నాకు అమూల్యమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడైన మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ రోజు మనము ఒక గొప్ప విషయాన్ని ధ్యానించబోవుచున్నాము. ఇంకను ఒక గొప్ప మర్మమును మనము ధ్యానించుకుందాము. ఆ మర్మము నేటి దేవుని వాగ్దానముగా బైబిల్ నుండి నిర్గమకాండము 20:24వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, " మంటి బలి పీఠమును నా కొరకు చేసి, దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొఱ్ఱెలను నీ యెద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను'' అన్న వచనం ప్రకారం దేవుడు మీ యొద్దకు వచ్చి మిమ్మును ఆశీర్వాదిస్తాడు. అవును, ఎంత అద్భుతమైన నామమును మనము కలిగియున్నాము కదా! తదనుగుణంగా, మనం జ్ఞాపకార్థముగా నుంచుకోవలసిన దేవుని అద్భుతమైన పేర్లు కలవు. ఆ పేర్లలో, ' సర్వశక్తిమంతుడైన దేవుడు మరియు యేసుక్రీస్తు ప్రభువు' అను ప్రభువు యొక్క ఈ మహిమాన్వితమైన నామములను మీరు ఉపయోగించి మరియు ప్రభువునకు ప్రార్థించినప్పుడు, మీరు దేనికొరకు ప్రార్థించినను సరే, తప్పకుండా మీ ప్రార్థనకు జవాబును పొందుకుంటారు.

ఆలాగుననే, మోషే దేవుని యొక్క సేవకుడుగా ఆయన ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. తద్వారా, ఆయన తన పరిచర్య నిమిత్తము మోషేను ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తీయుల చేతులలో నుండి మరియు ఐగుప్తీయుల రాజు చేతిలో నుండి విడిపించుట కొరకై దేవునిచేత మోషే ఎన్నుకొనబడ్డాడు. ఫరో రాజు ఇశ్రాయేలీయులను ఎంతగానో హింసించాడు. ఇంకను ఇశ్రాయేలీయులు అనేక విధాలుగా శ్రమ పెట్టబడ్డారు. అందుకే బైబిల్‌లో నిర్గమకాండము 9:16వ వచనమును చదివినట్లయితే, ప్రభువు తన బలమునంతటిని మోషే ద్వారా ఫరోకు చూపించియున్నాడు. అందుకే బైబిల్‌లో, " నా బలమును నీకు చూపునట్లును, భూలోకమందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని '' అని ప్రభువు సెలవిచ్చియున్నాడు. అవును, ఐగుప్తీయుల రాజైన ఫరో దేవుని ప్రజలను ఎంతగానో శ్రమపెట్టాడు. కానీ, దేవుడు తన అద్భుతమైన నామమును బట్టి, మోషే ద్వారా తన బలమును చూపించి, తన ప్రజలను విడిపించాడు.

నా ప్రియ దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుని నామమును మరియు ప్రభువైన యేసుక్రీస్తు నామమును మీరు ఎంతగా ఉపయోగించుచున్నారు? అందుకే యిర్మీయా 48:15 మరియు నిర్గమకాండము 6:3 వ వచనములలో మనము చూచినట్లయితే, దేవుడు తన ప్రజలకు సర్వశక్తిగల దేవునిగా వారికి తనుతాను ప్రత్యక్షపరచుకున్నాడు. "మోయాబు పాడైపోవు చున్నది శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు వారి Äౌవనులలో శ్రేష్ఠులు వధకు పోవుచున్నారు, "సైన్యములకధిపతియగు యెహోవా'' అను పేరుగల రాజు సెలవిచ్చిన మాట యిదే.'' అవును, నేడు ప్రభువు నుండి ఎట్టి ఆశీర్వాదమును మీరు కోరుకున్న లేక ఎట్టి శ్రమను ఎదుర్కొంటున్న ఆయన నామములో మీరు ఆయనకు మొఱ్ఱపెట్టండి మరియు ఆయనకు ప్రార్థించండి. ఇశ్రాయేలీయులు అనేకమైన శ్రమలను అనుభవించారు. అటువంటి సమయములో మోషే మరియు తన ప్రజలను విడిపించుట కొరకు ప్రభువుకు మొఱ్ఱపెట్టాడు. ఇంకను వారి విడుదల కొరకు దేవుని నామమున మొఱ్ఱపెట్టి విలపించాడు. ఆ గొప్ప నామమును బట్టి, ఆ గొప్ప విధానంలో వారు విడుదల పొందారు. అదేవిధంగా నా ప్రశస్తమైన వారలారా, మీరు దేవుని నామమున మొఱ్ఱపెట్టినప్పుడు మీరు అద్భుతములను చూచెదరు. కాబట్టి, భయపడకండి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన :
సర్వశక్తిగల మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, సర్వశక్తిమంతుడవైన దేవా, నీ నామమునకు వందనాలు. దేవా, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. యేసయ్యా, ఇప్పుడు కూడ నీకే మేము మొఱ్ఱపెట్టుచున్నాము. ప్రభువా, మా జీవితములో ఎన్నో గొప్ప కార్యాలు జరగాలని మేము ఎదురు చూచుచున్నాము. ప్రభువా, నీ యొక్క శక్తివంతమైన పేర్లను ఉపయోగించి అధికారంతో ప్రార్థించడం మాకు నేర్పించుము. దేవా, దయచేసి మమ్మును నిరాశలో మునిగిపోనివ్వకుండా, మా దృష్టిని నీ మీద ఉంచబడునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, ఎల్లవేళలా నీపై పూర్తి విశ్వాసం ఉంచడానికి మాకు నీ కృపను దయచేయుము. దేవా, దయతో మమ్మును ఆత్మీయంగా బలపరచుము మరియు నీ అద్భుతమైన పేర్లను మరియు నీ మాటలను మా హృదయంలో దాచుకోవడానికి మరియు ఎటువంటి పరిస్థితిలోనైనా, మేము నీ నామమును జ్ఞాపకార్థముగా ఉంచుకొనునట్లుగాను, నీ నామము పేరట ప్రార్థించునట్లుగాను తద్వారా, మేము జయమును పొందుకొనునట్లుగా మాకు సహాయం చేయుము. ప్రభువా, రాబోయే దినములలో నీ యొక్క అద్భుతాలను అనుభవించడానికి మరియు నీ రాజ్యమును, మహిమను, శక్తిని ఘనపరచడానికి మాకు సహాయము దయచేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.