నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి నిర్గమకాండము 15:26వ వచనము ప్రకారము నేడు దేవుడు మీ రోగములను స్వస్థపరచి, మిమ్మును దీవించును గాక. ఆ వచనము, "మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచిన యెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను'' ప్రకారము నేడు మీ వ్యాధులన్నియు దేవుడు ముట్టి స్వస్థపరచబోవుచున్నాడు. కాబట్టి, మీ వ్యాధి ఏదియైనను సరే, మీరు చింతించకండి.
నా ప్రియులారా, బైబిల్‌లో దేవుడు ఎర్ర సముద్రమును రెండుపాయలుగా చీల్చి, అద్భుతవిధంగా ఇశ్రాయేలీయులను నడిపించినట్లుగా మనము గుర్తించగలము. తద్వారా, ఇశ్రాయేలీయుల ప్రజలు ఆనందముతోను మరియు సంతోషముతోను ఎంతగానో కీర్తనలు పాడియున్నారు. అయినప్పటికిని మూడు దినముల తర్వాత అరణ్యములో నీళ్లు దొరకనప్పుడు వారు సణిగారు. తర్వాత, వారికి ఒక ఒయాసిస్ కనబడినది. కానీ, అది చేదైన నీళ్లతో నిండియుండెను. కనుకనే, వారు ఆ స్థలమునకు 'మారా' అని పేరు పెట్టారు. అయినను మోషే మొఱ్ఱపెట్టినప్పుడు, దేవుడు ఒక కర్ర ముక్కను నీటిలోనికి విసిరివేయమని తెలియజేసియున్నాడు. మోషే వెనువెంటనే దేవునికి విధేయుడై ఆలాగున చేసినప్పుడు, 'మారా' అను జలము మధురమైన త్రాగుటకు యోగ్యమైన నీరు మారినవి. ఇక్కడ దేవుడు వారికి ఒక పాఠమును చెబుతున్నాడు, ఆయన నీటిని బాగు చేసి స్వస్థపరచిన రీతిగానే, వారి దేహములను కూడా స్వస్థపరచగలడు అని వారికి స్పష్టముగా తెలియజేశాడు. కనుకనే, ప్రభువు "మిమ్మును స్వస్థపరచు యెహోవాను నేనే'' అని వారికి తెలియజేశాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, మీరు దేవుని ఆజ్ఞలకు విధేయులైనప్పుడు, ఆయన మిమ్మును కూడా స్వస్థపరచగలడని నమ్మండి. ఆలాగుననే, అద్భుతాన్ని అనుభవించండి.
నా ప్రియులారా, సాధారణంగా హాస్పిటలలో రోగుల కొరకు అనేకమైన విభాగాలలో ప్రత్యేకమైన వార్డులు ఉంటాయి. నయము కానీ, వ్యాధి కొరకు ప్రత్యేకమైన విభాగము(వార్డు)ఉంటుంది. వారికి వైద్యము అందిస్తూ ఉంటారు. కానీ, ఏ మాత్రము కూడా వారి మీద నిరీక్షణ ఉండదు. కానీ, నా ప్రియ స్నేహితులారా, మనలను స్వస్థపరచు ప్రియ ప్రభువునకు అసాధ్యమైనదేదియు లేదు. దేవుడు స్వస్థపరచలేని వ్యాధులను కూడా ఆయన స్వస్థపరచుటకు సమర్థుడుగా ఉన్నాడు. అవును, ప్రియ స్నేహితులారా, మీరు దేవునికి విధేయులై, ఆయన ఆజ్ఞలను మీరు అనుసరించినట్లయితే, ఈ లోకపరమైన వ్యాధి ఏదియు కూడా మీ మీదికి రాదు. బైబిల్‌లో చూచినట్లయితే, నిర్గమకాండము 23:25లో మనము చూచినట్లయితే, వాక్యములో ఏమని చెబుతుందంటే, "నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను'' అని సెలవిచ్చుచున్నాడు. అవును, "నేను మీ మధ్య నుండి రోగమును తొలగించెదను'' అని చెప్పినట్లుగానే, మనము యేసులో ఎంత గొప్ప ప్రేమగల దేవుని కలిగియున్నాము కదా. మీరు స్వస్థపరచబడు నిమిత్తము సిలువలో ఆయన త్యాగము చేసి, మీ నిమిత్తమై ఆయన మరణించాడు. అందుకే ఆయన మీకు ప్రభువై యున్నాడు, ఆయనే మిమ్మును స్వస్థపరచు యెహోవా. కాబట్టి, నేడు మీ శరీరములో మీరు ఎటువంటి రోగములున్నను సరే, అవి మరణకరమైనవి అయినను సరే, మీరు ఆయనకు మొఱ్ఱపెట్టండి. అంతమాత్రమే కాదు, ఆయన ఆజ్ఞలకు విధేయులైనప్పుడు, డాక్టర్లకు అసాధ్యమైన వ్యాధులను మన ప్రభువైన యేసు స్వస్థపరుస్తాడు. మీరు స్వస్థతా శక్తిని అనుభూతి చెంది, ఆనందించండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీకు తోడైయుండి, ఆయన మీ వ్యాధులను స్వస్థపరచి, మీ ఆహార పానీయమును ఆశీర్వదించి, మీ మధ్య నుండి తొలగించి, మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. యేసయ్యా, మేము స్వస్థత పొందగలిగేలా మా బాధను అంగీకరించి, సిలువపై నిన్ను నీవు త్యాగబలిగా చేసి, నీ గాయాల ద్వారా మాకు స్వస్థతను మరియు ఆదరణ, బలమును అనుగ్రహించినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్యా, "నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే'' అని చెప్పిన నీ వాగ్దానమును బట్టి నీకు వందనాలు. దేవా, నీ యొక్క స్వస్థపరచు శక్తి మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. ప్రభువా, ఇప్పుడే, నయము కానీ, మా మరియు మా ప్రియులగు వారి రోగములను ఇప్పుడే నీ స్వస్థతా శక్తి ద్వారా స్వస్థపరచుము. యేసయ్యా, నీ గాయపడిన హస్తములతో మా శరీరములను తాకి, మా క్యాన్సర్ వ్యాధి మరియు ఇతర మరణకరమైన రోగములన్నిటిని స్వస్థపరచుము. దేవా, కృతజ్ఞతతో కూడిన హృదయంతో నీ యొద్దకు వచ్చుచున్నాము. ప్రభువా, నీ యొక్క స్వస్థత మరియు శాశ్వతమైన నిరీక్షణగా మేము అంగీకరించునట్లుగాను, మాకు అటువంటి గొప్ప ధన్యతను దయచేయుము. ప్రభువా, మేము నీ వాక్యమునకు విధేయతతో నడుచుకొనుటకును మరియు మా ప్రతి రోగము నుండి మమ్మును రక్షిస్తావని మేము నమ్ముచున్నాము. దేవా, నీ ప్రజల కొరకు ఎర్ర సముద్రాన్ని రెండుపాయలుగా విభజించావు, మారా అను చేదు నీళ్లను మధురంగా మార్చావు. ఆలాగుననే, ప్రభువా, మా జీవితంలో అదే దయ మరియు స్వస్థతను కలిగించే శక్తిని మా మీద కుమ్మరించుము. ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏదీయు లేదని మేము గుర్తించునట్లుగా మాకు అటువంటి కృపను దయచేయుము. దేవా, నీవు మా పట్ల వాగ్దానం చేసినట్లుగానే మా ఆహార పానీయమును ఆశీర్వదించి, మా మరియు మా ప్రియులైన వారి మధ్య నుండి రోగమును తొలగించి, బలపరచుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.