హలో నా ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాలములో మీకు శుభములు తెలియజేయుటలో నాకెంతో సంతోషముగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 119:50 వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. దావీదు ఈ వచనములో ఈలాగున అంటున్నాడు, " నీ వాక్యము నన్ను బ్రదికించియున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది.'' అవును, స్నేహితులారా, దేవుని వాక్యము మనలను బ్రతికిస్తుంది. అవును, దేవుని వాక్యం నిజంగా మనకు జీవాన్ని, బలాన్ని అనుగ్రహిస్తుంది.
బైబిల్‌లో మత్తయి 4:4వ వచనములో మనము ఈలాగున చూడగలము. "అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి యున్నదనెను.'' అవును, నా స్నేహితులారా, ఈ లోకములో మనము జీవించడానికి రొట్టె ఎంత అవసరమో, దేవుని వాక్యము మనకు జీవమును ఇవ్వడానికి కూడా ఎంతో అవసరమై యున్నది. ఆ దేవుని వాక్యము మనలను సజీవముగా ఉంచుతుంది మరియు కాపాడుతుంది. ఇంకను హెబ్రీయులకు 4:12వ వచనములో మనము ఈలాగున చూడగలము. "ఎందుకనగా, దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది'' ప్రకారం దేవుని వాక్యములో జీవమును మరియు శక్తియు కలదు. దేవుని వాక్యములన్నియు గుర్తించుకోవడం ఎంతో ప్రాముఖ్యము. దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానములను తప్పకుండా కంఠస్థం చేయాలి. దేవుని వాక్యమును మీ జీవితములో ఒక ఆయుధముగా ఉపయోగించాలి. దానిని ఒక పని ముట్టుగా వాడుకోవాలి. ఆదరణ ఇచ్చే పనిముట్టుగాను, బలాన్ని మరియు శక్తిని, జీవమునిచ్చు పని ముట్టుగా ఉపయోగపడునట్లుగా ఉంటుంది. ఇంకను "యెహోవా నా కాపరి నాకు లేమి లేదు మరియు నాకు విరోధముగా రూపింపబడు యే ఆయుధము వర్థిల్లదు, నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను'' అని పలికినప్పుడు ఆ వాక్యాలు మనకు ఎంతో శక్తినిస్తాయి మరియు జీవాన్నిస్తాయి. ఇంకను ఆదరణను కలుగజేస్తాయి. బలాన్ని మనకు ఇస్తాయి. దేవుని వాక్యము మనలను ప్రోత్సహించడము మాత్రమే కాదు, ఈ వాక్యాలను మనము పలికినప్పుడు, అవి మన జీవితములో నెరవేరుతాయి. ఈ దేవుని వాక్యములు సజీవమును రెండంచులంత బలముగలవైనవిగా ఉన్నవి. కనుకనే, అనుదినము దేవుని వాక్యమును మనము తప్పకుండా చదవాలి.
నా ప్రియులారా, దావీదు, మోషే, యిర్మీయా మరియు యెషయా అను భక్తుల జీవితాలలో దానిని మనము చూడగలుగుచున్నాము. ఎక్కడికైనను వెళ్లి, వారిని పనిచేయమని దేవుడు సెలవిచ్చినప్పుడు, లేక ఒక ప్రణాళిక ప్రభువు వారికిచ్చినప్పుడు, ఆయన వాగ్దానములను కూడా వారికిస్తాడు. "నేను మీకు ముందుగా వెళ్లతాను. నేను మిమ్మును విడిపిస్తాను. నేను నిన్ను కాపాడతాను'' అని ప్రభువు ఎప్పుడు వాగ్దానము చేస్తాడు. ఆ వాగ్దానము వారికి జీవమునిస్తాయి. వారు ధైర్యంగా ముందుకు వెళ్లతారు. ప్రభువు ప్రణాళికను వారు నెరవేరుస్తారు. ప్రభువు వారికి ముందుగా వెళ్లి, వారికి విజయాన్ని దయచేస్తాడు. కాబట్టి నా ప్రియులారా, ఈ రోజు మీరు, 'నేను ఎన్నో కష్టాలలో ఉన్నాను అని అంటున్నారేమో? నేను ఎంతో బాధపడుచున్నాను, నా యెదుట ఎంతో మంది శత్రువులున్నారు. నా యెదుట ఎంతో పెద్ద ఆటంకము ఉన్నది. నేనేమి చేయగలను? నేను ఎలా వెళ్లగలను? నా పక్షమున ఎవరున్నారు? అని అంటున్నారేమో?' నా ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యమును మీ హృదయములో భద్రపరచుకున్నప్పుడు, దేవుడు మీ జీవితములో ఇచ్చిన వాగ్దానములను మీరు అంగీకరించునట్లుగా పరిశుద్ధాత్ముడు మిమ్మును ప్రేరేపిస్తాడు. అంతమాత్రమే కాదు, మిమ్మును ఆలాగుననే నడిపిస్తాడు.
