నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 పేతురు 2:24వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి'' అన్న వచనం ప్రకారం దేవుడు మీకు స్వస్థతను ఇవ్వాలని మీ పట్ల కోరుచున్నాడు. కనుకనే, మీరు చింతించకండి.

నా ప్రియులారా, నేడు మీరు అనారోగ్యముతో బాధపడుచున్నారా? ఈ నొప్పి నా శరీరమంతా నన్ను బాధపెట్టుచున్నది, నేను భరించలేకపోతున్నాను అంటున్నారా? ఎన్నో సంవత్సరాలుగా అద్భుతాల కొరకు వేచియున్నాను అని అంటున్నారా? ఈ బలహీనత మరియు అనారోగ్యముతో నేను బయటకు వెళ్లలేకపోవుచున్నాను అని అంటున్నారా? ఈ రోజు ఆయన గాయముల చేత మీరు స్వస్థతను పొందుకొనబోవుచున్నారు. యేసు నామమున దానిని మీరు ఈ క్షణములో పొందుకొనండి. మీ ప్రతి గాయమును ప్రభువు స్వస్థపరుస్తున్నాడు. కనుకనే, నేడు మీరు మీ వ్యాధుల నిమిత్తము బాధపడకండి.

ఈ సహోదరి జీవితములో అదే జరిగింది. తిరుచ్చికి చెందిన అళగుమతి అనే ప్రియమైన సోదరి సాక్ష్యాన్ని నేను మీతో పంచుకోవాలని కోరుచున్నాను. 1996వ సంవత్సరములో వివాహము జరగగా, 1997లో ఒక బిడ్డకు జన్మనిచ్చెను. బిడ్డకు జన్మనిచ్చే సమయములో తీసుకొన్న చికిత్స వలన తాను కొన్ని అలర్జీ సమస్యలను ఎదుర్కొనెను. తన చేతులంతయు దద్దుర్లు ద్వారా బాధపడుచుండెను. తన చేతులు మరియు కాళ్లు అన్నియు కూడా దద్దుర్లు వచ్చాయి. దురద కలుగుట ద్వారా రక్తము కారుచుండెను. ప్రతి సంవత్సరము జూన్ మరియు జూలై మాసములో ఈ చర్మ వ్యాధి ఎక్కువగా వస్తుండేది. ప్రతి సంవత్సరము ఆరు నెలలు ఎంతగానో శ్రమపడుచుండెను. 20 సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడుచున్నాను అని ఆమె చెప్పెను. దురద వలన నొప్పితో విలవిలలాడిపోవుచుండెను. తన చేతుల కాళ్ల నుండి రక్తము కారుచుండెను. ఈ నొప్పులను తను భరించలేకపోయేది. కానీ, 2017వ సంవత్సరమున ఒక రోజున ఆస్పత్రికి వెళ్లుచుండగా, ఆ మార్గములో తిరుచ్చిలో ఉన్న ప్రార్థన గోపురమును ఆమె చూచెను. ప్రార్థనా గోపురములోనికి వెళ్లినది. మీ దుఃఖము సంతోషముగా మారుతుంది అనే వాక్యమును చూచినది. అది చూడగానే, హృదయములో ఎంతో సంతోషము కలిగింది. ప్రభువు నిశ్చయముగా ఆమెను స్వస్థపరచి, తనకు ప్రభువు ఆనందిస్తాడని నమ్మింది. అక్కడ ఉన్న ప్రార్థనా యోధుల ద్వారా ప్రార్థనను పొందుకొనినది. ఒక చిన్న ప్రార్థన నూనెను ప్రార్థనా యోధులు ప్రార్థించి ఆమెకు ఇచ్చారు. ఆమె ఆ ప్రార్థన నూనె ఇంటికి తీసుకొని వెళ్లినది. ప్రతి రోజు ఆ నూనెను రాసి తాను ప్రార్థన చేయుచుండెను. అప్పుడు ఒక్క వారంలోనే, తన దద్దుర్లు అన్నియు మాయమైపోయాయి. పూర్తిగా స్వస్థతను పొందుకున్నది. 20 సంవత్సరాలుగా బాధపడుచున్న ఆ వ్యాధి, ఒక్క వారములోనే బాగుపడింది. అద్భుతాన్ని చేసిన దేవుని ఆమె విడువకుండా స్తుతించుచుండెను. దేవునికే మహిమ కలుగును గాక.

