నా ప్రియమైనవారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 4:4వ వచనము తీసుకొనబడినది. ఈ వచనములో పరిశుద్ధుడైన పౌలు, "ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి'' అని తెలియజేయుచున్నట్లుగా మనము చదవగలుగుచున్నాము. ఇంకను, దేవుని యొక్క వాక్యము మనకు ఈలాగున తెలియజేయుచున్నది, "యెహోవాను బట్టి ఆనందించుము, అప్పుడు ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును'' అనే మాటను మనము బైబిల్‌లో చూడగలము. అవును, దేవుని సన్నిధిని మన మధ్యలో మనము కలిగియున్నప్పుడు మనము చేయుచున్న ప్రతి కార్యములలోను ఎంతో గొప్ప ఆనందమును కనుగొనగలము. ప్రాముఖ్యమైన కార్యమేదనగా, మన మధ్యలో మనము దేవుని సన్నిధిని కలిగి ఉండవలసి యున్నది. బైబిల్‌లో ఈలాగున చెబుతుంది, "ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు.'' అవును, నా ప్రియులారా, ఈ లోకములో సంతోషాన్ని ఆనందాన్ని కలిగియుండడానికి ఎంతో ఎదురు చూస్తుంది. కనుకనే ఆనందము కోసమై ఇటుఅటు పరుగులు పెడుతూ ఉన్నట్టుగా ఉంటారు. ఆనందము కోసమై ఇతరుల వైపునకు వారు చూస్తూ ఉంటారు. అయినప్పటికిని అది కొంత కాలము మాత్రమే ఆలాగున నిలిచి ఉంటుంది. తీరమును తాకుచున్న అలలు ఎంత తరచుగా వచ్చి వెళ్లిపోతుంటాయో, ఆలాగున తరచుగా రావడం పోవడం జరుగుతుంది. కానీ, ప్రభువునందు ఆనందము కలిగి యుండడము అనేది జీవితములో మనము కలిగియున్న గొప్ప సదుపాయం.


బైబిల్‌లో యోహాను 16:24వ వచనములో దేవుడు ఏమని సెలవిచ్చాడంటే, "ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును'' అని ఆయన తెలియజేయుచున్నాడు. అవును, ప్రభువు అనుగ్రహించు సంతోషము పరిపూర్ణమైనదిగా ఉంటుంది. మనము అట్టి సంతోషము కొరకు ఎదురు చూస్తు ఉండనవసరములేదు. మనకు అవసరమైనదానికంటె మరి ఎక్కువగా దేవుడు మన యొక్క ప్రాణములోనికి సరఫరా చేయువాడై యున్నాడు. అన్నిటికంటె మిన్నగా, పరిశుద్ధాత్మ చేత సంపూర్ణంగా నింపబడియున్నప్పుడు మహిమాన్వితమైన సంతోషమును మనము కలిగియుంటాము. బైబిల్‌లో 1 పేతురు 1:8,9వ వచనములలో సెలవిచ్చినట్లుగానే, "మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మ రక్షణను పొందుచు, చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు.'' అవును, క్రీస్తునందు ప్రతి బిడ్డ కూడ చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందిస్తారు. మనము చెప్పనశక్యమును కానీ సంతోషముచేత నింపబడియున్నాము. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడియున్నప్పుడు, ముందుకు వచ్చి సాక్ష్యము చెప్పవలసినదిగా అడిగియున్నారు. అయితే, నా యొక్క ఆనందమును ఇతరులకు నేను వ్యక్తము చేయలేని స్థితిలో ఉండి ఉన్నాను. ప్రభువు నన్ను ఎంతగానో సంతోషముతో నింపియున్నాడు. నేను మాత్రము ప్రభువునందు ఆనందించుచు ఉండిపోయాను. తద్వారా, నేను ఒక్క మాట కూడా చెప్పలేకపోయాను. దేవుని ఆనందమును గూర్చి ఆలోచన చేయుచు ఎంతగానో కన్నీరు కారుస్తున్నాను. కారణము, మన దేవుడు సంపూర్ణంగా సంతోషం చేత నింపబడియున్నవాడు. ప్రభువు మనలను బట్టి కూడ ఆనందించువాడై యున్నాడు. తన ప్రేమ సంపూర్ణత చేత మనలను బట్టి, ఆయన సంతోషించువాడై యున్నాడు. ఆయన ప్రేమను బట్టియే మన హృదయములో సంపూర్ణమైన కొలతలో మనము సంతోషమును కలిగియుంటాము.


