నా ప్రియ స్నేహితులారా, ఈ రోజున మీకు శుభములు తెలియజేయడము నాకు చాలా సంతోషముగా ఉన్నది! దేవుని సన్నిధి మనతో కూడా ఉన్నప్పుడు సంపూర్ణ సంతోషము కలదు. పరిశుద్ధాత్మ ద్వారా మా బామ్మగారు అటువంటి సంతోషమును స్వీకరించారు. అనేక సంవత్సరముల క్రితం ఇదే రోజున, ఆమె పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడియున్నారు. నిశ్చయముగా, మీలో అనేకమంది, ఆమె పరిచర్య ద్వారా దీవించబడియుంటారని నేను నమ్ముచున్నాను. కాబట్టి, నేడు మీరు కూడా అట్టి అభిషేకముతో దీవించబడుదురు గాక. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 32:7వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, ‘‘నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు’’ అని చెప్పబడినట్లుగానే, అవును, ఈ రోజు విమోచన మీ యొద్దకు వస్తుంది. కనుకనే, ధైర్యముగా ఉండండి. 

నా ప్రియులారా, మీరు లక్ష్యముగా చేయబడిన అత్యంత సంక్లిష్టమైన పరిస్థితులలోను కూడా మరియు నేను చాలా ఇరుకులో ఉన్నాను, ఇకను నేను ఇక్కడ బ్రతకలేను అని మీకు అనిపించినప్పుడు, విమోచన గానములు మిమ్మును ఆవరించాలి. ఎందుకనగా, ఈ వచనము చెబుతుందిలా, ‘‘దేవా, నా దాగు చోటు నీవే, నీవు శ్రమలలో నన్ను భద్రపరచెదవు.’’ ఆలాగుననే, యేసు యొక్క శిష్యులు, ఆయనను వెంబడించుట చేత, వారు చెరలో ఆ విధంగా వేయబడ్డారు. అయితే, అక్కడ వారు ఏమి చేశారు? వారు భయము పొందారా? లేక ఫిర్యాదు చేశారా? వారి ప్రాణము కొరకు మొఱ్ఱపెట్టారా? లేదు నా స్నేహితులారా, వారు గానము చేయుచూ, దేవునిని స్తుతించారు. వారు దేవుని యందు దాగి యున్నారు. దేవుని యొక్క దాగు చోటున, వారి కన్నులు ప్రభువు మీద ఉంచి, ఆయనను విమోచన గానములతో స్తుతించారు. తద్వారా, మహా అద్భుతముగా, భూమి కంపించినది. చెరసాలలు తెరువబడ్డాయి, వారు భద్రపరచబడటానికి మార్గము తెరువచేయబడినది. వారు విమోచించబడ్డారు.  

ఆలాగుననే, బైబిల్‌లో దానియేలును చూడండి. దానియేలు కూడా సింహాల గుహలో ఉన్నప్పుడు, అతడు సింహముల చేత ఆవరించబడ్డాడు. అతడు ప్రభువును ప్రేమించినందు చేత అతడు అక్కడి నుండి విడిపించబడ్డాడు. సింహాల నోటిని మూత వేశాడు, ప్రభువు అతనికి విడుదల నిచ్చి, సింహాల గుహ నుండి అతనికి కాపాడి సంరక్షించియున్నాడు. హల్లెలూయా! 

నా ప్రియులారా, ఈ రోజు ఒకవేళ సింహాల వంటి వ్యక్తులు లేక సమస్యలు   మీకు విరోధముగా గర్జన చేయుచున్నవేమో? మీరు అక్షరాల చెరలో వేయబడి ఉన్నట్టుగా ఉన్నారేమో? లేక మీ కుటుంబ సభ్యులు అన్యాయంగా చెరలో వేయబడి ఉన్నారేమో? లేక మీ కుటుంబ సభ్యులు తమ ప్రాణముల కొరకు పోరాడుచున్నారేమో? నా స్నేహితులారా, అయితే, మీ కొరకు ఇక్కడ ఒక శుభవార్త  వేచి యున్నది.  ఇప్పుడు విమోచన గానములు మీ యొద్దకు వచ్చేయుచున్నవి. ఎందుకనగా, ప్రభువును మీ దాగు చోటుగా మీరు చేసుకొని ఉన్నారు. అవును, నేడు మనము దేవుని యొద్ద నుండి ఇటువంటి గొప్ప  విడుదలను స్వీకరిద్దామా? ఆలాగుననే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. 

ప్రార్థన:
మహోన్నతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానముతో మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము నీ వైపు చూస్తున్నాము, ఇప్పుడే అద్భుతమును మా పట్ల జరిగించుము, మాకు విడుదలను దయచేయుము. దేవా, మా చుట్టు ఉన్న సింహాల నోటిని మూత వేయుటకు నీ యొక్క దూతలను మా యొద్దకు పంపించుము. ప్రభువా, మేము అణచి వేయబడిన అదే స్థలములో, నీ యొక్క అద్భుత కార్యములు మా పట్ల జరుగునట్లు చేయుము. దేవా, శుభవార్త మా యొద్దకు వచ్చునట్లుగా మరియు మేము విడుదల పొందియున్నాము అన్న వార్తను గుర్తించునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మా మీద తప్పుగా మోపబడిన నేరములన్నియు మా నుండి ఇప్పుడే తొలగించునట్లుగా చేయుము. ప్రభువా, అందుకు బదులుగా మాకు ఘనతను దయచేసి, ఉన్నతమైన స్థానమునకు మమ్మును లేవనెత్తుము. దేవా,  మేము నీ మీద ఆధారపడుచూ, మేము నీ నామమును ధరించియున్నాము. కనునకే, ప్రజలు మమ్మును బెదిరించినప్పటికిని, నీవు మమ్మును ఘనపరచుము, ఆ స్థలములో మమ్మును ఉన్నతముగా హెచ్చించుము. అక్కడ ఉన్న నాయకులు నీవు మాతో ఉన్నావని గుర్తించునట్లుగా చేయుము, అంతమాత్రమే కాదు, విమోచన గానములతో మమ్మును నింపుము. ప్రియమైన ప్రభువా, నీ సన్నిధిలో ఆశ్రయం కోరుతూ మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము. దేవా, నీవే మా దాగు చోటు, మా బలమైన ఆశ్రయం మరియు మమ్మును విడిపించేవాడవు నీవే. ప్రభువా, మేము అపవాది బంధకములలో చిక్కుకున్నట్లుగా, శోధనలతో ఆవరించబడినట్లుగా మాకు అనిపించినప్పుడు, నీ యొక్క వాగ్దానాన్ని మాకు గుర్తు చేయుము. దేవా, నీవు దానియేలును సింహాల గుహ నుండి రక్షించి, నీ శిష్యులను చెరసాల నుండి విడిపించినట్లుగానే, నేడు ప్రభువా, మా కష్టాల నుండి మమ్మును విడిపించి, తుఫానులో కూడా మేము నిన్ను స్తుతిస్తూనే ఉండునట్లుగా మా హృదయాన్ని విమోచన గానములతో నింపుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.