నాకు అమూల్యమైన స్నేహితులారా, నేడు స్వాతంత్య్ర దినోత్సవమును జరుపుకుంటున్న మీకందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. నేడు మీరు ఎండిన నేల వలె ఉన్నారేమో? మీ జీవితములో అన్ని కూడ ఎండిపోయిన స్థితిలో ఉన్నాయని అంటున్నారేమో? నాకు జీవము లేదు, నా జీవితము ఎండిపోయిన స్థితిలో ఉన్నది కదా? అని తలంచుచున్నారేమో? కానీ, నేడు మీ జీవితాలను దేవుడు నీరు కట్టిన తోటవలె చేయగోరుచున్నాడు. మీ జీవితములో ప్రతి ఆశీర్వాదమును, జీవమును, సంతోషమును మీ మీదికి రాబోవుచున్నవి. కనుకనే, ఈ రోజు మీ జీవితము వర్థిల్లబోవుచున్నవి. అందునిమిత్తమై బైబిల్‌లో యెషయా 58:11వ వచనమును నేటి వాగ్దానము తీసుకొనబడినది. ఆ వచనము, "యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు.'' నేడు ఇది మీ కొరకైన దేవుని వాగ్దానమై యున్నది. కాబట్టి, ఈ వాగ్దానము ప్రకారం దేవుడు మిమ్మును దీవించును.

నేడు ఒక అద్భుతమైన సాక్ష్యమును మీతో పంచుకోవాలని నేను కోరుచున్నాను. తిరునెల్వేలికి చెందిన సహోదరులు మహేంద్రన్‌కు క్రీస్తుతో ఎటువంటి సంబంధం లేదు, క్రీస్తును గురించి ఏ మాత్రము కూడ అతనికి తెలియదు అన్నట్లుగా ఉండేవాడు. అతడు త్రాగుబోతుగాను, మద్యపానము సేవించుచుండేవాడు. అతడు అవిధేయునిగా ఉన్నందున అతని తల్లిదండ్రులు ఎంతో నిరుత్సాహముతో ఉండిపోయారు. అందునుబట్టియే, అతని బంధువులలో ఒక వ్యక్తి, అతనిని చూచి, ఈ సమస్యలన్నిటిలో నుండి నీవు బయటకు వచ్చుటకు నేను నీకు సహాయము చేస్తానని చెప్పాడు. అతనిని ఆలాగుననే, నేరుగా యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమునకు తీసుకొని వచ్చాడు. యేసు పిలుచుచున్నాడు Äౌవన భాగస్థుల పధకములో అతనిని భాగస్థునిగా చేర్పించారు. మరియు ప్రార్థనా గోపురములో ఉన్న ప్రార్థనా యోధులు అతని నిమిత్తము ఎంతో భారముతో ప్రార్థన చేశారు. ఆరోజు మొదలుకొని, దైవీకమైన సమాధానము అతని హృదయాన్ని నింపియున్నది. మహా అద్భుతంగా యేసు యొక్క శక్తి ద్వారా అతని యొక్క వ్యసనముల శక్తి అంతయు అతనిని విడిచిపెట్టి వెళ్లిపోయినది. అతడు నూతనమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. అతడు మరల వ్యాపారములో పాల్గొనడం ప్రారంభించాడు. అతడు యంత్రాలు కొనుగోలు చేసి, వాటిని అమ్మకం చేయుచూ, వ్యాపారమును కొనసాగించుచుండెను.