నా ప్రియులారా, సంతోషము కొరకై మరొక విధానమేదనగా, మనము దేవుని యొక్క వాక్యమును అధ్యయనము చేసియున్నప్పుడు అది మన హృదయాలలో ఆనందాన్ని కలిగిస్తుంది. కీర్తనలు 19:8వ వచనములో దావీదు ఏమని చెబుతున్నాడనగా, "యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును.'' అవును, దేవుని వాక్కులో జీవము కలదు. దేవుని యొక్క వాక్కు సంపూర్ణంగా సంతోషముతో నిండియున్నది. అయితే, మనము దేవునికి విరోధంగా పాపము చేసియున్నప్పుడు, అది మనకు శిక్షావిధిని కూడ కలుగజేయుచున్నది. అయినప్పటికిని మనము దేవునికి విధేయులైనప్పుడు దేవుడు మన భవిష్యత్తు కొరకైన వాక్కును మనకు అనుగ్రహిస్తాడు. అది మనకు ఎంతగానో సంతోషమును కలిగిస్తుంది. అందుకే యోహాను 15:10లో యేసు ప్రభువు ఈ రీతిగా తెలియజేశాడు, " నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన యెడల నా ప్రేమ యందు నిలిచియుందురు.'' మరియు తదుపరి వచనము యోహాను 15:11లో "మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను'' ప్రకారం మన సంతోషము పరిపూర్ణము కావాలని అంటున్నాడు. అవును, దేవుని యొక్క వాక్యము మనకు ఎంతో సంతోషమును తీసుకొని వస్తుంది. మన హృదయములు సంతోషము చేత ఉప్పోంగుచూ ఉంటాయి. సామెతలు 17:22లో ఏమని చెప్పబడియున్నదనగా, "సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.'' అవును, సంతోషముగల మనస్సు ఔషదము వంటిది. కనుకనే, దేవుని యొక్క వాక్యము మన హృదయములను మరియు దేహములను స్వస్థపరచును. అది మనలను ఎల్లవేళల సంతోషముగా ఉంచుతుంది. కాబట్టి, మీరు సంతోషభరితమైన హృదయమును కలిగియుందురు గాక. మీ హృదయములో ఎల్లవేళల సంతోషముతో గంతులు వేయుదురు గాక. దేవుని యొక్క వాక్యమును ఎల్లవేళల మీ హృదయములలో ఉంచుకొనండి. ఎల్లవేళల ప్రభువునందు ఆనందిస్తూ ఉండండి. మరల చెప్పుచున్నాను ప్రభువునందు ఆనందించండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.

Prayer:
మహిమాన్వితమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీవు మమ్మును సంపూర్ణమైన ఆనందంతో చూడాలని కోరుకున్నందుకై నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, మేము నేను కోరుకునే ఆనందం, శాంతి మరియు సంతృప్తిని నీవు మాత్రమే అనుగ్రహించగలవని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మేము ఈ లోకపు విషయాలు మరియు వ్యక్తులలో తృప్తి మరియు నెరవేర్పును వెదకుచున్నామని మేము అంగీకరిస్తున్నాను, కానీ వారిలో ఎవరూ కూడా మేము కోరుకునే లోతైన శాంతి సంతోషమును మాకు ఇవ్వలేరు. కనుకనే, ఈరోజు, మా జీవితంలో నీ సన్నిధిని కోరుతూ నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, ఎల్లప్పుడూ నీవు మాతో ఉంటూ, మమ్మును నీ సన్నిధితో నింపి, నిత్య సంతోషమునకు నడిపించుము. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మును నింపుము, తద్వారా మేము నీతో నింపబడి ఉండునట్లు చేయుము. ఎందుకంటే నీ సన్నిధిలో సంపూర్ణ ఆనందం కలదు. అలాగే, నీ యొక్క జీవముగల మరియు చురుకైన వాక్యాన్ని ధ్యానించడానికి మాకు కృపను మరియు అవగాహనను దయచేయుము. దేవా, దుఃఖముతో ఉన్న మా జీవితాలను అద్భుతమైన ఆనందంతోను నింపుము. ప్రభువా, ఈ లోకములోని ఆందోళనలు మరియు ఇబ్బందులతో మమ్మును ఎన్నటికి కూరుకు పోనివ్వకుండా, మేము ఎల్లప్పుడూ నీలో బలాన్ని, నిరీక్షణను, నిత్యమైన సంతోషాన్ని మరియు ఆనందాన్ని పొందుకొనునట్లు చేయుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.