అదేవిధముగా, నా ప్రియులారా,15 సంవత్సరాలుగా నాకు బిడ్డలు లేరు అని అంటున్నారా? లేక అనేక సంవత్సరాలుగా ఈ క్యాన్సర్ వ్యాధి నన్ను బాధపెడుతుంది అని అంటున్నారా? ఈ చర్మ వ్యాధి నన్ను విడిచి వెళ్లిపోవడము లేదు, ఈ మోకాళ్ల నొప్పులు నన్ను విడిచి వెళ్లిపోవడము లేదు, నా కాలేయము పనిచేయడము లేదు, నా మూత్రపిండములు పనిచేయడము లేదు, నేను చక్కగా శ్వాసను తీసుకోలేకపోవుచున్నాను, నా సమస్య నన్ను వేధించుచు, అనేక సంవత్సరాలుగా నేను బాధపడుచున్నాను అని మీరు అంటున్నారా? భయపడకండి. నేడు ఆయన తన స్వస్థతా శక్తిని మీలోనికి పంపించి, ఆయన మిమ్మును స్వస్థపరుస్తాడు.

నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానమును గట్టిగా పట్టుకొని, ప్రభువును అడగండి. ఎందుకంటే, "ఆయన గాయముల ద్వారా మీరు స్వస్థతను పొందియున్నారు'' ఆయన గాయములు మిమ్మును బాగుచేస్తాయి. ఈ రోజు ఆయన స్వస్థతా శక్తిని మీ శరీరములోనికి పొందుకొనండి, స్వస్థతా శక్తిని మీ మనస్సులోనికి పొందుకొనండి. ఇప్పుడే, ప్రభువు మిమ్మును తాకి స్వస్థపరుస్తున్నాడు, ఈ సమయములో ఆయన మిమ్మును తాకుచున్నాడు. అనేక సంవత్సరములుగా మీరు బాధపడుచున్న ఆ వ్యాధి నుండి మీరు నేడు స్వస్థతను పొందుకొనబోవుచున్నారు. కలిసి ప్రార్థించి, మనము దేవుని యొద్ద నుండి స్వస్థతను పొందుకుందామా? మీరు ఇన్ని సంవత్సరాలుగా బాధ పడుతున్న ఎటువంటి వ్యాధినైనను సరే, దేవుడు ఈ క్షణములోనే స్వస్థపరచుచున్నాడు. మీరు ప్రార్థన చేసి, యేసు యొక్క గాయపడిన హస్తముల నుండి స్వస్థత పొందుకుంటారా? నమ్మండి, మరియు ఈరోజు మీ జీవితంలో ఆయన అద్భుత శక్తిని మీరు రుచి చూసి, అనుభవిస్తారు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రియమైన ప్రభువా, నీవు పొందిన గాయాల ద్వారా మేము స్వస్థత పొందుకుంటామని నీ వాగ్దానం మీద విశ్వాసంతో మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, నీ స్వస్థపరచే శక్తిని నమ్ముచూ మా అనారోగ్యం, శ్రమ మరియు బాధలన్నింటినీ నీ పాదాల వద్ద ఉంచుచున్నాము. ప్రభువా, మా శరీరం, ఆత్మ మరియు జీవమును ముట్టి, సంపూర్ణ స్వస్థతను మాకు దయచేయుము. యేసయ్యా, మేకులతో కొట్టబడిన నీ హస్తములతో మా యొక్క ప్రతి బాధను మరియు వ్యాధిని తొలగించి, ఈ భారం నుండి మమ్మును విడిపించుము. దేవా, నీ ప్రేమలో మేము విశ్రమించుచున్నప్పుడు, మమ్మును నీ యొక్క బలం, శాంతి మరియు ఆనందంతో నింపుము. ప్రభువా, నీవు ఈ క్షణం మా వ్యాధులను స్వస్థపరచగలవని మేము నమ్ముచున్నాము మరియు ఈ రోజు నీ యొద్ద నుండి అద్భుతాన్ని పొందడానికి మేము మా హృదయాన్ని తెరుచుటకు నీవు సహాయము చేయుము. దేవా, మాకు స్వస్థత, మాకు రక్షకుని మరియు ఆపత్కాలములో మాకు సహాయాన్ని అనుగ్రహించుము. ప్రభువా, నీ యొక్క మంచితనం మరియు కృప కొరకు మేము స్తుతించుటకు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.