ఆ సమయములో అతని యొద్ద యంత్రాలు కొనుగోలు చేసిన వారు అతనికి ఆ వస్తువులకు తగిన డబ్బును తిరిగి చెల్లించలేదు. తద్వారా, అతనికి చాలా అప్పు మిగిలి పోయినది. అయినప్పటికిని అదే సమయములో యేసునకు సేవ చేయాలనే కోరిక అతనిలో ఉండెను. ఒకవైపునేమో, అప్పుల బాధ, మరొక వైపున యేసునకు సేవ చేయాలనే ఆశను కలిగియున్నాడు. ఆ సమయములో, తన యొక్క నగరములో యేసు పిలుచుచున్నాడు కూటములు నిర్వహించబడినవి. అతడు అక్కడికి వచ్చినప్పుడు, నేను వాక్యమును బోధించుచున్న సమయములో, అకస్మాత్తుగా ఆ కూటములో పాల్గొన వేలాదిమంది ప్రజలలో నేను అతని పేరు పెట్టి పిలిచాను. నేను, "మహేంద్రన్, నీవు అనేక కార్యములను గురించి గందరగోళంలో ఉండిపోయావు. ఏ దిక్కు వైపునకు వెళ్లాలలో నీకు తెలియలేదు. అన్నియు కూడ అంధకారమయముగా ఉన్నాయి. నేను ఈ లోకములో ఎలాగున జీవించాలి అని అనుకుంటున్నారేమో? కానీ, మీకు బహుమానము ఇవ్వడానికి దేవుని హస్తము మీ మీదికి వస్తున్నది. దేవుడు మీ నిమిత్తము నూతన ద్వారములను తెరువజేయుచున్నాడు'' అని చెప్పాను. అతడు ఈ ప్రవచనమును వినగానే, గొప్ప సమాధానము అతని హృదయాన్ని నింపియున్నది. దేవుడు అతనికి జవాబును అనుగ్రహించాడు. 4 నెలల కాలవ్యవధిలోనే అతనికి రావలసిన డబ్బు అంతయు తిరిగి రావడము జరిగినది. అంతమాత్రమే కాదు, అతడు ఇతరులకు ఇవ్వవలసిన డబ్బు అంతయు తిరిగి వారికి చెల్లించగలిగాడు. అద్భుతవిధంగా, అతడు అప్పులలో నుండి బయటకు వచ్చాడు. ఈ రోజున అతడు దేవునికి సేవ చేయుచున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.

అవును, నా ప్రియమైనవారలారా, నేడు దేవుడు ఆలాగున మీకును కూడ జరిగిస్తాడు. ఆయన మిమ్మును నీరు కట్టిన తోటవలె చేస్తాడు. ఇక మీదట మీ జీవితములో ఎండిపోయిన విధానము అని ఉండదు. ఎందుకంటే, యేసు మిమ్మును ప్రేమించుచున్నాడు. ఆయనే మీకు జీవమునై యున్నాడు. ఆయనే నిత్యమైన జీవమునై యున్నాడు. ఆయన జీవము ద్వారా మిమ్మును జీవింపజేయనైయున్నాడు. రండి, యేసు నామములో కలిసి ప్రార్థన చేద్దాం. నేడు మీ జీవితము ఎండిన స్థితిలో ఉన్నదని చింతించకండి, మీ జీవితాలను దేవుని చేతులకు సమర్పించండి, అప్పుడు ఆయన నేటి వాగ్దానము ద్వారా మీ జీవితములో అద్భుతాలను జరిగిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీ ప్రేమపూర్వక వాగ్దానానికి వందనాలు. దేవా, నీవు అసాధ్యమైన దేవుడు. ఇప్పుడు కూడా, దయచేసి మా జీవితంలో ఎండిన నేల వలె ఉన్నదానిని చూడుము, సమాధానము మరియు అభివృద్ధి లేకుండా, సమస్యలు మమ్మును ముంచి వేయుచున్నవి. కాబట్టి, నీ జీవముతో మమ్మును నింపి, మా జీవితము నీరు కట్టిన తోటవలెను, ఎల్లప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండునట్లుగా చేయుము. దేవా, సమస్యల ద్వారా మేము నీ సన్నిధిని అనుభవించలేకపోతున్నాము లేదా నీ స్వరాన్ని వినలేకపోతున్నాము. కానీ ఈ రోజు మేము నీ దగ్గరకు పరుగెత్తుకొని వచ్చియున్నాము. ప్రభువా, నీ ప్రేమతో మమ్మును కౌగలించుకొని మరియు మా ఆత్మను పట్టుకున్న ప్రతి భయం, ఆందోళన మరియు ప్రతికూల ఆలోచనలను నేడు మా నుండి తొలగించుము. దేవా, దయచేసి నీ పరిశుద్ధాత్మతో మమ్మును నింపి మరియు మమ్మును నూతన వ్యక్తులనుగా మార్చుము. యేసయ్యా, నేటి నుండి నీ సన్నిధిని మేము అనుభవించునట్లుగాను మరియు నీ జీవజలాలను మాలో ప్రవహించునట్లుగాను, నీలో జీవాన్ని, ఆనందాన్ని మరియు సమాధానమును అనుభవించడానికి మాకు సహాయము చేయుము. ప్రభువా, మమ్మును ఘనపరచుమనియు మరియు మా మొఱ్ఱలకు జవాబును దయచేయుము. యేసు నామంలో ఇతరులకు మేము ఆశీర్వాదకరముగా ఉండడానికి మమ్మును ఒక పాత్రగా ఉపయోగించుకొనుమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.