నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 4:18వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును'' అని చెప్పబడిన ప్రకారం నీతిమంతుల మార్గము వేకువ వెలుగు తేజరిల్లునట్లుగా అంతకంతకు తేజరిల్లుతుంది. సాధారణంగా, వేకువ వెలుగున ఉదయించుచున్న సూర్యుడు మనము ఎప్పుడు చూచు సూర్యుని కంటె, ఎంతో ప్రకాశవంతముగా ఉంటాడు. మనము ఆలాగున ఏలా రూపాంతరపరచబడతాము? ఒకవేళ మీరు చీకటిలో ఉన్నారేమో? మీరు పాపములు మరియు పాపపు అలవాట్లలో ఉన్నారేమో? ఎటువంటి స్థితిలో మీరు ఉన్నను సరే, అదే స్థితిలో మీరు ఆశీర్వాదములను పొందుకుంటారు.
నా ప్రియ స్నేహితులారా, నేడు ప్రభువు యెదుట మిమ్మును మీరు తగ్గించుకున్నప్పుడు, నిశ్చయముగా, మీరు సూర్యుని వలె తేజరిల్లుదురు. బైబిల్‌లో అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయములో మనము చూచినట్లయితే, మనము సౌలు అను వ్యక్తిని గురించి చదువుతాము. అతడు క్రీస్తుకు విరోధమైన కార్యములన్నిటిని జరిగించేవాడు. ఇంకను అతడు చెడు కార్యములన్నిటిని చేయుచుండేవాడు. అయితే, బైబిల్ నుండి రోమీయులకు 9:22వ వచనములో మనము చూచినట్లయితే, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతా పాత్రమైన ఘటముగా అతడు ఉంటూ ఉండేవాడు. అతడు ఒక ఉగ్రతాపాత్రగా ఉండెను. అయితే, ప్రభువు కనికర పూర్ణుడు. కనుకనే, ప్రభువైన యేసు అతనిని వ్యక్తిగతంగా దర్శించాడు. బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయములో మనము చదువుగలుగుతాము. యేసుక్రీస్తు అతనిని పేరు పెట్టి పిలిచాడు. ఇంకను అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశము నుండి యొక వెలుగు అతని చుట్టు ప్రకాశించెను. అప్పుడతడు నేలమీద పడి, 'సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని' తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఆ స్వరము, 'ఇక ఎంత కాలము నన్ను హింసిస్తావని' అతనిని అడిగెను. యేసుక్రీస్తు యొక్క మాటలు ఆ వ్యక్తిని తాకాయి. సౌలు హృదయాన్ని తాకాయి. అప్పుడు ఏమి జరిగింది? బైబిల్ నుండి గలతీయులకు 2:20వ వచనమును మనము చదివినట్లయితే, పౌలు ఈ విధంగా అంటున్నాడు, "నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను'' ప్రకారం ముందుగానే అతడు సౌలుగా పిలువబడ్డాడు. కానీ, ఇప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. అది ఇప్పుడు ఏ విధముగా జరిగియున్నది? ఆయన తాకుదల అతనిని రూపాంతరపరచినది.
నా ప్రియులారా, ఇది విజయ మార్గముగా ఉన్నది. ఒకవేళ మీరు చీకటిలో ఉండి ఉండవచ్చును. మీరు అపవాది మార్గములను వెంబడించుచుండవచ్చును. కానీ ఇప్పుడే, సౌలు పౌలుగా మార్చబడిన రీతిగానే, నేడు మీ జీవితాన్ని కూడా మార్చివేస్తాడు. ప్రభువు మీ జీవితమును కూడా మార్చివేస్తాడు. ఆయనకు ఈలాగున మొఱ్ఱపెట్టండి, 'ప్రభువా, నేను ఒక పాపిని, క్షమించు ము, నేను చీకటిలో ఉన్నాను, వెలుగులోనికి నన్ను నడిపించుము, గొప్ప వెలుగుగా ఉన్న యేసుక్రీస్తులో వె లుగులోనికి నన్ను నడిపించుమని' మీరు ఆలాగున ఆయనకు మొఱ్ఱపెట్టినట్లయితే, ప్రభువు మీ మొఱ్ఱలను ఆలకించి, మీకు జవాబిస్తాడు. కనుకనే, ఇప్పుడే, మీరు యేసుక్రీస్తులోనికి రండి, మీరు ఆయన వెలుగులోనికి వచ్చినట్లయితే, ఆయన మీకు నూతన జీవితమును అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా,ఈ రోజు మమ్మును మేము తగ్గించుకొని విధేయతగల హృదయంతో నీ యొద్దకు వచ్చుచున్నాము. తండ్రీ, నీ ప్రేమకై వందనాలు, సిలువలో నీవు చేసిన త్యాగమునకు, సిలువలో నీవు పడిన వేదనకై, కార్చిన రక్తమునకై నీకు వందనాలు. ప్రభువా, చీకటిలో మమ్మును నేడు నీ యొక్క వెలుగుతో బయటకు తీసుకొని రమ్ము. దేవా, మా యొక్క పాత పాపపు అలవాట్లన్నిటి నుండి మమ్మును తొలగించుము. ప్రభువా, అపవాదితోను మరియు అపవాది స్నేహితులతో ఉన్న బంధాలను తొలగించి, మమ్మును నూతన వ్యక్తులనుగా మార్చి, దీవించుము. దేవా, మా నామము జీవ గ్రంథములో లిఖించబడుటకు కృపను దయచేయుము. యేసయ్య, సౌలు నడిచిన చీకటిలో మేము నడుచుచున్నాము కనుకనే, సౌలును పిలిచి అతని జీవితాన్ని మార్చినట్లుగానే, నీవు మమ్మును కూడా మార్చగలవని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నీ క్షమాపణ మరియు కృప కొరకు అడుగుచున్నాము, మమ్మును నీ రక్తముతో కడిగి పవిత్రపరచి, మమ్మును నీ యొక్క అద్భుతమైన వెలుగులోనికి తీసుకు రమ్ము. దేవా, మేము ఇకపై క్రీస్తుతో కూడ సిలువ వేయబడియుండునట్లుగాను, ఇకను జీవించువారము మేము కాము, క్రీస్తే మా యందు జీవించునట్లుగా చేయుము. దేవా, మేము ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము మమ్మును ప్రేమించి, మా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన నీ కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాము అను నీ సత్యంలో నడుచునట్లుగాను, ఇంకను మా మార్గం ఎక్కువగా ప్రకాశవంతంగా తేజరిల్లునట్లుగా చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.