నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 116:7వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసియున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము'' అని చెప్పబడియున్నది. ఈ వచనం ప్రకారము, అవును, ప్రియులారా, మన దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి, మన పాణాత్మలను ఎంతో భద్రంగా కాపాడుచున్నాడు. అందుకే కీర్తనాకారుడు కీర్తనలు 116:8లో ఈలాగు ప్రభువుతో పలుకుచున్నాడు, "మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను జారిపడకుండ నా పాదములను నీవు తప్పించియున్నావు''ప్రకారం, అవును, నా స్నేహితులారా, ప్రభువునందు మనము విశ్రాంతి తీసుకోవాలి. కానీ, మిగతా విషయాలన్నిటిని ప్రభువే జాగ్రత్తగా చూసుకుంటాడు. మీరు అలసిపోయి సొమ్మసిల్లిన స్థితిలో ఉన్నప్పుడు, 'తిరిగి మీ విశ్రాంతిలోనికి ప్రవేశించుము' అని ప్రభువు చెప్పుచున్న ఈ మాటను వినడము, మనకు ఎంతో మంచిది మరియు మేలు కదా. మన ప్రాణములను విశ్రాంతిలో ఉంచడము, అది ప్రభువు యొక్క పని మాత్రమే కాదు. కానీ, మనము కూడ మన ప్రాణములను విశ్రాంతిలో ఉంచుకుంటూ, ఆహ్లాదకరముగా, ఆనందముగా ఉండుటకు ప్రయత్నించినప్పుడు మాత్రము మనము పరిపూర్ణమైన విశ్రాంతిని పొందుకొనగలము.
అదేవిధంగా, బైబిల్‌లో లూకా 10:39-42వ వచనములలో మార్తాను మనము చూచినట్లయితే, ఆమె ఎంతో పనుల భారముతో చింతిస్తూ, తన స్వంత అక్కయైన మరియను గురించి యేసయ్యతో ఫిర్యాదు చేయడం మనము చూడగలము. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరపడి, ఆయన యొద్దకు వచ్చి 'ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను.' అప్పుడు యేసయ్యా, ఏమని జవాబు ఇచ్చాడో చూడండి, "అందుకు ప్రభువు మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే'' అని చెప్పాడు. అవును, అనేకసార్లు మనము అదేవిధముగా చేస్తాము. మన జీవితములో ఏదైన ఒక్కటి సరిగ్గా జరగని సమయము లో అనేకమైన వాటిని గురించి చింతిస్తూ, కలవరపడుతుంటాము. మన కోపా న్ని, మన ప్రియులపైన మరియు మన కుటుంబ సభ్యులపైన కనపరుస్తూ, ఆవేశపడుతుంటాము. ఎన్ని రోజులైన వారితో మాట్లాడకుండా ఉంటాము. అందువలన, మన సమాధానము మాత్రమే కాదు, కుటుంబ సభ్యుల మధ్య కూడ సమాధానము నాశనమైపోతుంది. ప్రియ స్నేహితులారా, దేనిని గురించి చింతించకండి, మన శరీరములను, మన ప్రాణములను, విశ్రాంతిలో భద్రముగా కాపాడేది దేవుడే. ఆ తదుపరి వచనము లూకా 10:42లో మనము చూచినట్లయితే, ' మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను.' ఆ ఉత్తమమైనది ఏమై యున్నది? అది యేసయ్య మాత్రమే. యేసయ్యను, మనము కలిగి ఉంటూ, ఆయనపైన ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచడము, మనలను ఎల్లప్పుడు విశ్రాంతిలో ఉంచుతుంది.
