు మరియు మా జీవితంలోని ప్రతి భాగాన్ని నీవు శ్రద్ధగా చూసుకుంటావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మమ్మును నీ యొక్క ఆశీర్వాదాల పచ్చిక బయళ్లలోనికి నడిపించుము. దేవా, మా చుట్టూ ఉన్న గందరగోళాన్ని నిమ్మళపరచుము మరియు నీ యొక్క శాంతికరమైన జలముల ప్రక్కన మమ్మును నడిపించుము. ప్రభువా, నీ రక్తం ద్వారా మమ్మును విలువపెట్టి కొనిన నీ యొక్క శాంతిని మా హృదయంలో ఏలునట్లుగా చేయుము. ప్రభువా, మా ప్రతి అపవాది దాడుల నుండి నీ శాంతి సరిహద్దుతో మమ్మును రక్షించుము. దేవా, కాపరివైన నీ స్వరాన్ని గొఱ్ఱెలుగా ఉన్న మేము వినడానికి మరియు ఆనందంతో నీ చిత్తాన్ని పాటించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మేము సుఖకరమైన నివాసములలో నివసించునట్లుగాను, నీ సన్నిధిలో మేము నిత్యము వర్ధిల్లునట్లుగా చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.