నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 91:4వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది'' ప్రకారం ఆయన రెక్కలతో మిమ్మును కప్పుతాడు. ఇది నిత్యము మార్పులేని మీ కొరకైన దేవుని వాగ్దానమై యున్నది. నేడు మీకు ఆశ్రయమును కల్పించుటకు మీ కొరకు ఆయన రెక్కలు చాపబడియున్నవి. తల్లిగ్రద్ద తన రెక్కల మీద తన బిడ్డలను ఏ విధంగా మోసుకొని వెళ్లుతుందో ఆ విధంగా దేవుడు తన రెక్కలతో మనలను మోసుకొని వెళ్లతాడు. ఉన్నతమైన స్థలములకు చిన్న బిడ్డలవలె మిమ్మును లేవనెత్తుకొని మోసుకొని వెళతాడు. దేవుడు మిమ్మును ఔన్నత్యమైన స్థాయికి తీసుకొని వెళ్లాలని కోరుచున్నాడు. బైబిల్‌లో యెషయా 58:14వ వచనమును చూచినట్లయితే, "నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే'' అని వ్రాయబడియున్నట్లుగానే, ఉన్నత స్థలములలో మీరు విజయోత్సముతో ఉండునట్లుగా చేయుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుకనే నేడు దేవుడు మిమ్మును ఉన్నత స్థలములకు తీసుకొని వెళ్లాలని కోరుచున్నాడు. ఆయనతో కూడా మీరు నడుచునట్లుగాను, ఆయన మిమ్మును పరసంబంధమైన స్థలములకు తీసుకొని వెళ్లుచున్నాడు. మీ జీవితానికి సంబంధించిన ఆయన ప్రణాళికలు, మీ యొక్క కుటుంబానికి మరియు ప్రపంచమునకు సంబంధించినవాటిని గురించి దేవుడు తన మర్మములను మీకు బయలుపరచగోరుచున్నాడు. అవి జరుగునట్లుగా, మీరు ప్రార్థన చేయుచుండగా, ఆయన మిమ్మును ఉన్నత స్థలములకు లేవనెత్తుతాడు.

నా ప్రియులారా, మనలో అనేకమంది, కలలు, దర్శనములు పొందుకోవాలని దేవుని అడుగుతుంటాము. ఆలాగైతే, మీరు "ప్రభువా, నేను నీ స్వరమును వినగోరుచున్నాను, నీ మార్గమును నాకు కనపరచుము. నీ యొక్క ప్రణాళికలను నాకు చూపించుము'' అని ప్రార్థించండి. అవును, పౌలు ప్రార్థించిన రీతిగానే, బైబిల్‌లో ఫిలిప్పీయులకు 3:10,11వ వచనములలో చూచినట్లయితే, "ఏ విధముచేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణ విషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను మరియు ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను''ప్రకారం నేను ఆయనను ఎరగాలి, ఆయన శ్రమలలో నేను సహవాసము కలిగియుండాలి, ఆయన పునరుత్థానపు శక్తిని ఎరిగి యుండాలి అని మీరు ప్రార్థించండి. ఆలాగుననే, కీర్తనాకారుడు, ఇలాగున వేడుకున్నాడు, "ప్రభువా, నీ మార్గాలను నాకు చూపుము, అది నెరవేరాలని నేను నీ చిత్తానుసారంగా ప్రార్థిస్తాను'' అని చెప్పాడు. అవును, దేవుడు నేడు మీ కన్నులను తెరవజేయగోరుచున్నాడు. అందుచేత మిమ్మును తన పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఇంకను అపొస్తలుల కార్యములు 2:17లో చూచినట్లయితే, "అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీÄౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు. నా మనస్సును తెలుసుకొనుటకును మరియు దానిని సంభవించుటకు ప్రార్థించండి.'' అవును, మీరు ఈ దైవీకమైన పిలుపునకు ప్రతిస్పందించినప్పుడు, దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానాలకు ఎక్కిస్తాడు మరియు మీరు ఆయన రెక్కల క్రింద ఆశ్రయం పొందుతారు.