నా ప్రియులారా, నేడు "మీ పైన మీరు నమ్మకమును కలిగి యుండండి'' అని ఈ లోకము చెబుతుంది. కానీ, మనలను మనము నమ్ముకోవడానికి మనలో ఏమున్నది? ఏమియు కూడ లేదు నా ప్రియ స్నేహితులారా, మనలను మనము కూడ నమ్ముకోలేము. మన శరీరము, ఎంతో అపవిత్రమైనది, ఎంతో వ్యర్థమైనది. ఇంకను మన మనస్సులలో అనేకమైన చెడు విషయాలను ఆలోచిస్తాము. ఇక మనము ఏమి నమ్మగలుగుతాము. అవును, నా ప్రియులారా, మనము నమ్మవలసినది యేసు మాత్రమే. ఎందుకనగా, ఆయనే పరిశుద్ధుడుగా ఉన్నాడు. మనము ఈ లోకములో జీవించునట్లుగా, ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చియున్నాడు. కనుకనే, మన పరిపూర్ణమైన నమ్మకమును ఆయన మీద ఉంచి, ఆయనను విశ్వసించవలెను. మత్తయి 11:28లో యేసు ఈ విధంగా పలుకుచున్నాడు, "ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును'' అన్న వచనం ప్రకారము, నా ప్రియులారా, మీ భారమునంతటిని యేసయ్య మీదనే ఉంచండి. యేసయ్య అదే చెబుతున్నాడు, మనకు విశ్రాంతిని ఇచ్చునది, యేసయ్య మాత్రమే. అందుకే ఫిలిప్పీయులకు 4:12లో పౌలు ఈ విధంగా పలుకుచున్నాడు, "దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును; ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి యుండుటకును ఆకలిగొని యుండుటకును, సమృద్ధి కలిగి యుండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను.'' అవును, నా ప్రియులారా, దేవుడు సమస్తమును చేయగలడు అనే విషయాన్ని మనము గుర్తించి, సంతోషముగా ఉండుటకు నేర్చుకొనవలెను. అందుకే కీర్తనలు 46:10వ వచనములో, దేవుడు ఈలాగున అంటున్నాడు, " ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును భూమి మీద నేను మహోన్నతుడనగుదును'' ప్రకారం ఆయన మన దేవుడు గనుకనే, మీరు ఆయన విశ్రాంతిలోనికి తిరిగి ప్రవేశించండి. దేనిని గురించి చింతించకండి, ప్రియ స్నేహితులారా, యేసయ్యను మాత్రమే ఆధారపడుచూ, ఆయన యందు నమ్మకము కలిగి ఉండండి. ఆయన మీకు పరిపూర్ణమైన విశ్రాంతిని కలుగజేస్తాడు. తద్వారా, మీరు పరిపూర్ణమైన విశ్రాంతిని కలిగియుందురు గాక. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. తండ్రీ, ప్రభువైన యేసు ద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్రాంతి మరియు పరిపూర్ణ సమాధానమునకై నీకు కృతజ్ఞతలు. ప్రభువా, ఇప్పుడు కూడా మా బాధలు, భారాలన్నిటిని నీ పాదాల చెంత పెట్టడానికి నీ ముందుకు వచ్చుచున్నాము. దేవా, నీవు మా స్వంత రక్షకుడివి, మేము జీవించగలిగేలా మా కొరకు నీ జీవితాన్ని త్యాగం చేశావు. ప్రభువా, నీవు మాత్రమే మేము నమ్ముకొనగలిగిన దేవుడవు మరియు మా ఆందోళన మరియు ప్రతికూల ఆలోచనల నుండి మమ్మును విడిపించగలవు. ప్రభువా, నీ ప్రేమపూర్వకమైన సన్నిధిలో మా ఆత్మకు సమాధానమును మరియు విశ్రాంతిని పొందేందుకు మేము నీ యొద్దకు తిరిగి వచ్చుచున్నాము. దేవా, మా సమస్యలు ఏవైన సరే, ఈ రోజు వాటిని మా నుండి తొలగించుము. యేసయ్యా, నేడే సొమ్మసిల్లిన మా ప్రాణములకు విశ్రాంతిని కలుగజేయుము. ప్రభువా, మా కుటుంబ జీవితములో కలుగుచున్న విభజనలు, మనస్పర్థలన్నిటిని మా నుండి తీసివేయుము. ప్రభువా, మా జీవితములో సమాధానమును, సంతోషమును కలుగజేయుము. యేసయ్యా, మా ప్రాణములను నీలో భద్రముపరచుకొనుము. దేవా, మా హృదయములోనికి రమ్ము నాయన, మా హృదయాలను ఇప్పుడే తాకుము, మాకు పరిపూర్ణమైన విశ్రాంతిని కలుగజేయుము. ప్రభువా, మా భౌతిక అవసరాల నుండి మా ఆధ్యాత్మిక పోషణ వరకు నీవు అన్నింటిని జాగ్రత్తగా చూసుకుంటావనియు మరియు మమ్మును సురక్షితంగా నివసించేలా చేస్తావనియు మరియు మేము పరిపూర్ణమైన విశ్రాంతిని పొందుకొనగలమని మేము గుర్తించునట్లుగా మాకు నీ యందు నమ్మకమును దయచేయుమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.