కాబట్టి, నా ప్రియులారా, ఈ రోజు దేవుని వాగ్దానములను కంఠస్థము చేసినప్పుడు, మీ జీవితములోని ఆటంకములన్నిటిని మీరు ఎంతో సులభంగా అధిగమించగలుగుతారు. ఆ వాగ్దానములు మీ జీవితములో మీరు ఎదుర్కొంటున్న కష్టాలలో మీకు ఆదరణ అనుగ్రహిస్తాయి. ఆ వాగ్దానము మీకు జీవమును కలుగజేస్తాయి. ఈ రోజు ఆ వాగ్దానములన్నిటిని అంగీకరించినప్పుడు, ప్రభువు మీ కష్టాలన్నిటి నుండి మిమ్మును విడిపిస్తాడు. ప్రభువు మిమ్మును రక్షిస్తాడు. అంతమాత్రమే కాదు, ప్రభువు మీతో ఉంటాడు. ఆయనకు వందనాలు చెల్లించి, ప్రార్థిద్దామా? మీ జీవితంలో ఈ వాగ్దానాలను హత్తుకొనండి మరియు ఆయన శక్తి మీ జీవితములో ఉన్న ప్రతి పోరాటాన్ని విజయవంతంగా ఎలా మారుస్తుందో చూడండి. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును బ్రతికించి, దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, ఈ రోజు నీవు మాకిచ్చిన వాగ్దానములన్నిటిని మేము అంగీకరించునట్లుగాను, మేము ఎదుర్కొంటున్న ప్రతి శ్రమను అధిగమించడానికి మాకు సహాయము చేయుము. దేవా, మా యొక్క ప్రతి ఆటంకములను మరియు ప్రతి అనారోగ్యములను మా నుండి తొలగించి, మమ్మును స్వస్థపరచుము. ప్రభువా, ప్రతి అపవాది కార్యములు ఇప్పుడు మా నుండి బ్రద్ధలైపోవునట్లుగా కృపను అనుగ్రహించుము. దేవా, నీ వాక్యము ద్వారా జీవమును మరియు ఆదరణను పొందుకొనునట్లు మాకు సహాయము చేయుము. యేసయ్యా, మా వ్యాధులన్నిటిని ముట్టి, మమ్మును స్వస్థపరచి, మాకు విడుదలను దయచేయుము. ప్రభువా, నీ వాక్యమును మేము కంఠస్థము చేయుచు, మా హృదయములలో భద్రము చేసుకొనునట్లుగా మాకు నేర్పించుము. దేవా, నీ వాగ్దానములను మరియు నీ మాటలను మేము ఎంతో విలువైనవిగా హృదయములో భద్రము చేసుకోవడానికి, వాటిని దగ్గరగా ఉంచుకోవడానికి మరియు విశ్వాసంతో మా జీవితంలో వాటిని మాట్లాడటానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీవు దావీదు, మోషే, యిర్మీయా మరియు యెషయాతో కూడా ఉండి, వారికి ముందుగా వెళ్ళినట్లుగానే, నీవు మాతో కూడా నడుస్తూ, నీ వాగ్దానాలు మాలో విశ్వాసం మరియు శాంతిని కలిగించునట్లుగా చేయుము. దేవా, నీ వాక్యము ద్వారా నీవు మా కష్టాల నుండి మమ్మును విడిపిస్తావనియు, మమ్మును రక్షిస్తావని మరియు మాకు నిరంతరం తోడుగా ఉంటావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మేము నీ ఓదార్పుని పొందుకొని, నీ వాగ్దానాలను నిరీక్షణతోను మరియు విశ్వాసంతో హత్తుకొని జీవించునట్లుగాను మరియు అద్భుత కార్యాలను పొందుకొనునట్లుగా మాకు అటువంటి కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు సజీవముగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.