ఒక అద్భుత కార్యాన్ని గురించి, అద్భుతమైన సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని కోరుచున్నాను. కోయంబత్తూరు నుండి ప్రవీణ్ మరియు అతని భార్య నాన్సీ వారిద్దరు కూడా కారుణ్యలో పట్టభద్రులైయ్యారు. వారికి యువాన్ అనే 5 సంవత్సరముల కుమారుడు కలడు. యువాన్‌కి జ్వరము మరియు చీలమండలము వాపు కూడ వచ్చినది. వారికి ఆ వ్యాధి ఏమైయున్నదో వారికి అర్థము కాలేదు. ఎన్నిసార్లు సంప్రదించినా వైద్యులు సమస్యను గుర్తించలేకపోయారు. ఒకరోజు వారు హాస్పిటల్‌కు వెళ్లుచుండగా, తాంబ్రంలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురము యొద్ద ప్రార్థనా గోపురములోనికి వెళ్లారు. ప్రార్థనా యోధులు వారి నిమిత్తమై ప్రార్థించి, వారికి అనేకమైన ప్రవచనాత్మక సంగతులను తెలియజేశారు. ఆనాటి నుండి కుటుంబ సమేతంగా ప్రార్థనలలో పాల్గొనుటకు ప్రారంభించారు. తర్వాత, అనుభవజ్ఞులైన వైద్యులను వారు సంప్రదించారు. ప్రార్థనా యోధులు ప్రార్థన చేయుచున్నప్పుడు, అక్కడ ఒక ప్రార్థనా యోధుడు వారి కుమారుని గురించి ప్రవచించాడు మరియు మీరు 'కుటుంబ ప్రార్థనను ప్రారంభించాలి' అని వారికి సూచించాడు. వైద్యులు ఏమని చెప్పారంటే, మీ కుమారునికి చాలా అరుదైన వ్యాధి ఉన్నది, వందమందిలో ఒక్కరికే ఈ వ్యాధి సంభవిస్తుంది అని చెప్పారు. కానీ, వారు ఎటువంటి వైద్యము కూడా సూచించలేదు.

అయినప్పటికిని, దేవుడు ప్రార్థనా గోపురములో చేయబడిన ప్రార్థనలకు జవాబిచ్చాడు. వారి కుమారుడు పరిపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. ఒకప్పుడు యువాన్ ఎంతగానో నడవడానికి బాధపడ్డాడు. ఇప్పుడు నాట్యము మరియు గానము చేయుచున్నాడు, పరిగెత్తుచున్నాడు, ఆడుచున్నాడు. దేవుని కృప ద్వారా వందకు వంద శాతము స్వస్థపరచబడ్డాడు. దేవునికే మహిమ కలుగును గాక.

నా ప్రియ స్నేహితులారా, మీరు ఆయన చిత్తమును చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, దేవుడు తన రెక్కలను మీమీద ఉంచుతాడు. కనుకనే, నేటి నుండి మీ కుటుంబమును ప్రార్థన క్రింద భద్రపరచుకోండి మరియు మీ కుటుంబాన్ని ప్రభువు యొక్క సేవకు సమర్పించుకొనండి. ఆయన రెక్కలు మీకు రక్షణ మరియు ఆశ్రయంతో కప్పివేస్తాయి. ఆయన మిమ్మును ఉన్నత స్థలములకు లేవనెత్తుతాడు. ఆయన మిమ్మును తన రెక్కల క్రింద భద్రపరుస్తాడు మరియు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మాకు దైవీకమైన భద్రతను అనుగ్రహించుము. కృపగల ప్రభువా, నీ రెక్కలతో మమ్మును కప్పి, మాకు ఆశ్రయం అనుగ్రహిస్తానని నీవు చేసిన మార్పులేని వాగ్దానానికి నేను నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, డేగ తన పిల్లలను మోస్తున్నట్లుగా నీవు మమ్మును మోయుచు మరియు నీవు మా కొరకు సిద్ధం చేసిన ఉన్నత స్థానాలకు మమ్మును పైకి లేవనెత్తుము. ప్రభువా, నీ మర్మములను మాకు బయలుపరచుము, మేము నీ ఉద్దేశముల ప్రకారం నడుచునట్లుగాను, మరియు నీ చిత్తానుసారంగా ప్రార్థించునట్లు చేయుము. దేవా, మేము మరియు మా పిల్లలు దర్శనాలను, కలలను కనునట్లుగా నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును నింపుము. యేసయ్యా, నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయమును కలుగజేసి, మమ్మును భద్రపరచుము మరియు నీతో నడవడానికి మమ్మును పరలోక స్థలమునకు ఎక్కించుము. దేవా, నీ ఆశీర్వాదాలు మరియు దయతో మేము ఉద్దేశపూర్వకంగా జీవించగలుగనట్లుగాను, నీ మార్గాలను చూడటానికి మా కళ్ళు తెరువుము. ప్రభువా, మమ్మును మేము నీ సంకల్పంతో సరిదిద్దుకొనునట్లుగాను, నీలో సంతోషం, శాంతి మరియు విజయం యొక్క నూతన రంగాలకు మమ్మును హెచ్చించుమని మా ప్రభువైన యేసు క్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.